నేను కాలేజీలో చదివే రోజుల్లో ఒకసారి లైబ్రరీలో ఒక గొప్ప వ్యక్తి ఆత్మకథ దొరికింది. డిల్లీ యూనివర్సిటీకి ఉప కులపతిగాను, రిజర్వ్ బ్యాంకుకు గవర్నరుగాను, భారత ప్రభుత్వానికి ఆర్థిక మంత్రిగాను గడిపి, ఆయన తన జీవితంలో అనేక ఉన్నత పదవుల్ని అధిష్టించారు. ఆ పుస్తకంలో ఒక సంగతి నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది: జాతీయ బ్యాంకుల్ని నడిపించటంలోను, కేంద్ర బడ్జెట్లను తయారు చేయటంలోను తన అనుభవాలకు కేటాయించినన్ని పేజీలు, ఆయన చిన్నప్పుడు తను బడిలో సాధించిన ఘనతలకు కూడా కేటాయించారు. మొదటగా ఆయన తన పదవ తరగతిలో ఏ సబ్జక్టులో ఎన్ని మార్కులు వచ్చాయో చూపారు- దేంట్లోనూ నూటికి 96 మార్కులకు తక్కువ రాలేదు. ఆ తరువాత, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఆయన సాధించిన మార్కులు తరువాతి అనేక సంవత్సరాల వరకు నాటి బొంబాయి ప్రెసిడెన్సీలో రికార్డుగా ఎలా నిలిచాయో చూపారు. ఇది చాలదన్నట్లు, ఆ తరువాత ఆయన BA పరీక్షల్లోను, MA పరీక్షల్లోను సాధించిన బంగారు పతకాలు అత్యున్నతమైనవి ఎలాగో సాంఖ్యకశాస్త్ర పరంగా నిరూపించేందుకు ప్రయత్నించారు. ఆ తరువాత, అలాంటివే ఇతర ఆత్మకథలు చదివినప్పుడు, నాకు ఇది వింతగా కాక, ఆత్మకథలకుండే ప్రత్యేక లక్షణమేమో అనిపించసాగింది. తమ జ్ఞాపకాలను రాసే సమయంలో, సామాజిక శాస్తంలో పేరుగాంచిన ఆచార్యులైనా, భారత సివిల్ సర్వీసులో పండిన అధికారులైనా తాము సాధించిన ఘనతల్లో మిగిలినవాటితో సమానంగా, తాము బడిలో సాధించిన మార్కుల్ని కూడా చూపారు.

అప్పుడు వీటికి భిన్నమైన ఆత్మకథ ఒకటి నాకంట పడింది: మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గారి ఆత్మకధ. సంస్కృతంలోను, యూక్లిడ్ రేఖా గణితంలోను తను ఎదురొన్న కష్టాల్ని వివరిస్తున్న సందర్భంలో మహాత్ముడు రాశాడు: - ’హైస్కూలులో నన్ను మొద్దుగా పరిగణించేవారు కారు’ అని. (అంతకు మించిన వివరణ లేదు.)

గాంధీ, ఈ సంగతిని ఏదో మామూలు విషయంగా రాశాడు. బడిలో తన జీవితాన్ని గురించి తనకున్న అస్పష్టమైన జ్ఞాపకాలవి. వీటికి పూర్తిగా వ్యతిరేకంగా, చాలా ఖచ్చితమైన వివరాలు 1965లో అచ్చైన ఒక పుస్తకంలో ఇవ్వబడ్డాయి. ’విద్యార్థిగా మహాత్మా గాంధీ’ అనే ఈ పుస్తకాన్ని J.M. ఉపాధ్యాయ గారు రాశారు. విద్యార్థిగా గాంధీ ఏడు సంవత్సరాలపాటు గడిపిన రాజకోట హైస్కూలుకు ఆయన ప్రధానోపాధ్యాయుడుగా ఉండేవాడు.

ఈ పుస్తకంలోని 74 పేజీలలో ఉపాధ్యాయగారు చాలా సమాచారాన్ని క్రోడీకరించి అందించారు. పది సంవత్సరాల వయస్సు వచ్చే లోపలే గాంధీ చాలా బడులు మారినట్లు మనకి ఈ పుస్తకంద్వారా తెలుస్తోంది. ఒక్కోసారి బడిలో అతని హాజరీ చాలా తక్కువగా ఉండేది: మూడవ తరగతిలో 238 రోజులకుగాను కేవలం 110 రోజులు మాత్రం హాజరయ్యాడు. ప్రతి తరగతిలోను వార్షిక పరీక్షల్లో అతని సగటు మార్కులు 45% కి 55% కి మధ్యలో ఉండేవి. జూనియర్ స్కూల్లో ఉన్నప్పుడయితే అతను ’త్రిభువన్ భట్’ అనే పిల్లవాడిచేత మళ్లీ మళ్లీ, విపరీతంగా తన్నులు తినేవాడు. ( ఈ త్రిభువన్ భట్ తర్వాత్తర్వాత ఆ నాటి ’కాపర్స్’ మాదిరి, ’బాబు’గారు అయ్యారు: చివరికి ఆయన రాజ్కోట్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అయ్యారు.) తోటివారిలో మోహన్దాస్ గొప్పదనాన్ని నిలిపే సంగతి ఒక్కటే ఉండేది: అదేమంటే, అతని అన్న కర్షన్దాస్ కి మోహన్ కంటే ఇంకా తక్కువ మార్కులు వచ్చేవి. కర్షన్దాస్ (పెళ్లి కారణంగా) రెండు సంవత్సరాలు చదువు కోల్పోయి, తమ్ముడి తరగతిలోనే కూర్చోవాల్సి వచ్చింది, అందులోకూడా అతనికి తమ్మునికంటే తక్కువ మార్కులు వచ్చేవి.

ఇంకొంచెం పై తరగతులకు వచ్చేసరికి పరిస్థితులు మరింత క్షీణించాయి. అనారోగ్యంతో గల తండ్రికి, తన కొత్త భార్యకు సమయమివ్వటంతో అతని బడి హాజరీ మరింత ఘోరమైంది. ఇక పై తరగతికి వెళ్లనివ్వకపోవటంతో అతను నడుం బిగించి, ’చదువుల పట్ల చాలా శ్రద్ధ వహించాడు’. దాంతో అతనికి తరగతిలో 8వ ర్యాంకు వచ్చింది. అతనికి అప్పటివరకు వచ్చిన మార్కుల్లోకల్లా అద్భుతమైన 66.5% కూడా అప్పుడే వచ్చాయి. ఈ వేగం అతన్ని హైస్కూల్లోకి నెట్టింది. బడికి బయట అతనిజీవితం చాలా సుందరమైన జ్ఞాపకాలతో నిండి ఉండేది: అతను ’కాముకుడైన భర్త’ పాత్రవహించాడు, మాంసంతో ప్రయోగాలు చేశాడు, అన్న కర్షన్దాస్ చేసిన అప్పును చెల్లించటంకోసం బంగారం అమ్మే ప్రయత్నం చేశాడు, అయినా, ఇన్ని సంఘటనల నడుమ, బడిలో అతని హాజరీ 125 కు 125 రోజులు ఉన్నది, అతను తరగతిలో 4వ ర్యాంకు సాధించాడు, అన్ని సబ్జక్టుల్లో కలిపి 60% కి పైగా మార్కులు సంపాదించుకున్నాడు. ఉపాధ్యాయగారి మాటల్లో- ’ఇక అతన్ని మధ్య రకం పిల్లవాడు అనే వీలు లేకుండింది.’

1887 వ సంవత్సరం నవంబరు నెల మూడవవారంలో జరిగిన కఠిన పరీక్ష ఒకటి ఈ నమ్మకాన్ని పటాపంచలు చేసింది. బొంబాయి విశ్వవిద్యాలయంవారు నిర్వహించిన పరీక్షలో పాల్గొనటం కోసం రైల్లో అహ్మదాబాదుకు వెళ్లాడు గాంధీ. తర్వాత జీవితంలో తన సొంత పట్టణంగా చేసుకున్న ఈ నగరానికి గాంధీ మొదటిసారి రాక ఇది. దీని గురించిన ఖచ్చితమైన వివరాలిస్తూ ఉపాధ్యాయ, గాంధీ పరీక్ష నంబరు 2275 అని ఇష్టంగా గుర్తుచేసుకుంటారు. ఈ పరీక్షకు మొత్తం 3067 మంది అభ్యర్థులు వచ్చారు. వీరిలో 799 మంది విజయం సాధించారు. గాంధీకి 404 వ ర్యాంకు వచ్చింది. అతనికి వచ్చిన మార్కులు ఇలా ఉన్నాయి: ఇంగ్లీషు: 89 / 200 గుజరాతీ: 45.5 / 100 లెక్కలు: 59 / 175 జెనరల్ నాలెడ్జ్: 54 /150 మొత్తం, 247.5 / 625 సగటున దాదాపు 40% అవుతుంది. మళ్లీ గాంధీ ’మధ్యరకం విధ్యార్థి’ అయ్యాడు.

రచయిత తీసుకున్న శ్రమకు, పాత రికార్డుల పట్ల గుజరాతీలకున్న గౌరవానికి కూడా ’విద్యార్థిగా మహాత్ముడు’ అనే ఈ పుస్తకం నిలువెత్తు దర్పణం. అంతేకాదు, ఇందులో మార్క్ షీట్ల కంటే విలువైన సమాచార సంపద ఉన్నది. పరీక్షల్లో అతనికి మధ్యరకం మార్కులే వస్తూ ఉండినప్పటికీ, మిడిల్ స్కూల్లో తరగతి ఉపాధ్యాయుడు అతని ప్రవర్తనకు ’వెరీ గుడ్’ అని కితాబునివ్వటం కనిపిస్తుందిక్కడ. ఇతరులకు ఎక్కువలో ఎక్కువ ’గుడ్’ మాత్రం లభించింది!

గాంధీ మెట్రిక్ లో రాసిన ఇంగ్లీషు పరీక్ష ఆన్సర్ షీటును చూస్తే తరువాతి కాలంలో అతని జీవితానికి సంబంధించిన కీలక విషయాల బీజాలు అందులో కనబడతాయి. అందులో 45మార్కులకు గాను ’కోప రహితమైన, ప్రశాంత ప్రవర్తన వల్ల లాభాలు’ అనే విషయంపై గాంధీ 40 లైన్ల వ్యాసం ఒకదానిని రాయవలసి ఉండింది: ఈ వ్యాసం రాయటం, అతనిని ’జీవితంలో ఎన్నడూ తన ప్రశాంతతను కోల్పోయినట్లు ఎరుగని అద్భుత రాజకీయ నాయకుడి’గా రూపొందేందుకు ప్రోత్సహించిందా? ఏమో? తమలోని అసహ్యంకొద్దీ, ఆగకుండా, గణగణలాడుతున్న రధాల్లో పోయిన ధనికులకు కాక, కరుణ చూపిన పేదరైతుకు ఏసు ప్రభువు ఎలా కనికరించి దర్శనమిచ్చాడో తెలిపే ఆంగ్ల పద్యాన్ని ఒకదాన్ని అతను 25 మార్కులకుగాను వ్రాయవలసి ఉండింది: ఈ ప్రశ్న అతనిలో అన్యాయం, దోపిడిల పట్ల విస్పష్టమైన అవగాహనను రేకెత్తించి ఉండదా?

ఉపాధ్యాయ తన రచనలో విరివిగా వదిలిన సామాజిక శాస్త్రపరమైన చిన్న చిన్న అంశాల ప్రాధాన్యతను కూడా మనం పరిగణనలోనికి తీసుకోవాలి. దీన్ని చూడండి: హైస్కూల్లో మోహన్దాస్ ప్రియస్నేహితుడు ఒక ముస్లిం పిల్లవాడు. వారి హెడ్మాస్టరు పార్సీవాడు. జూనాగఢ్ నవాబు ఇచ్చిన 63,000 రూపాయల బహుమానంతో బడి భవనం నిర్మితమైంది. మోహన్దాస్ బడిలో గడిపిన చివరి సంవత్సరాలలో, అతని మార్కులు 50% దాటినప్పుడు, అతనికి నెలకు 10 రూపాయల స్కాలర్షిప్ ఇచ్చేవారు. నాటి కథియవాడ్ పెద్దమనుషులు- ఒకరు హిందూ, ఒకరు ముస్లిం- వీరి పేర్లమీద ఈ స్కాలర్షిప్ ఇవ్వబడేది. ఇదంతా భవిష్యత్తులో భిన్నమతాల మహాత్ముడు తయారయ్యేందుకు దోహదం చేసిన విభిన్న సంస్కృతుల గుబాళింపుగల ప్రాధమిక శిక్షణా నేపధ్యం అనుకోవచ్చా?

కానీ, నిరాశావాదులు ఇంకా అనచ్చు: ’ఏం చేసినా మార్క్ షీట్లను మరచిపోలేం,’ అని. వీరికి క్షమాపణలతో, నేను ఇంకొక గొప్ప వ్యక్తి, ఆల్బర్ట్ ఐన్ స్టీన్ ప్రజ్ఞను గుర్తు చేస్తాను. ఈయన జీవిత చరిత్రను రచించిన ఒక రచయిత రాస్తాడు: ’ఐన్ స్టీన్ బాల్యంలోని ఏ ఒక్క సంఘటనా అతనిలో నిద్రాణమై ఉన్న మేధస్సును తెలియజేయలేదు’ అని. ఆ పిల్లవాడికి తొమ్మిదేళ్ళు వచ్చేవరకు స్పష్టంగా మాట్లాడటం రాలేదు. ఐన్ స్టీన్ తండ్రి తన కొడుక్కు ఏ వృత్తి సరిపోతుందని అడిగినప్పుడు వాళ్ల హెడ్మాస్టరు అన్నాడు: ’ఏదైనా పరవాలేదు; ఇతను దేనిలోనూ ప్రవీణుడు కాలేడు ఎలాగూ’ అని. ఆ తరువాత, మ్యూనిచ్ లోని ల్యూట్పోల్డ్ జిం లోకూడ ఐన్ స్టీన్ ’కొంచెం వెనకబడి’ ఉండేవాడు, తన డిప్లమాని సాధించలేకపోయాడు. ఆ తరువాత, జ్యూరిచ్ కి వచ్చిన తరువాత, విశ్వవిద్యాలయపు ప్రవేశ పరీక్షలో ఐన్ స్టీన్ ఫెయిలయ్యాడు. ఈ వైఫల్యాలకు కారణం ఏం చెబుతారంటే, అతనికి లెక్కల్లో అసమానమైన ప్రతిభ ఉన్నప్పటికీ, జీవశాస్త్రంలోను, ఆధునిక భాషల్లోను తగినంత ప్రావీణ్యత ఉండేది కాదు’ అని.

ఇరవయ్యవ శతాబ్దంలో అత్యంత మేధావులుగాను, ఉత్తములుగాను, అత్యంత ప్రభావశీలమైన వ్యక్తులుగాను పేరొందిన ఇద్దరు మహనీయులు పరీక్షల్లో ప్రదర్శించిన ప్రజ్ఞాపాటవాలు ఇలా ఉండినై. చాలా కాలం క్రితం, 1930 లలో, బొంబాయికి చెందిన పత్రకారుడు DF కరక, గాంధీ జీవిత చరిత్రను ’మట్టినుండి మమ్మల్ని మనుషులుగా మలచిన వ్యక్తి’ అనే పేరుతో రాశాడు. ఇందులో కేవలం మహాత్ముని అసమాన ప్రభావం కారణంగా ఆత్మ త్యాగాన్ని, ప్రజ్ఞా పాటవాల్ని ప్రదర్శించిన లెక్కలేనంత మంది స్వాతంత్ర్య సమర యోధుల భావనల నేపధ్యం కనబరుస్తాడాయన. మహాత్ముడు లేనట్లయితే, లెక్కలేనంతమంది ఈ భారతీయులు సాధారణ న్యాయవాదులుగాను, ఉపాధ్యాయులుగాను, బ్రోకర్లుగాను, క్లర్కులుగాను, లేకపోతే బ్లాక్ మార్కెట్ వారిగాకూడాను సంతృప్తిగా ఉండిపోయేవారు. కరక అనేదేంటో మనం అర్థం చేసుకోగలం ఈనాడు.

JM ఉపాధ్యాయకూ ఈ విషయం అర్థం అయింది- అయితే ఆయన మరింత అర్థవంతంగా ముగిస్తారు: "గాంధీజీ సామాన్యమైన బంకమట్టితో కూడా మహోన్నత వ్యక్తులను తయారు చేయగలరనేది సత్యం. ఈ విషయంలో కూడా ఆయన మొదటి ప్రయోగం, అద్భుత విజయాల్నందుకున్న ప్రయోగం, తనమీద తాను చేసుకున్నదే. "