ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతనికి ఒక భార్య ఉండేది. ఒకసారి వాళ్ళందరూ పనికి పోయారు. మధ్యాహ్నం అయ్యేసరికి, భార్య అతని దగ్గరకు వచ్చి, ’ఓ మొగుడా, ఓ మొగుడా, బువ్వ తిందువు, రా’ అని పిలిచింది. రైతు తనకు ’వినపడ లేదు’ అన్నాడు. అప్పుడామె ’ ఓ మామా! బువ్వతిందువు రా," అని పిలిచింది. అయినా ఆయప్పకు వినబడలేదు. అప్పుడామె చికాకుగా ’ఓ ముక్కుడోడా, ముక్కుడోడా బువ్వ తిందువు, రా" అని పిలిచింది. అయితే రైతుకు ఈ మాట వినబడి, కోపం వచ్చేసింది. అతను పశువులను కొట్టే చర్నాకోల తీసుకొచ్చి కొట్టేసరికి, ఆయప్ప పెండ్లాం కాస్తా చచ్చిపోయింది. రైతుకూడా, వెంటనే సమాధి తవ్వి అక్కడే ఆమెను బూంచేశాడు.
మళ్ళీ ఆ రైతు రెండో పెండ్లామును చేసుకున్నాడు. పనికి బోతూ అమెను కూడా మళ్లీ బువ్వకొండ్రామన్నాడు. రైతు మడక దున్నుతుంటే ఆమె చేనుకు బువ్వ తీసుకొచ్చి, ’ఓ మామా బువ్వ కొండొచ్చాను తిందువు రా’ అని పిలిచింది. అయప్పకు అది వినబడలేదు. ’ఓ మొగుడా బువ్వతిందువురా’ అంటే కూడా ఆయప్ప పలకలేదు. కానీ ఓ ముక్కుడోడా బువ్వతిందువు, రా’ అంటే అదివినబడి, కోపం వచ్చింది. అలా అనిందానికి ఆయప్ప లేచి వచ్చి చెర్నాకోలతో కొడితే ఆయమ్మకూడా చచ్చిపోయింది. రైతు గుంత తొగి, ఆమెను కూడా బూంచేశాడు.
మళ్లీ మూడో పెళ్లి చేసుకున్నాడు రైతు. మూడో పెండ్లాంని కూడా అన్నం ఎత్తుకొని రమ్మన్నాడు, తన చేనుకు. ఆయమ్మ బువ్వ ఎత్తుకొచ్చి, ’ఓమామా బువ్వతిందువు రా, ఓ మొగుడా బువ్వ తిందువు రా, ముక్కుడోడా బువ్వ తిందువురా” అని బిరిగ్గా అన్నది, ఒక్కసారే. అయినా వినబడి, రైతు ఆమెను కూడా చెర్నాకోలతో కొట్టి చంపేసి, బూంఛేశాడు.
ఇక రైతు మళ్లీ పెళ్ళి చేసుకోలేదు. అతని ముగ్గురు భార్యలకీ గోరీలు కట్టించాడు. ఆ గోరీలచుట్టూ ఆకుకూర మొలిచింది. ఆ ఆకుకూరని పీకబోతే, అవి ’పీకు పీకు ముక్కుడోడా, పీకు పీకు ముక్కుడోడా’ అన్నాయి. అందుకని రైతు కోపంగా వాటిని పీకి, ఆవుకు గొర్రెకు వేశాడు.
ఆకుకూర తిన్న గొర్రెను రైతు కోయబోతే ’కొయ్ కొయ్ ముక్కుడోడా, కొయ్ కొయ్ ముక్కుడోడా’ అన్నదాగొర్రె. పాలు పిండనీకి ఆవు దగ్గరికి పోతే ’పితుకు పితుకు ముక్కుడోడా’ అన్నది ఆవు.
ఈ బాధ భరించలేక ఆయప్ప ఒక స్వామి దగ్గరకు వెళ్లాడు. ’స్వామీ స్వామీ నా పెండ్లాలు ఇట్లంటున్నారు, ఎక్కిరిస్తున్నారు’ అని మొత్తుకుంటే, స్వామి ’సరే, నువ్వు చేసిన పనులకు ఫలితం ఇట్లానే ఉంటుంది. పుణ్యం, పాపం జీవితాంతం వెంటవస్తాయని ఇప్పటికైనా నీకు తెలిస్తే అదేచాలు; ఏమీ బాధ పడవలసిన అవసరం లేదు.’ అన్నాడు.