ఒక చెవిటాయన కాడెద్దులు తోలుకుని దారెంబడి పోతూండగా, ఇంకొకాయన ఎదురొచ్చి అడిగాడు, "చిన్నపల్లికి ఏ దారి పోతుందన్నా?" అని.
ఎద్దులాయనకు వేరే ఏదో వినిపించింది. ఆయన చెప్పాడు, " ఎర్రెద్దేమో ఎనిమిది నూర్లు, పసెద్దేమో పది నూర్లు" అని.
బాటసారి మళ్ళీ అడిగాడు, దారి విషయం.
ఎద్దులాయన మళ్ళీ చెప్పాడు గట్టిగా: "చూడయ్యా! నీ కిష్టమైతే కొను. లేకపోతే ఫో. నేను అంతకంటే పైసా కూడా తగ్గేదే లేదు!" అని.
అప్పటికి ఆ బాటసారికి పరిస్థితి అర్థమైంది. ఇక అతను వెనక్కు చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
చెవిటాయన ఇంటికి చేరుకున్నాడు. అక్కడ ఆయన సంగతి తెలిసిన భార్య ఆయన మీదకి ఒక గులకరాయిని విసిరింది. అన్నానికి రమ్మన్నట్టు సైగ చేసి పిలిచింది.
అతను భోంచేస్తూ నవ్వుకుంటుండగా, భార్య చెయ్యి ఊపి సైగ చేస్తూ అడిగింది, "ఏమిటండీ? ఒక్కరే నవ్వుతున్నారు?" అని.
ఆయన అన్నాడు, " దారిలో ఒకాయన ఎద్దులు బేరమాడాడులే. ధర చెప్పగానే మాయమయ్యాడు అక్కడినుండీ. ఊరకనే వస్తాయా ఏమిటి మరి?" అని.
ఆ భార్యామణికీ చెవుడే. ఆమెకు భర్త జవాబు వేరేగా వినిపించింది. ఆమె చేతులు ఊపుకుంటూ అన్నది " అయ్యో! నేను కాదండీ పప్పులోకి ఉప్పు వేసింది. అత్తయ్యగానీ వేసారో ఏమో" అని.
అప్పుడు చెవిటాయన కూడా చేతులూపుతూ " ఆ మాత్రం నాకు తెలీదా ఏమిటి? నువ్వు నాకు అంతగా చెప్పాల్సిన పనేమీలేదులే. అడిగినంతకే ఇవ్వడానికి నేనేమైనా పిచ్చి వెధవనా ఏమిటి?" అన్నాడు తల ఎగరేస్తూ.
భార్య మళ్ళీ అన్నది, "అయ్యో నిజంగా నేనుకాదండీ! మీ అమ్మగారే... నన్ను నమ్మండీ!" అని.
చెవిటి భర్త అన్నాడు విసుక్కుంటూ: "అబ్బా! ఒకసారి చెప్పావుగా నాకు అర్థమైందిలే ఇక" అని.
భార్య నొచ్చుకుంటూ అన్నది: " చూడండీ! నేను కాదని చెప్తూనే ఉన్నాను కదా? కావాలంటే మీ అమ్మను అడుగుదురు, రండి" అని వాళ్ళ అమ్మ దగ్గరకు లాక్కెళ్ళింది: "ఏమండీ అత్తగారూ? పప్పులోకి ఉప్పు వేసింది నేను కాదనీ, మీరేననీ ఈయనకు కాస్త చెప్పండీ!" అని చేతులూపుతూ అన్నది.
అత్తగారు కూడా చెవిటివారే. ఆవిడ అన్నారు: "ఆ... ఏమిటీ! నేనెప్పుడు పోయానే సినిమాకి? ఈ వయసులో నాకింకా సినిమాలూ, షికారులూనా? ఒరేయ్ అబ్బాయీ! నువ్వేమీ దీని మాటలు నమ్మొద్దురా! కావాలంటే మీ నాన్నను అడుగుదువు, రా" అని వాళ్ళ నాన్న దగ్గరికి లాక్కెళ్లింది.
ముసలావిడ ఆయన్ని అడిగింది ఆవేశంతో ఊగిపోతూ. " ఏమండీ, చూడండీ! నేను సినిమాకు వెళ్ళానట. ఇది నాపైన వాడికి లేనిపోనివన్నీ చెబుతున్నది. ఏ ఒక్క రోజైనా నేను సినిమాకి వెళ్ళానా? మీరే చెప్పండి!" అంది చూపుడు వేలిని ఊపుతూ.
ముసలాయనా ఏమీ తక్కువ తినలేదు. ఆయనన్నాడు: " ఆ! ఏమిటీ, ఒక్క గింజకూడా మిగల లేదా? ఏమో మరి! నాకేం తెలియదు. నువ్వు పెట్టిన చిప్పడు గుగ్గిళ్ళే తినలేక తిన్నాను నేను. ఇక మిగిలిన వాటితో నేనేం చేసుకోను? నేనేం తినలేదు నిజం!" అన్నాడు నిజాయితీగా!!