ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు ఇద్దరు భార్యలు. వాళ్లలో మొదటి భార్య చాలా చెడ్డది, రెండవ భార్య చాలా మంచిది. ఒకరోజు చిన్న ఆయమ్మ పెద్ద ఆయమ్మను దూరంగా ఉన్న బావినుండి నీళ్లు తెమ్మని పంపించింది. చిన్న ఆయమ్మ ’సరే’ అని వెండి బిందె పట్టుకొని బావి దగ్గరకు వెళ్లింది.

అయితే ఆమె చేతిలోంచి బిందె జారి నూతిలో పడిపోయింది. బిందె పోగొట్టుకున్నందుకు ఆమె చాలా బాధపడింది- లోతుగా ఉన్న బావిలోకి దిగలేక ఏడిచింది. అప్పుడు ఆ బావిలోంచి గంగా దేవత ప్రత్యక్షమైంది. ఆమె తన చేతిలో ఒక బంగారు బిందెను పట్టుకొని ఉన్నది. ’ఇదేనా, నీ బిందె? బంగారు బిందె?’ అని అడిగింది. ’కాదు’ అన్నది చిన్న ఆయమ్మ. గంగా దేవి వెళ్లి, ఈసారి ఇత్తడి బిందెతో తిరిగి వచ్చింది: ’ఇదేనా నీ బిందె? ఇత్తడి బిందె?’ అని అడిగింది. ’కాదు’ అన్నది చిన్న ఆయమ్మ. మళ్లీ గంగాదేవి వెళ్లి, ఈసారి ఆయమ్మ బిందెతోనే తిరిగి రాగానే, చిన్న ఆయమ్మ ’అదే, అదే, నా బిందె!’ అన్నది. ఆ దేవత ఆయమ్మ మనసును తెలుసుకొని చాలా సంతోషపడింది. ’ఈ మూడు బిందెలూ నువ్వే తీసుకో, చాలా మంచిదానివి’ అన్నది. అని, ఆయమ్మకు మూడు బిందెలూ ఇచ్చేసింది. చిన్నాయమ్మ మూడు బిందెలూ పట్టుకొని సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చింది.

ఇది చూసిన పెద్దాయమ్మ ఊరుకోలేదు. ’ఇన్ని బిందెలు ఎక్కడివి?’ అని అడిగింది. ’నాకు బావిలో దేవత ఇచ్చింది’ అని చిన్నాయమ్మ చెబితే, పెద్ద ఆయమ్మ కూడా పోయిందక్కడికి, బిందెలకోసం. ఊరికే యాక్షన్ చేసుకుంటూ పోయి, కావాలని తన ఇత్తడి బిందెను బావిలోకి జారవిడిచింది. గంగా దేవి ఆమె బిందెనే తీసుకొని ప్రత్యక్షమైంది: ’ఈ బిందె నీదేనా?’ అని అడిగింది. ’ఉహుఁ, కాదు’ అన్నది పెద్ద ఆయమ్మ. ’అయితే ఇది నీదేనా’ అన్నది గంగాదేవి, వెండి బిందెను తెచ్చి. ’కాదు’ అన్నది పెద్దాయమ్మ బంగారు బిందెపైన ఆశతో. మళ్లీ గంగాదేవి బంగారు బిందెను తేగానే ’అదే, అదే, నాబిందె!’ సంతోషంతో అరిచింది పెద్దాయమ్మ. దాంతో గంగాదేవికి చాలా కోపం వచ్చింది. ’నువ్వు చాలా చెడ్డదానివి, నీకు ఏబిందే ఇవ్వను పో’ అని ఆమె మాయం అయిపోయింది. దాంతో పెద్దాయమ్మకు బుద్దివచ్చి మంచిదైపోయింది. ఆనాటినుండి ఆశపోతుగా ఉండకుండా మంచిగా ఉండింది.