I పోతలయ్య, 6వ తరగతి, ప్రకృతి బడి చెప్పిన జోకులు:
నాకు కాదండి!
సుబ్బారావు డాక్టరు దగ్గరకెళ్లాడు.
సుబ్బారావు: అయ్యా డాక్టరుగారూ, నిన్నటినుండి ఆగకుండా ఎక్కిళ్లు వస్తున్నాయి, ఏం చెయ్యాలండీ?
డాక్టరు ఏం మాట్లాడకుండా వచ్చి సుబ్బారావుకు చాచి చెంపమీద ఒకటిచ్చాడు. సుబ్బారావుకు కళ్లు తిరిగాయి, కొద్ది సేపు ఏమీ మాట్లాడలేకపోయాడు.
ఆ తరువాత డాక్టరు నవ్వుతూ అన్నాడు: చూశారా, ఎక్కిళ్ళు ఆగిపోయాయి? ఏదైనా షాక్ ఇస్తే ఎక్కిళ్లు ఆగిపోతాయని శాస్త్రం చెబుతుంది.
సుబ్బారావు ఏడుస్తూ అన్నాడు: సార్! ఎక్కిళ్ళు నాకు కాదండీ, మా ఆవిడకు.
బార్బర్ ఏడి?
రాము: ఒరేయ్, అడవిలో ఎలుగుబంటి ఉంటుంది కదా,
రవి: అవును, ఉంటుంది.
రాము: దానికి దుబ్బగా జుట్టు పెరిగి ఉంటుంది కదా?
రవి: అవును
రాము: ఎందుకు, అంత పెరిగి ఉండేది?
రవి: అడవిలో దానికి బార్బర్ దొరకడు గదా, అందుకని.
II విష్ణు చెప్పిన జోకులు:
శాకాహారం!
బడిలో టీచరు అంటోంది:
టీచరు: రామూ, ఇలా రాస్తే పరీక్షల్లో నీకు కోడి గుడ్లు రాక తప్పదు.
రామూ: అయ్యో, వాటితో నాకేం లాభం టీచర్, మేం శాకాహారులం.
వేడి వేడి అయిస్ క్రీం!
సూరి వాళ్లమ్మ అంటోంది: అమ్మ: సూరీ, ఎండా కాలం శలవల్లో ఎక్కువ ఐస్ క్రీం లు తినకు. అవి చల్లగా ఉంటాయి, గొంతు నొప్పి చేస్తుంది.
సూరి: ఏమీ పరవాలేదులే మమ్మీ, నేను జాగ్రత్తగా ఉంటాలే. రోజూ నాలుగు ఐస్ క్రీంలు వేడి చేసుకొని తింటా.
III అజిజ్, మూడవ తరగతి, ప్రకృతి బడి చెప్పిన జోకు:
టీచరే గొప్ప
యల్ కె జీ చదువుతున్న అజిజ్ ని టీచర్ అడిగింది:
టీచర్: అజిజ్! తల్లి, టీచర్ లలో ఎవరు గొప్ప?
అజిజ్: టీచరే గొప్ప, మేడం
టీచర్: ఊరికే అనకు. టీచరు ఎందుకు గొప్పో చెప్పు?
అజిజ్: తల్లి ఒక్క పిల్లాడినే పడుకోబెడుతుంది, మరి టీచరైతే ఇంతమంది పిల్లల్ని నిద్రబుచ్చుతుందిగదా, మేడం!
టీచర్: ఆఁ !!!
IV హరి, 9వ తరగతి, APSWR School, B. Pappur చెప్పిన జోకులు:
పూర్తి పిచ్చి!!
ఒక ఆఫీసరు స్కూలుకు వెళ్లి పిల్లలను పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నాడు:
"నా నెలజీతం 1200 అయితే, ఇప్పుడు చెప్పండి నా వయసెంత?" అని.
"ఇదేం ప్రశ్నరా బాబూ" అని అందరు పిల్లలూ తలగోక్కుంటున్నారు. ఇంతలో హరి లేచి చెప్పాడు: "మీ వయసు కచ్చితంగా 40 సంవత్సరాలు" అని.
ఆఫీసరు: అరే, ఇంత కచ్చితంగా ఎలా చెప్పగలిగావు?
హరి: ఏం లేదు, మా అన్నకు సగం పిచ్చి. వాడి వయసు 20.
తర్కం!!
అమ్మ: ఒరేయ్ రవీ, చంటిగాడిని ఎందుకు కొట్టావు?
రవి: వాడు నేను అడిగినదానికి జవాబు ఇవ్వటం లేదు మరి.
అమ్మ: వాడు ఇంకా చిన్నపిల్లవాడురా, వాడికి మాట్లాడటం రాదు కదా?
రవి: మరి వాడు ఆ మాట ముందే చెప్పి ఉండచ్చు కదా?
అతి బలవంతుడు!!
రాజు: వందలాది వాహనాలను ఒంటిచేత్తో ఆపేస్తాడంటున్నావు, మీ నాన్న అంత బలవంతుడా?
రాము: కాదురా, మా నాన్న ట్రాఫిక్ కానిస్టేబుల్!
ఆగి చూడండి!!
కస్టమర్: అయ్యో, బేరర్, నాకిచ్చిన టీలో ఈగ తేలుతోంది చూడు.
బేరర్: కొద్ది సేపు ఆగండి సార్, అదే మునిగిపోతుంది.
V ఓబులపతి, వినోద్ లు చెప్పిన జోకు:
ఆదివారం శలవు:
రాము: ఏంరా, సోమూ, నువ్వే రోజున పుట్టావు?
సోము: నేను మంగళవారం నాడు పుట్టాను.
రాము: నేనైతే ఆదివారం నాడు పుట్టాను తెలుసా?
సోము: ఊరుకో, ఎవరైనా ఆదివారం నాడు ఎలా పుడతారు? ఆదివారం నాడు శలవు కదా?