పాటిల్ పేదవాడే, కానీ అతని భార్య అతన్ని ఆరాధించేది. వాళ్లకో రెండు బర్రెలు ఉండేవి. కాలం గడిచే కొద్దీ వాళ్ళూ ముసలివాళ్ళయ్యారు, వాళ్ళ బర్రెలూ ముసలివైనాయి. వాళ్ళ పేదరికమూ పెరిగింది. చివరికి ఒక రోజున పాటిల్ భార్య అన్నది, "ఇంట్లో సరుకులు పూర్తిగా నిండుకున్నాయి. ఇక తప్పుదు- మన బర్రెల్లో ఒకదాన్ని అమ్మేసెయ్యి" అని.
మర్నాడు ఉదయాన్నే పాటిల్ బర్రెను తీసుకొని ప్రక్క ఊళ్లో సంతకు బయలుదేరాడు. మార్గం మధ్యలో అతనికొక మనిషి తగిలాడు. అతనూ సంతకే పోతున్నాడు- తన గుర్రాన్ని అమ్మెయ్యటానికట. మాటల మధ్యన పాటిల్ తన బర్రెను అమ్మటం గురించి ఏదో అన్నాడు. ఆ వ్యక్తికి పాటిల్ బర్రె
నచ్చినట్లుంది - అతనన్నాడు, "నువ్వు బర్రెను సంతవరకూ తీసుకెళ్లడం ఎందుకు? దాన్ని నాకిచ్చెయ్. నా గుర్రాన్ని నువ్వు తీసుకో" అని.
పాటిల్ అనుకున్నాడు - "ఇదేదో బానే ఉన్నది. బర్రెకంటే గుర్రం శ్రమ తక్కువ. అంతేగాక పిల్లలు గుర్రంతో ఆడుకొని సంతోషపడతారు" అని. "సరే, అలానే మార్చుకుందాం" అని అతను బర్రెనిచ్చి గుర్రాన్ని తీసుకొన్నాడు.
అయితే ఆ తరువాత అతను గుర్రమెక్కి దాన్ని తీసుకు పోదామని ప్రయత్నించేసరికి అది గుడ్డిదని తేలింది. అతను ఆ గుడ్డి గుర్రాన్నే సంతకు తోలుకొని పోతుండగా దారిలో ఆవును తీసుకెళుతున్న వ్యక్తి ఒకడు పలకరించాడు-
"ఏంటి తాతా, గుర్రాన్ని తీసుకొని ఎటు పోతున్నావ్? అని.
"నేను మా బర్రెను అమ్మేందుకు పోతూ, దారిలో దాన్ని ఈ గుర్రంతో మార్చుకున్నాను. అయితే ఇది గుడ్డి గుర్రమని తేలిందిప్పుడు! "అన్నాడు పాటిల్.
"ఓహో, పాపం అట్లా అయ్యిందా? నా ఆవు చాలా మంచిది. నువ్వు ఆ గుర్రాన్ని నాకిచ్చి, నా ఆవును తీసుకోరాదూ? నేను గుర్రాన్ని వాడుకుంటాను?" అన్నాడతను.
పాటిల్ ఆవును చూశాడు. దాని ముఖమూ, అది ప్రవర్తించే తీరూ అతన్ని ఆకట్టుకున్నాయి. అంతేగాక, ఆవుతో పని, గుర్రంతో పనికంటే సులభం. అందుకని అతను గుర్రాన్నిచ్చేసి ఆవును తీసుకున్నాడు. అయితే త్వరలోనే తెలియవచ్చింది - తను తీసుకున్న ఆ ఆవు కుంటిది!
అప్పుడతనికి మేకను తోలుకుపోతున్న వాడు ఒకడు కనబడ్డాడు. "ఎక్కడికి పోతున్నావు తాతా"! అని అతను అడిగితే " నేను నా బర్రెను సంతలో అమ్మేందుకు తీసుకుపోతూ, దారిలో దాన్ని ఓ గుడ్డి గుర్రంతో మార్చుకున్నాను. ఇప్పుడు దాని స్థానంలో నాకు ఈ ఆవు తగులుకున్నది. "నేను దీన్ని అమ్మాల్సిందే ఇక " అన్నాడు పాటిల్ అతనితో.
"ఓహ్, దాన్నెందుకు అమ్ముతావు? దాన్ని నాకిచ్చెయ్. నా మేకను నువ్వు తీసుకో " అన్నాడు ఆ వ్యక్తి. "సరే"నని మేకను తీసుకున్నాడు పాటిల్.
అయితే ఆ మేకకు చాలా జబ్బు చేసి ఉందనీ, ఆరోగ్యం అసలు బాగాలేదనీ అతనికి త్వరలోనే తెలియవచ్చింది. అప్పటికి అతను సంతకు చేరుకున్నాడు. ఇంకా లోపలికి పోకుండానే ఏదో తంటాలు పడి ఆ మేకను వదుల్చుకొని దాని బదులు ఒక కోడిపుంజును సంపాదించాడతను తెలివిగా.
అప్పటికి మధ్యాహ్నమైంది. ఆకలితో కడుపు దహించుకుపోతున్నది. అతని చేతిలో ఒక్కపైసా కూడా లేదు - కోడిపుంజు తప్ప. అతను దాన్ని సంతలో అమ్మబోతే ఎవ్వరూ ఒక్కరూపాయిని మించి ఇవ్వలేదు.
చేసేదేమీ లేక, దాన్ని అతను ఒక్క రూపాయికి అమ్మేశాడు. ఆ రూపాయిని పెట్టి కొంచెం భోజనం కొనుక్కుని, చెరువులో కాళ్ళూచేతులు కడుక్కొని, తినేందుకు ఓ మర్రి చెట్టు కింద కూర్చున్నాడో, లేదో - ఎక్కడినుండో ఓ బిచ్చగాడు ఊడిపడ్డాడు - "అయ్యా, అన్నం తిని కొన్ని రోజులైపోయింది. కొంచెం అన్నం పెట్టండి బాబూ!" అంటూ.
తను కడుపు నింపుకుంటుండగా ఎదురుగా కూర్చుని ఇంకొకడు ఆకలితో మాడటం పాటిల్ కు ఇష్టం కాలేదు. అందుకని అతను ఆ విస్తరిని ఉన్నది ఉన్నట్లే బిచ్చగాని చేతిలో పెట్టి, ఇక వెనక్కి చూడకుండా ఇంటికి బయలుదేరాడు. ఇంట్లో భార్య అతని కోసం ఎదురుచూస్తూ ఉండింది. ఆ సరికే ఆమె ఇల్లు ఊడ్చి శుభ్రం చేసి, వంటవండి, పిల్లలకు పెట్టి వాళ్ళను నిద్రబుచ్చింది. భర్తను చూడగానే ఎదురొచ్చి "ఎలా జరిగింద"ని అడిగింది ఆమె.
"చెప్తాను, చెప్తాను. ముందు నాకో గ్లాసెడు మంచినీళ్లివ్వు" అన్నాడు పాటిల్. మంచినీళ్లు తాగి కొంచెం చల్లబడ్డాక, అతను ఏం జరిగిందో ఆమెకు చెప్పసాగాడు కొంచెం కొంచెంగా.
"నేను బర్రెను అమ్మలేదు. దాన్నో గుర్రంతో మార్చుకున్నాను"
"ఓహ్!" అన్నది భార్య సంతోషంగా. "పిల్లలూ,రండి, చూడండి. నాన్న మీకోసం ఓ గుర్రాన్ని తెచ్చారు!".
"ఆగాగు. నా దగ్గర గుర్రం లేదు. దానిని నేను ఓ ఆవుతో మార్చుకున్నాను" అన్నాడు పాటిల్ జాగ్రత్తగా.
"మరీమంచిది. నాకు ఆవును పెంచుకోవాలని ఎప్పటి నుంచో ముచ్చట. కనీసం ఇప్పుడైనా పిల్లలు ఆవుపాలు తాగొచ్చు. పిల్లలూ, బయటికి పోయి చూడండి. నాన్న తెచ్చిన ఆవు ఎలా ఉందో?" అన్నది భార్య.
"ఆగు.. ఆగు. నేను ఆ ఆవును ఇంటికి తెద్దామనుకొన్నాను, కానీ దానిని ఒక మేకతో మారకం చేసుకున్నాను" అన్నాడు పాటిల్ త్వరత్వరగా.
"మేకైతే చాలా బాగుంటుంది. మేక పాలు పిల్లలకు ఆరోగ్యం. మేక తన బ్రతుకు తానే బ్రతుకుతుంది కూడానూ. మనకు చాకిరీ ఉండదు. పిల్లలూ, పోయి మేకను చూసిరండి!"
"అంత తొందర పడకు. నేను దాన్నిచ్చేసి ఒక కోడిపుంజును తీసుకున్నాను" అన్నాడు పాటిల్.
"ఫరవాలేదులే. అది మనల్ని ప్రతిరోజూ పొద్దున్నే నిద్రలేపుతుంది. ఎక్కడ అది? వెళ్ళిచూద్దాం రండి. అందరం" అన్నది భార్య.
"విను, నా దగ్గర కోడిపుంజు కూడా లేదు. నాకు చాలా ఆకలైంది. అందుకని నేను ఆ కోడిని ఒక రూపాయికి అమ్మి తినేందుకు భోజనం కొనుక్కున్నాను." అన్నాడు పాటిల్ నీరసంగా.
"అదీ మంచిదేలే. ఆ పనికిరాని కోడి మనకెందుకు? మధ్యాహ్నంపూట ఏమీ తినకుండా ఉండటం మంచిది కాదు" అన్నదా మంచి ఇల్లాలు.
"పూర్తిగా చెప్పేంతవరకూ ఆగు దయచేసి. నేను ఆ అన్నం నోట్లో పెట్టుకోబోతుండగా సరిగ్గా అదే సమయానికో బిచ్చగాడు ప్రత్యక్షమయ్యాడు. నేను అన్నమంతా అతనికే ఇచ్చేసి, ఇంటికి నడిచి వచ్చాను!" అన్నాడు పాటిల్ చివరగా.
"అంటే ఏమీ తిననేలేదా? అయ్యో పాపం, ఎంత పనైంది! కాని నువ్వు చేసినపని సరైనదేలే. భోజన సమయంలో వచ్చిన వాళ్ళకెవరికీ మొండిచెయ్యి చూపించకూడదు. సరే. ఇప్పుడిక కాళ్ళూ చేతులు కడుక్కో. తినేందుకు ఉన్నది ఏదో ఒకటి వడ్డిస్తాను. ఆకలితో నీ కడుపు ఎండి పోతుండాలి" అని, భార్య అతనికి భోజనం వడ్డించింది.
మర్నాడు ఉదయం నిద్రలేచి తన గుడిసె తలుపు తీయగానే ఎదురైన దృశ్యం చూసిన పాటిల్ కు, అతని భార్యకు నోట మాటరాలేదు. తలుపుకు ఎదురుగా జంతువుల గుంపొకటి నిలబడి ఉన్నది. ఇంకా ముసలిది కాని బర్రె, గుడ్డిది కాని గుర్రం, కుంటిది కాని ఆవు, చురుగ్గా, చలాకిగా ఉన్న మేక, చక్కని ఒక కోడిపుంజు! వాటన్నింటి ప్రక్కనా ఒక విస్తరి! ఆ విస్తరి మీద మెరుస్తూ ఒక బంగారు నాణెం!
ఈ దృశ్యాన్ని చూసిన భార్య సంతోషంగా గుసగుసలాడింది - "ఇవన్నీ ఎవరు చేసి ఉంటారు? నిన్న నువ్వు అన్నం పెట్టిన బిచ్చగాడేనంటావా?" అని.
"ఇంకెవరు? ఆ బిచ్చగాడే. అతను భగవంతుడేనేమో మరి!" -అన్నాడు ఇంకా తేరుకోని పాటిల్.