రామాపురం ప్రజల ముఖ్యవృత్తి వ్యవసాయం. పరమశివం కూడా రైతే. వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయంతోటే కుటుంబాన్ని పోషిస్తూండేవాడు. మొదట్లో అతనికి రెండెకరాల పొలం, రెండు ఆవులు మాత్రమే ఉండేవి.
అయితే, ఆవుల వల్ల పరమశివానికి రెండు లాభాలు కలిగాయి: పొలం దున్నడంతో పాటు అవి పాలను కూడా ఇచ్చేవి. అంతేకాక, ప్రతి సంవత్సరమూ దూడలను కూడా ఇచ్చేవి. ఆ దూడలు పెరిగి పెద్దవైనాక అమ్మితే డబ్బులైనా వచ్చేవి, లేక వాటిని ఉంచుకుంటే పనైనా చేసిపెట్టేవి. ఇలా పరమశివం ఇంట్లో పశుసంపదతో పాటు, ధాన్య సంపద కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చెందింది.
పరమశివానికి ఇద్దరు పిల్లలు. ఇద్దరినీ ఊళ్ళో ఉన్న బళ్ళో చేర్పించాడు. పిల్లలిద్దరికీ బాగా చదువు అబ్బడంతో చాలా సంతోషపడ్డాడు. వాళ్లను పైచదువుల కోసం పట్నానికి పంపాడు. వాళ్లు మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని కలలు కన్నాడు.
అయితే ఆ తర్వాత వెంటనే కరువు మొదలైంది. ఆదాయం కరవైంది. అయినా మొక్కవోని ధైర్యంతో కష్టపడ్డాడు పరమశివం. వచ్చే కూసిన్ని డబ్బులతో పిల్లల్ని చదివించాడు. పిల్లలుకూడా తండ్రికి పొలంపనుల్లో సాయపడేవారు. చదువుతోపాటు వ్యవసాయం కూడా నేర్చుకున్నారు; ఇంటికొచ్చినప్పుడల్లా పొలం పనులు చేస్తూండేవారు. చదువులు పూర్తవ్వగానే ఇక ఉద్యోగాల వేటలో పడ్డారు.
పరమశివం మాత్రం పిల్లలతో "ఎందుకురా, ఉద్యోగాలూ సద్యోగాలూ మనకు? కోటి విద్యలు కోండ్రకు వెలకాదురా" అనేవాడు. "మమ్మల్ని ఎందుకు చదివించినట్లు, మరి?" అని పిల్లలు అడిగితే, తండ్రి "అరే, పిచ్చి నాగన్నలారా! విద్య విజ్ఞానాన్ని ఇస్తుంది. విజ్ఞానం లోకజ్ఞానాన్ని కలిగిస్తుంది. వినయాన్ని ఇస్తుంది. సుఖాన్ని ఇస్తుంది. గౌరవాన్ని ఇస్తుంది. మిమ్మల్ని మంచి పౌరుల్ని చేయాలన్నది నా ఆశ. అందుకే మిమ్మల్ని చదివించింది" అనేవాడు.
పిల్లలు మాత్రం తండ్రి అభిప్రాయాలతో ఏకీభవించలేదు. ఉద్యోగాల వైపే మొగ్గు చూపారు. "ఎప్పటికైనా భూమిని నమ్ముకోవాలి, అది మనల్ని రక్షిస్తుంది" అని నమ్మిన పరమశివం చేసేదేమీలేక ఊరుకున్నాడు.
పరమశివం ఇద్దరు కొడుకులూ ఐటి కంపెనీలలో స్థిరపడ్డారు. కొన్ని రోజులు హాయిగా, ఆనందంగా సాగాయి. కానీ కాలం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు కదా! ఐటి రంగంలో కూడా, వ్యవసాయ రంగంలో మాదిరే కరువు కాటకాలు ప్రారంభమయ్యాయి. ఆర్థికమాంద్యం మొదలైంది. ఐటీ కంపెనీలు ఒక్కటొక్కటిగా మూతబడుతున్నాయి. చాపకింద నీరులా ఉద్యోగుల్ని తొలగించడం మొదలు పెట్టాయి.
దీనికి తోడు బడా రాజుల కుంభకోణాలు, బోర్డులు తిప్పేసే కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రైతు బిడ్డలిద్దరూ కూడబెట్టిన కాగితపు డబ్బు చిత్తుకాగితాలతో సమానమైంది. ఆశాసౌధం పేక మేడలా కూలిపోవడంతో వాళ్ల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా తయారైంది పాపం. ’ఇంటికెళ్లాలా, లేక ఆ దురవస్థలో నలిగిపోవాలా’ అని అనుకుంటుండగానే వారు అనుకున్నంతా అయ్యింది: వారి ఉద్యోగాలు కూడా పోయె.
రైతు కొడుకులిద్దరూ నిరాశతో ఇంటికెళ్ళారు. అప్పుడా తండ్రి "ఎందుకురా భాదపడతారు? మనకు మన రెండెకరాల పొలం ఉందిరా, దిగులు పడకండి. వెళ్ళండి. వెళ్లి పొలంలో కష్టపడండి" అని ప్రోత్సహించాడు. నిరాశను ఆశగా మార్చుకొని, టోపీ ధరించే తలకు రుమాలు చుట్టి, టై కట్టి టక్కు చేసే తమ శరీరాలకు పంచె, బనియన్ వేసి, లాప్టాప్ పట్టే చేతులతో నాగలి పట్టి, అసలు సిసలు రైతుల్లానే దుక్కి దున్ని, నారుపోసి, పంట వేశారు.
అదృష్టమో, మరేమో, పంట బాగా పండింది. ఇక ఆపైన వారంతా ఉన్న పొలాన్ని సాగు చేస్తూ వచ్చిన సంపదను కూడబెట్టి ఇంకొంత పొలాన్ని కొన్నారు. తమకున్న విజ్ఞానాన్ని ఉపయోగించి భూమిలో పంటమార్పిడులు చేస్తూ, సేంద్రియ ఎరువులు వాడి సిరులు పండించారు. ఆదర్శ రైతులుగా పేరుగాంచారు.