పూర్వం చోళ రాజ్యంలో వినయుడు, విక్రముడు అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. వారు గొప్ప జమీందారుల బిడ్డలు. ఏ విధమైన ఆడంబరాలకూ లోటులేనివారు. వారిలో వినయుడు పొదుపరి. వస్తువుల యొక్క విలువ తెలిసినవాడు. విక్రముడు దుబారీ. ఎంత ఖరీదైన వస్తువయినా ’పోతే పోయిందిలే మరొకటి వస్తుంది’ అనే భావన కలవాడు.
విక్రముడు ఎప్పుడూ వినయుణ్ణి హేళన చేస్తూండేవాడు: ’శునకాన్ని కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టినా దాని బుద్ధి మారదట. భగవంతుడు నీకు ధనికుని జన్మనిచ్చినా పనికిరాని వస్తువులను కూడా దాస్తావెందుకురా?’ అని ప్రశ్నించేవాడు. దానికి వినయుడు వినయంగా ’మిత్రమా! సృష్టిలో పనికిరాని వస్తువు అంటూ ఏదీ లేదు. ధనధాన్యాలు స్థిరమైనవి కావు. పొదుపే మనిషికి శ్రీరామ రక్ష. అందుకే "తిన్నది బలం పశువుకూ, ఉన్నది బలం మనిషికి" అని పెద్దలు చెబుతుంటారు’ అని సమాధానం చెప్పేవాడు. ఇలా ఈ విషయమై వారిద్దరికీ వాగ్వివాదం జరుగుతూ ఉండేది.
ఒకసారి మిత్రులిద్దరూ ఒక దట్టమైన అడవిలోకి షికారు పోయారు. ప్రకృతి అందాలను తిలకిస్తూ దారి తప్పారు. దోవ వెతుక్కుంటూ పోతూండగా వినయుడు హఠాత్తుగా రథం ఆపాడు. ’ఏమి జరిగిందో’ అని విక్రముడు ఆందోళన చెందుతుండగానే, వినయుడు రధం దిగి, రహదారి పక్కన పడి ఉన్న ఓ ఇనుప సీలను పట్టుకువచ్చాడు. దాన్ని చూసిన విక్రమునికి అంత కంగారులోనూ నవ్వు ఆగలేదు: " మిత్రమా, ఓ ఇనుప ముక్కకోసం ఇంత హంగామా చేశావా?" అని పగలబడి నవ్వాడు. వినయుడు మాత్రం మౌనంగా రథాన్ని నడుపుతూపోసాగాడు.
ఆఖరికి వారికి ఓ గిరిజన గ్రామం కనిపించింది. వారు పోయి తమ పరిస్థితిని అక్కడి జనాలకు వివరించి చెప్పుకున్నారు. గిరి పుత్రులు వారిని పుట్టతేనె, పళ్లతో గౌరవించారు. అడవిదార్లు తెలిసినవారు కాబట్టి, చిన్నదారిని ఒకదాన్ని చూపి " ఈ దారి వెంట తిన్నగా పోండి, కానీ ఒక్క విషయం " ఈ అడవిలో ఏనుగుల మందొకటి ఎక్కడినుండో వచ్చి సంచరిస్తున్నది. మా పంటలపైనా, గిరిజన గ్రామాలపైనా పడటమే కాకుండా, రాత్రివేళల్లో రహదారివెంట పోయే బాటసారులను కుమ్మి చంపుతున్నాయి. మీరు వీలయినంత త్వరగా, పొద్దుపోకనే ఈ అడవిని దాటి వెళ్తే మంచిది" అని హెచ్చరించారు.
వారు చూపిన దారివెంట వినయుడు రథాన్నివేగంగా నడపసాగాడు. రథం భయంకరారణ్యంలో శరవేగంగా సాగుతోంది. సూర్యుడు పశ్చిమాద్రి వైపుకు కృంగిపోతున్నాడు. ఇంతలో వారి రథచక్రాన్ని ఆపే సీల పుటుక్కుమని విరిగిపోయింది. చాలా దారుణమైన ప్రమాదం జరిగేదే, కానీ అన్నిటికీ సిద్ధంగా ఉన్న వినయుడు నేర్పుతో రథాన్ని ఆపాడు.
సరిగ్గా అప్పుడే ఆ దగ్గరలోనే ఏనుగుల ఘీంకారాలు వినిపించాయి. ’ఆ కౄరమృగాలకు తమ జీవితాలు బలికావలసిందేనా?’ అని విజయుడు చింతిస్తూండగానే, వినయుడు తను దాచుకొన్న ఇనుప సీలను రథచక్రానికి బిగించాడు; ఏనుగుల గుంపు ఇంకా తమను సమీపించకముందే రథాన్ని ముందుకు నడిపించి, క్షేమంగా నగరానికి చేర్చాడు.
అప్పుడు విక్రముడు వినయంతో "మిత్రమా! నన్ను క్షమించు. సృష్టిలో పనికిరాని వస్తువు అంటూ ఏదీ లేదు. సమయానికి ఏ చిన్న వస్తువు లేకపోయినా పెద్ద ప్రమాదం ముంచుకురావచ్చు. ఇకనుంచీ నేను కూడా నీలా పొదుపుగా, ప్రతి వస్తువునూ జాగ్రత్తగా సంరక్షిస్తూ జీవిస్తాను" అన్నాడు. మిత్రునిలో వచ్చిన మంచి మార్పుకు సంతోషించాడు వినయుడు.