రామాపురంలో రాజప్ప అనే ధనిక వర్తకుడొకడు ఉండేవాడు. అతని భార్య పేరు సరళమ్మ. సరళమ్మకు కొత్త బట్టలంటే చాలా ఇష్టం. రోజుకు కనీసం మూడు సార్లయినా బట్టలు మార్చేది. ఆమె ఇష్టానికి తగినట్లు రాజప్ప ఆమెకు చాలా బట్టలు కొనిపెట్టేవాడు.
ఒక రోజు ఉదయం సరళమ్మ బీరువాలో నుండి ఒక కొత్త చీర తీసింది- కట్టుకుందామని. ఎందుకో ఆ చీర ఆమెకు పెద్దగా నచ్చలేదు. దాన్ని కొంచెం వెలుతురుకు పెట్టి అటూ ఇటూ తిప్పి చూసింది- బాగా అనిపించలేదు- అంతే! విపరీతమైన కోపం వచ్చేసింది. రుసరుసలాడుతూ చీరను కిటికీ గుండా బయటకు విసిరేసింది!
రోడ్డు మీద నడుస్తూ పోతున్న ఒక బిక్షగాడి మీద పడింది ఆ చీర. అతను ఓసారి తల పైకెత్తి చూసి, అటుపైన 'ఆ చీరను ఏం చేద్దామా' అని ఆలోచించాడు. వేసవి కాలమేమో, ఎండ బాగాకాస్తున్నది. ఎండ తగలకుండా ఆ చీరని నెత్తి మీద వేసుకొని నడక సాగించాడు భిక్షగాడు.
అతని తల మీదున్న చీరను చూసింది ఒక పేదరాలు. ఎన్నాళ్ళుగానో ఒక మంచి చీరను కొనుక్కోవాలనుకుంటోందామె. చీర నచ్చితే ధర నచ్చేది కాదు. ఇప్పుడు ఈ భిక్షగాడి తలమీది చీర ఆమెకు తొలిచూపులోనే నచ్చిపోయింది. చీర విలువ తెలీని భిక్షగాడు దాన్ని ఆమెకు కారు చౌకగా ఇచ్చేశాడు కూడానూ- ఇంతా చేసి ఆ పేదరాలు ఎవరో కాదు- రాజప్ప ఇంట్లో పని మనిషే!
మరుసటి రోజు పనిమనిషి కట్టుకొచ్చిన కొత్త చీరను చూసింది సరళమ్మ. ఆమె దాన్ని గుర్తు పట్టలేదు గానీ, ఏ మనసున ఉన్నదో, ఆ చీర ఇప్పుడు ఆమెకు చాలా నచ్చేసింది! "అంతమంచి చీరను తను కాకుండా, తన పనిమనిషి కట్టుకోవటమేంటి?!" అనిపించింది. "ఎట్లాగైనా ఆ చీరనే తెచ్చివ్వు" అని పోరింది రాజప్పను.
"పని మనిషి కట్టిన చీర నీకెందుకు, ఇంకా మంచిది కొనిస్తాను!" అని రాజప్ప ఎంత చెప్పినా, సరళమ్మ వింటేగా?! చివరికి రాజప్ప ఒక మంచి పట్టుచీర కొనుక్కొచ్చి, దాన్ని పని మనిషికి ఇచ్చాడు. అటుపైన ఆమె కట్టిన చీరను తీసుకొచ్చి ఇచ్చి, భార్య ముచ్చటా తీర్చాడు.
అది తను కిటికీ గుండా పారేసిన చీరే అని తెలియదు సరళమ్మకు . ఇప్పుడు మరి ఆ చీర అంటే ఆమెకు ప్రాణం!