అనగనగా లక్ష్మీపురం అని ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక ముసలవ్వ ఉండేది. ఆ అవ్వకు ఎవరూ లేరు. ఒక రోజు అవ్వ మూడు కోడి గుడ్లు తెచ్చింది. రెండు గుడ్లను పగల గొట్టి పక్కన పెట్టుకుంది. మూడవ గుడ్డును కొట్టబోయేసరికి, ఆ గుడ్డులో నుండి, "అవ్వా! అవ్వా! నన్ను చంపకు" అని వినిపించింది. అవ్వకు ఆశ్చర్యమేసింది. జాగ్రత్తగా వినింది. శబ్దం గుడ్డు లోపలి నుండి వస్తున్నది. "అవ్వా! నేను చిన్న పిల్లవాణ్ని. నన్ను చంపకు. నన్ను మెల్లిగా ఈ గుడ్డు నుండి బయటకు తీయి" అని మాటలు వినిపించాయి.

అవ్వ గుడ్డుని మెల్లగా పగలగొట్టి అందులో నుండి బొటన వేలెడంత పిల్లాణ్ణి బయటకు తీసింది. వాడి అవతారం చూసి అవ్వకు భలే ముచ్చటేసింది. ఆ పిలగాణ్ణి చూసి, "తిందామని తెచ్చుకున్న గుడ్డును తిననీకుండా‌చేసావు, ఇప్పుడు నా ఆకలి ఎట్లా తీరేది?" అని అవ్వ అనింది. ఆ మాటలకు, "అవ్వా! నీ దగ్గరున్న రూపాయి ఇవ్వు. నేను వెళ్ళి నీకు కావలసిన కూరగాయలు, బియ్యం తీసుకొని వస్తాను," అని చిన్నోడు అన్నాడు. అవ్వ వాడికి రూపాయి ఇచ్చింది.

అది తీసుకొని బియ్యం అంగడికి వెళ్ళి అంగడాయన్ని గట్టిగా పిలిచాడు. అంగడాయన "ఎవరు పిల్చార్రా" అని అంతా వెతికాడు. కానీ ఆయనకు ఎవరూ కనబడలేదు. "అయ్యా! నేనిక్కడున్నాను చూడు, ఇదిగో నీ టేబిలు మీదున్నాను చూడు" అని పిలగాడు అరిచాడు. ఇప్పుడు అంగడాయనకు టేబిలు మీద వేలడంత పిలగాడు కనిపించాడు. "సరే, నీకేమి కావాల"ని ఆయన అడిగితే, పిలగాడు ఆయన చేతిలో రూపాయి పెట్టి, "నాకు ఒక చెవి నిండా బియ్యం, ఒక చెవి నిండా బ్యాళ్ళు (కందిపప్పు) పోయ"మన్నాడు.

"దానిదేముందిలే" అని, పిడికెడు బియ్యం తీసుకొని ఒక చెవిలో పోసాడు అంగడాయన. కానీ అది నిండ లేదు. ఇంకొన్ని పోసాడు. నిండ లేదు. సేర్లు, సేర్లు పోసినా నిండలేదు. చివరికి అంగట్లో ఉండే‌బియ్యం అంతా పిలగాడి చెవిలో పోసినా అది నిండలేదు. తర్వాత ఇంకొక చెవిలోకి ఇలాగే అంగట్లో ఉండే బ్యాళ్ళన్నీ కుమ్మరించేసాడు. చివరికి, "అయ్యా! నువ్వు నా చెవులు నిండేట్టుగా బియ్యం, బ్యాళ్ళు పోయలేదు కాబట్టి, నా రూపాయి నాకిచ్చేయి!" అని తన రూపాయి వెనక్కి తీసేసుకున్నాడు చిన్నోడు.

తరువాత వేరే వేరే అంగళ్ళ కెళ్ళి చక్కెర, గోధుమ పిండి లాంటివన్నీ సంపాదించాడు వాడు. కూరగాయల దుకాణానికెళ్ళి కావలసిన కూరగాయలన్నీ చెవుల్లో పోసుకున్నాడు. ఎన్ని సరుకులు చెవుల్లో పోసుకున్నా అతని చెవులు నిండలేదు. ఇలా బజారులోని సరుకులన్నీ చెవుల్లో పోసుకొని ఇంటికెళ్ళాడు.

అతన్ని చూస్తూనే, "ఏంటి నాయనా! ఖాళీ చేతుల్తో వచ్చావు?" అని అవ్వ అడిగింది. "అవ్వా! నీ కోసం చాలా‌తెచ్చానవ్వా! ముందు నువ్వు ఇంటి తలుపులు, కిటికీలు మూసేసి గవాచీ(ఇంటి కప్పుకు ఉండే చిన్న కిటికీ, గవాక్షం) తెరిచి పెట్టు" అన్నాడు. అవ్వ అలాగే చేసింది. పిలగాడు మిద్దెమీదికెళ్ళి, గవాచీ గుండా తన చెవులు పట్టుకొని కదిలించాడు.

అంతే! కుప్పలు కుప్పలుగా బియ్యం, బ్యాళ్ళు, గోధుమ పిండి, చక్కెర, పళ్ళు, కూరగాయలతో ఇల్లు నిండిపోయింది!! ఇది చూసి అవ్వ ఆశ్చర్యపోయింది. ఇప్పుడు అవ్వకు, పిల్లోడికి ఏం కష్టం లేకుండా చాలా రోజులు గడిచాయి.

కొన్ని రోజులకు వాళ్ళ రాజ్యానికి ఒక పెద్ద కష్టం వచ్చింది. ఒక పెద్ద రాక్షసుడు వచ్చి రాజ్యంలో చేతికి చిక్కిన ప్రజలను తినేస్తూ వచ్చాడు. అప్పుడు రాజు రాజ్యమంతా చాటింపు వేయించాడు - "ఎవరైతే ఆ రాక్షసుడిని చంపుతారో వాళ్లకు అర్ధ రాజ్యాన్నిచ్చి, నా కుమార్తెను కూడా ఇచ్చి పెళ్ళి చేయిస్తా" అని. రాజ్యంలోని వీరులు చాలా మంది రాక్షసుడిని చంపడానికి ప్రయత్నించి తమ ప్రాణాలను కోల్పోయారు.

ఈ విషయం తెలుసుకున్నాడు చిన్నోడు. ఎలాగైనా ఆ రాక్షసుడిని చంపాలని వాడికి పట్టుదల కలిగింది. ఒక్కడే ఒక చాకును తీసుకొని, రాక్షసుడుండే తావుకు బయలుదేరాడు. అవ్వ భయపడి అడ్డం వచ్చింది-"వద్దు నాయనా, ఆ రాక్షసుడు నిన్ను చంపేస్తాడు. నాకు తోడంటూ ఉండేది నువ్వొక్కడివే. వెళ్ళద్దు నాయనా" అని చెప్పి, వాడు బయటకు పోకుండా ఇంటి తలుపులు, కిటికీలు వేసి ఏదో పని మీద బయటకు వెళ్ళింది.

అవ్వ అటు పోతూనే, పిలగాడు తలుపు సందులోంచి దూరి బయటకు వెళ్ళాడు. గబగబా నడిచి రాక్షసుడు ఉండే చోటుకు వెళ్ళాడు. రాక్షసుడు ఇతన్ని గమనించలేదు. పిలగాడు రాక్షసుడి దగ్గరికి చేరుకొని మెల్లగా అతని కాళ్ళకుండే వెంట్రుకలను పట్టుకొని అతని పైకి ఎక్కాడు. అట్లా అట్లా తలపైకి ఎక్కాడు. రాక్షసుడి ప్రాణం అతని తలపైన ఉండే కొమ్ములో ఉందని పిలగాడికి తెలుసు. తను తెచ్చిన చాకుతో కొమ్మును నిదానంగా కోయడం మొదలు పెట్టాడు. రాక్షసుడు ఎటు తల తిప్పితే, పిల్లవాడు దానికనుగుణంగా కోసాడు. తలమీద ఏదో చికాకుగా ఉందని రాక్షసుడు తన చేత్తో కొమ్మును గట్టిగా కొట్టాడు. అంతే ! కొమ్ము విరిగిపోయింది!! రాక్షసుడు చనిపోయాడు!

రాక్షసుణ్ణి ఎవరు చంపారో తెలిసింది రాజుగారికి. ఆ పిలగాడ్ని తన ఆస్థానానికి రమ్మని ఆయన కబురు పెట్టించాడు. మరుసటి రోజున చిన్నోడు బాగా ముస్తాబై రాజధానికి బయలుదేరాడు. వాళ్ళ ఊరి నుండి రాజధానికి వెళ్ళే దారిలో ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో పోతా ఉంటే "నిన్ను తినేస్తా, నాకు చాలా ఆకలిగా ఉంది" అని గట్టిగా అరుస్తూ ఒక సింహం అతని ముందుకు దూకింది. సింహాన్ని చూసి పిలగాడు ఏమాత్రం భయపడలేదు. "సింహం, నేను నీకోసమని మంచి ఎద్దులు రెండు ఇంటి దగ్గర పెట్టి ఉన్నాను. నాతో రా!" అని సింహాన్ని తన ఎడమ చెవిలోకి ఎక్కించుకున్నాడు.

ఇంకొంచెం దూరం వెళ్ళాక ఒక పులి ఎదురైంది. అది కూడా పిలగాణ్ణి తినేస్తానని భయపెట్టింది. "అయ్యో, పులిబావా! వేలెడంత ఉండే నేను, కొండంత ఉండే మీకు ఎక్కడికి సరిపోతాను? నీకోసం మా ఇంట్లో మేకలు తెచ్చి పెట్టి ఉన్నాను. రా, పోదాము" అని పిలగాడు పులిని తన కుడి చెవిలోకి ఎక్కించుకున్నాడు. అలాగే దారిలో ఎదురైన ఏనుగుకు చెరుకు గడలు, నక్కకు కోళ్ళు ఇస్తానని ఒక దాన్ని ఎడమ ముక్కులోకి, ఇంకోదాన్ని కుడి ముక్కు లోకి ఎక్కించుకున్నాడు. అడవి పిల్లులు ఎదురై వాణ్ణి తినేస్తామంటే "మీకోసం మాఇంట్లో చాలా‌ఎలకల్ని పెంచుతున్నా" అని చెప్పి, వాటిని జేబులోకి వేసుకున్నాడు. ఇట్లా నడుస్తూ పోతా‌ఉంటే అతనికి ఒక నది అడ్డం వచ్చింది. "నాకు నిప్పు ఇస్తేనే నేను నిన్ను దాటనిచ్చేది" అని ఆ నది మొండికేసింది. "అయ్యో, నా దగ్గర ఇప్పుడు నిప్పు లేదు. నేను రాజాస్థానానికి పోతున్నా. అక్కడ చాలా నిప్పు ఉంది. అక్కడికి రా, ఇస్తాను" అని నదిని మొత్తం తన నోట్లో పోసుకున్నాడు చిన్నోడు.

ఇన్ని చేసుకొని చివరికి రాజు దగ్గరకు చేరుకున్నాడు అతను.

రాజు ఆ పిలగాణ్ణి చూసి చాలా నిరాశపడ్డాడు. "వేలెడంత ఉండే ఇంత చిన్నవాడికా‌, నా కూతుర్నిచ్చి పెళ్ళి చేసేది? అలా వీలు కాదు" అనుకున్నాడాయన. "వేలెడంత పిలగాణ్ణి పట్టుకొని ఎలకల బొక్కలో వేసేయండి" అని భటుల్ని ఆజ్ఞాపించాడు. ఎలకల బొక్కలో పడగానే చిన్నోడు తన జేబులో నుండి పిల్లుల్ని బయటికి తీసి వదిలాడు. అవి ఎలకలన్నింటినీ తినేసి అడవిలోకి వెళ్ళిపోయాయి.

చావకుండా‌ ఎలకల బొక్క బయటకొచ్చిన పిలగాణ్ణి పట్టుకొని భటులు కోళ్ళ గూటిలోకి వేసారు. అంతే! పిలగాడు తన కుడి ముక్కులో నుండి నక్కల్ని వదిలాడు. అవి కోళ్ళను తినేసి అడవిలోకి వెళ్ళి పోయాయి. ఇంకా బతికున్న పిలగాణ్ణి భటులు మేకల మందలోకి విసిరారు. అపుడు పిలగాడి కుడి చెవిలోంచి పులి వచ్చి మేకల్ని తినేసింది.

తర్వాత అతన్ని చెరుకుతోటలోకి విసిరేసారు. అప్పుడు అతని ఎడమ ముక్కులోనుండి ఏనుగు వచ్చి చెరుకంతా తినేసి సంతోషంగా వెళ్ళి పోయింది.

ఎంతకీ చావని పిలగాణ్ణి భటులు ఎద్దుల మందలోకి విసిరేసారు. "ఎద్దుల కాళ్ళ కింద పడి చస్తాడులే" అని భటులు అనుకుంటే, అతని ఎడమ చెవిలోనుండి వచ్చిన ఒక సింహం ఎద్దులన్నింటినీ తినేసి వెళ్ళి పోయింది.

చివరికి భటులు ఒక గుంత తవ్వి, అందులో అతన్ని పడేసి, గడ్డి వేసి నిప్పంటించారు. అప్పుడు పిలగాడు తన నోట్లో నుండి నదిని బయటకు వదిలాడు. అది నిప్పును ఆర్పేసి వెళ్ళి పోయింది.

ఈ పిలగాడు సామాన్యుడు కాడని రాజుకు అర్థమైపోయింది. ఇంక ఏమీ అడ్డు చెప్పకుండా అర్ధ రాజ్యమిచ్చాడు. తన కూతుర్నిచ్చి వివాహం చేసాడు. చూస్తూండగానే పిలగాడు కూడా పెద్దవాడయిపోయినాడు. రాజ్యానికి ఏ కష్టాలూ లేకుండా అందరూ సుఖంగా జీవించసాగారు!