గత సంచికలో మాదిరి ఈ సారికూడా కొత్తపల్లి పత్రికను అనుకున్న సమయానికి వెలువరిస్తున్నాం. అయితే బడుల ముగింపు పనుల ఒత్తిడి కారణంగా పత్రిక రూపంలో ఈసారి అనుకున్నన్ని మార్పులు చేయలేకపోయాం. మరి ఈలోగా శలవలు వచ్చేశాయ్! అందువల్ల తదుపరి సంచిక కొద్దిగా ఆలస్యంగా వెలువడే అవకాశం కూడా ఉంది.
పరీక్షలైపోయాయంటే మార్కులిచ్చే ఋతువు మొదలౌతుంది. కొందరికి ఎక్కువ వస్తాయి, కొందరికి తక్కువ వస్తాయి. అయినా ఏమీ పరవాలేదు. మార్కులు ప్రతిభకు కొలమానం కాదు. కావాలంటే ఈ సంచికలోని "గాంధీజీ మార్కుషీటు" చూడండి. అదే రచనలో రామచంద్ర గుహ గారు ఐన్ స్టీన్ గురించీ రాశారు. ఓసారి చదవండి. మార్కులకంటే మానవ వ్యక్తిత్వం ఉన్నతమైనదని మరోసారి గుర్తు చేసుకోండి.
ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఆహారధాన్యాల కొరత. రైతులకు, పల్లెలకు ప్రాధాన్యత తగ్గిపోయి అందరూ శ్రమలేని పనులపైకి ఎగబడటంతో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. ’దేశానికి వెన్నెముక రైతు అయితే, రైతుకు వెన్నెముక పశువులు’ అని మంజునాధ్ తన కథ "పశు సంపద" లో చెబుతున్నాడు ఈ సంచికలోనే.
చాలా ప్రభుత్వాసుపత్రుల్లో డాక్టర్లు ఉండటం లేదు. గ్రామాల్లో జనాలు ఏం చేస్తారు? వాళ్లమీద వ్యంగ్యంగా కధలు చెప్పుకుంటారు. అలాంటి ఓ నవ్వుల కథ, ౩వ తరగతి పాప మల్లిక చెప్పిన "సూది, గుడ్డు, పేడతప్పె" కథ. ఈ కథ అనంతపురం జిల్లాలోని అవ్వలందరికీ తెలుసు. మీకూ తెలిసే ఉండచ్చు, మరి చదివి చూడండి.
గంగాదేవి, బంగారు బిందె, వెండిబిందె, సొంత బిందె కథ అనేక రూపాల్లో తెలుగునాట అంతా ఉన్నది. ఆ కథతో పాటు ఇందులో ’ముక్కుడోడి కథ’ కూడా ఉంది. ఇంగ్లీషు ఫెయిరీటేల్ ’టామరిండ్ డ్రమ్’ ని పోలిన ఈ కథ కూడా మీకు తెలిసి ఉండచ్చు. చదవండి ఈ సంచికలో. అలాగే శత్రువులైన జంతువులు మిత్రులు ఎలా అయినాయో "తెలివైన కుందేలు" కథ చదివితే తెలుస్తుంది.
ఇక ఈ సంచికలో 10 పాటలున్నై. అన్నింటినీ మీరు వినచ్చు! నచ్చితే డౌన్లోడ్ చేసుకోవచ్చు కూడా. ఇందులో పదిచిలకలు పాటను పిల్లలు ముద్దు ముద్దుగా తప్పులు పాడారు. మీరూ వాటిని అలాగే వినండి, అయితే పాడుకునేటప్పుడు సరిచేసుకొని పాడుకోండి. ఇందులో ఉన్న "ఆడాలి, ఆటలాడాలి" పాట స్ఫూర్తి మాకందరికీ నచ్చింది. "సూర్యుడై వెలగాలి" పాటలో తల్లి తన కొడుకు మీద ఎన్నెన్ని ఆశలు పెట్టుకుంటుందో చూస్తే విచారం వేస్తుంది.. ఇంకా- టింబక్టు బడిలో పిల్లలు ఏమేం చేస్తారో తెలిపేపాట "టింబక్టు బడి పిల్లలం" కొత్తపల్లి మొదటి సంచికలో రావలసింది, ఇప్పుడొస్తోంది. ఇవికాక మరిన్ని అద్భుతమైన పాటలు మీ వీనులకు విందు చేసేందుకు సిద్ధంగా ఉన్నై ఈ సంచికలో. ఆస్వాదించండి.
ఇవికాక ఈ సంచికలో పిల్లలు కొందరికి నచ్చిన జోకులున్నై. ఈ జోకులు మేంకూడా ఇంతకుముందే వినిఉన్నాం, మీరూ విని ఉండొచ్చు, అయినా నవ్వుకోడానికి ఇవి బాగానే ఉంటై, ప్రయత్నించండి.
అన్నీ చూడండి, వినండి, చదవండి. పత్రిక మొత్తాన్నీ డౌన్లోడ్ చేసుకోండి. మిత్రులతో పంచుకోండి. మీ అభిప్రాయాలన్నీ రాయండి. మీ రచనల్నికూడా పంచుకోండి. కొత్తపల్లిలో పిల్లలకే ప్రాధాన్యత, కనక కలం చేత బూనండి, గొంతులు సరిచేసుకోండి.
ఉంటాం. మీ, కొత్తపల్లి బృందం.