అనగనగా ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకి ఒక కొడుకు, నలుగురు కూతుళ్ళూ ఉండేవారు. రైతు కొడుకును పట్నంలో చదివించాడు. కూతుళ్ళు నలుగురికీ పెళ్ళిళ్లు చేసేశాడు. చదువు పూర్తై ఇంటికొచ్చిన కొడుక్కి, తండ్రి చేస్తున్న వ్యవసాయంలో పస లేదనిపించింది. అతను తన తండ్రితో అన్నాడు- "నాన్నగారూ! ఇక మీదట పంటా,పొలం నేనే చూసుకుంటాను. మీరు విశ్రాంతి తీసుకోండి" అని. తండ్రి సరేనన్నాడు. మొత్తం పొలాన్నీ కొడుకు చేతికి ఇచ్చి, తాను కూతుళ్ళ ఇళ్ళలో ఉండి వస్తానని పోయాడు.
రైతుకొడుక్కు తండ్రి నుంచి కొంత డబ్బు, చాలా పొలమూ సంక్రమించాయి. చాలా పొలం రాగానే అతనికి చాలా ఆశలు కూడా వచ్చాయి. తన పొలంలో ఏవేవో పంటలు వేసినట్టూ, అవన్నీ బాగా పండి తనొక పెద్ద కోటీశ్వరుడైపోయినట్టూ చాలా కలలు వచ్చాయి. లాభాపేక్షతో అతను పొలంలోని కొంత భాగంలో ఒక వెయ్యి మామిడి మొక్కలు నాటాడు.
మామిడితోట వేస్తూ వేస్తూనే అతను చేతికొచ్చే పంట మీద లెక్కలు వేశాడు: "వర్షాలు బాగా కురిసి, మామిడి మొక్కలన్నీ త్వరగా పెరిగి, అవన్నీ బాగా విరగకాసి తనను పెద్ద ధనవంతుడిని చేస్తాయి. అప్పుడు తను మరో కొత్త పొలాన్ని కొనుక్కోవచ్చు. అందులో మరో తోట వేసి ఇంకా డబ్బులు సంపాదించవచ్చు" అని.
రైతుబిడ్డ అనుకున్నట్టుగానే వర్షాలు బాగా కురిసాయి. మూడు సంవత్సరాలకే మామిడి మొక్కలు పెద్దవై పూతకొచ్చాయి. మామిడి మొక్కలన్నీ బాగా పూసినందుకు, తన కోరిక నెరవేరనున్నందుకు రైతుబిడ్డ చాలా సంతోషపడ్డాడు . అతను ఇప్పుడు బలే హుషారుగా కనిపిస్తున్నాడు.
ఈ సారి అతను మామిడి పూతమీద లెక్కలు వేసాడు - "చెట్లు పూసిన పూతంతా నిలబడినట్లయితే కొమ్మలు మోయలేనన్ని కాయలొస్తాయి. ఆ కాతను చూసిన ఏ వ్యాపారైనాసరే తన తోటకు అడిగినంత డబ్బులు ఇవ్వడానికి వెనుకాడడు. ఇక తను లక్షాధికారి అయిపోవడం ఖాయం".
కొన్నాళ్ళకు పూత కాతగా మారింది. రైతు ముఖం కళకళలాడుతోంది ఇప్పుడు అతని తోటలాగానే. పూత బాగానే నిలిచింది. "అనుకున్నంత కాపు వచ్చినట్టే ఇక".
ఇక కాత మీద లెక్కలు మొదలుపెట్టాడు కర్షకపుత్రుడు. పిందెలన్నీ కాయలై, కాయలు పండ్లై తనను ధనవంతుణ్ణి చేసే సమయం దగ్గరపడుతున్నది అని, చేతికందబోయే మామిడి పంటపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురుచూపులు చూస్తూ కలలు కంటున్నాడతను.
అంతలోనే అకాల వర్షం ఒకటి వచ్చింది. గాలులు విపరీతంగా వీచాయి. ఆ గాలులకు మామిడి తోట బాగా దెబ్బతిన్నది. మామిడి పిందెలు చాలా నేలరాలిపోయాయి. కొన్ని చెట్ల కొమ్మలుకూడా విరిగిపోయాయి. రైతుబిడ్డకు గుండె ఆగినంత పనైంది. తన కలల తోటను అలా చూసుకొని ఆ రైతు మనసు ఎంతో కష్టపడింది. తీవ్రమైన వేదనకు గురైంది.
కొన్నాళ్ళు గడిచాయి. తుఫాను తాకిడి నుండి మామిడితోటతో పాటు రైతు కూడా కోలుకున్నాడు. ఇప్పుడు మామిడికాయలు పెరిగి పెద్దవైనాయి. కాపు తక్కువవ్వటం వల్ల, నిలిచిన కాయలన్నీ లావుగా, బలంగా తయారయ్యాయి. ఆ బరువుకి మామిడిచెట్ల కొమ్మలు నేలను తాకుతున్నాయి. అంతేకాక తుఫాను కారణంగా ఆ ప్రాంతంలోని మామిడితోటలన్నీ బాగా దెబ్బతినడంతో ఉత్పత్తి తగ్గి, మంచి ధర పలికేటట్టుంది మార్కెట్ పరిస్థితి. రైతుబిడ్డ మళ్ళీ లెక్కలు వేయటం మొదలెట్టాడు: "కాయలు తక్కువే అయినా, తోట పెద్దది కాబట్టీ, పైగా మార్కెట్ ఆశాజనకంగా ఉన్నది కనుక, పెద్దమొత్తమే చేతికందేటట్టున్నది. ఇక పెట్టుబడులూ, ఇంటి ఖర్చులూ పోనూ మిగిలే మొత్తం పెట్టి పొలాన్ని కొని, అందులో మరో తోట వేసి, బాగా డబ్బు సంపాదించొచ్చు".
అంతలోనే ఒకనాటి రాత్రి అడవి పందుల గుంపొకటి మామిడితోట మీద దాడి చేసి, అందిన కాయలన్నింటినీ కొరికి పారేశాయి. అది చూసిన రైతు మనసుకూడా ముక్కలు చెక్కలయ్యింది. తను అనుకున్నదీ, ఆశపడినదీ ఏదీ జరగకుండా పోతున్నందుకు రైతుబిడ్డ ఎంతగానో దు:ఖించాడు. తన ఆశల హరివిల్లు రంగులలో ఒక్కొక్కటి మాయమయిపోతుండటాన్ని చూసుకుంటే అతనికి పట్టరానంత దు:ఖం వచ్చింది.
ఇంకొన్నాళ్ళు గడిచాయి. తోటలోని మామిడికాయలు దోరవయ్యాయి. చిలకలూ, గోరింకలూ తోటకు రావడం మొదలయ్యింది. అవి తమ కంటికి నచ్చిన మామిడిపండ్లని కొరికి తినడం మొదలుపెట్టాయి. పండ్లను కోసే సమయానికి మరికొన్ని కాయలు తగ్గిపోయాయి. కానీ రైతుకి ఇప్పుడు ఇంతకు ముందు కలిగినంత బాధ కలగలేదు. అనుభవం అతన్ని రాటుదేలుస్తున్నది:’ఇప్పుడున్నది శాశ్వతంగా ఉంటుంది’ అనుకునే ధోరణి కాస్త తగ్గింది.
చివరికి మామిడి పళ్ళు కోతకొచ్చాయి. రైతు వాటన్నిటినీ కోసి మార్కెట్ కు తీసుకెళ్ళాడు. అక్కడ వాటికి మంచి ధర వచ్చింది. పెట్టుబడులు పోను అతనికి మంచి మొత్తమే చేతికందింది- కానీ రైతుబిడ్డకు ఆ మొత్తంతో సంతృప్తిమాత్రం లేదు- ’తను అనుకున్నదేమిటి, ఇప్పుడు అయ్యిందేమిటి?’ నిరుత్సాహం అతన్ని ఆవరించింది. ’వ్యవసాయం గిట్టుబాటుకాదు. దీనికంటే హాయిగా పట్నాలలో ఉండి వ్యాపారమో, ఉద్యోగమో చేసుకోవటం మేలు!’అనిపించసాగింది.
ఈలోగా తండ్రి రైతు తన నలుగురు కూతుళ్ళ ఇళ్ళల్లో ఒక్కో సంవత్సరం ఉండి ఇంటికి తిరిగొచ్చాడు. ఇంట్లో పుత్రరత్నం వాడిపోయి ఉన్నాడు. అనుభవజ్ఞుడైన తండ్రికి అంతా అర్థమైంది:
"నాయనా! మనిషి బ్రతకాలంటే ఆహారం ఉత్పత్తి అవ్వవలసిందే. ఏదిలేకున్నా జీవించవచ్చుగానీ ఆహారం లేకుండా మన మనుగడ ఉండదు. అందువల్ల మనం చేస్తున్న పని- ఆహారోత్పాదన- అత్యున్నతమైన, అత్యవసరమైన, చాలా అర్థవంతమైన కార్యం. ఉద్యోగాలు ఈరోజు ఉండచ్చు; రేపు ఊడవచ్చు. ఇంకొకళ్ళ అడుగులకు మడుగులొత్తితే తప్ప ఈరోజుల్లో ఉద్యోగం నిలుపుకోలేరు. ఇక వ్యాపారమంటావా, ఉత్పాదనే లేనినాడు వ్యాపారం ఎందుకు పనికొస్తుంది? నాయనా, మన పనిని కేవలం ధనసంపాదన మార్గంగా చూడకు. వ్యవసాయం ఒక జీవన విధానం. పదిమందికికాదు- వేలాదిమందికి అన్నంపెట్టే సత్కార్యం మన చేతులమీదుగా జరుగుతున్నదని గ్రహించు. వ్యవసాయం గిట్టుబాటు కాదని బాధ పడకు. బళ్ళు ఓడలౌతాయి, ఓడలు బళ్ళవుతాయి. ఏ వృత్తిలోని కష్టసుఖాలు ఆ వృత్తిలో ఉండనే ఉంటాయి. నేడు గిట్టుబాటుకాని వ్యవసాయం రేపు గిట్టుబాటవుతుంది. సుఖాలు శాశ్వతం కాదని మనుషులకు త్వరలోనే గ్రహింపుకు రాగలదు. పెట్రోలు వంటి శక్తివనరులు అయిపోవచ్చిననాడు, మనిషి తనకు నిజంగా అవసరమైన ఆహారోత్పత్తులకు సరైన మూల్యం చెల్లించక తప్పదు. అన్నిటికీ ఓపిక అవసరం నాయనా, జీవితంలో పారిపోవటం కాదు, పరిస్థితులను మనకు అనుగుణంగా మార్చుకునేందుకు నిలిచి పోరాడటం అవసరం. వ్యవసాయ రంగానికి నీవంటి యువకుల అవసరం ఉన్నది. నీవు నిలిచి పోరాడితే, నీతోపాటు కృషి సమాజం మొత్తానికీ మేలు జరుగుతుంది. ఆలోచించి చూడు" అన్నాడు.
రైతుబిడ్డకు ఆలోచన మొదలైంది. రెట్టించిన ఆత్మ విశ్వాసంతో, వ్యవసాయ యజ్ఞాన్ని కొనసాగించాలని కృతనిశ్చయుడయ్యాడు.