ఒక ఊరిలో సూది, గుడ్డు, పేడ తప్పె ఉంటారు. వాళ్లు ముగ్గురూ స్నేహితులు. ఒకసారి గుడ్డుకు జ్వరం వచ్చింటే, ఆసుపత్రికి బయలుదేరి పోతుంటుంది. దానికి సూది ఎదురౌతుంది. ’గుడ్డూ, గుడ్డూ ఎక్కడి కెళ్తున్నావ్?’ అంటే, ’నాకు జ్వరం వచ్చింది, ఆసుపత్రికి వెళ్తున్నాను’ అంటుంది గుడ్డు. ’నాకూ పడిశం పట్టింది. పద, ఇద్దరం వెళ్దాం’ అని సూది కూడా బయలుదేరింది. ఇద్దరూ పోతుంటే, పేడ తప్పె ఎదురైంది. ’ఎక్కడికి పోతున్నారు, సూదీ, గుడ్డూ?’ అని అడిగింది. ’ఆసుపత్రికి’ అంటే, ’ఎందుకు?’ అని అడుగుతుంది పేడతప్పె. అప్పుడు గుడ్డు చెప్తుంది, ’నాకు జ్వరం వచ్చింది, సూదికి పడిశం పట్టింది’ అని. ’నాక్కూడా వంట్లో బాగా లేదు, పదండి ముగ్గురం పోదాం’ అని ముగ్గురూ పోతారు. అయితే ఆస్పత్రిలో డాక్టరు ఉండడు. అన్నం తినేకి ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. ఎంతసేపు చూసినా రాడు. అప్పుడు ముగ్గురికీ చాలా కోపం వచ్చింటింది.

అప్పుడు సూది వెళ్లి, డాక్టరు కూర్చునే కుర్చీ మీద కూర్చొని ఉంటుంది. గుడ్డు డాక్టరు గది గడప మాను మీద అడ్డంగా కూర్చుంటుంది. పేడతప్పె వెళ్ళి ఫ్యాను మీద దాక్కుంటుంది. అంతలోనే డాక్టరు వస్తాడు, మెల్లగా చేతులు ఊపుకుంటూ. అటూ ఇటూ చూసుకుంటూ వచ్చి గడపమాను మీద కాలు పెట్టగానే గుడ్డు చిట్లి, ప్యాంటుకంతా అంటుతుంది. ’అయ్యో, ఎవరో ఇక్కడ గుడ్డు పెట్టినారే,’ అని డాక్టరు పోయి అంతా తుడుచుకొని, కుర్చీలో కూర్చుంటాడు. వెంటనే అందులో కూర్చున్న సూది డాక్టరుకు గట్టిగా గుచ్చుకుంటుంది. "అబ్బా!’ అని ఏడుస్తాడు డాక్టరు కొంతసేపు. మళ్ళీ ’అబ్బ ఉడుకు ఉడుకు’ అని ఫ్యాన్ వేసి, ’ఆహాఁ’ అని నోరు తెరుస్తాడు, అప్పుడు ఫ్యాన్ పైనున్న పేడతప్పె వచ్చి సూటిగా డాక్టరు నోట్లో పడిపోతుంది!