ఆరోజు రాత్రి భోజనాలయ్యాక "ఇదిగో, అమ్మతోటీ-నాన్నతోటీ మాట్లాడు" అంటూ ఫోనులో నంబరు కలిపి ఇచ్చారు తాతయ్య.

ఫోను ఎత్తినాక వాళ్ళమ్మ సునందకి అసలు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు బిట్టు: అమ్మమ్మ ఇంట్లో ఏమేం జరుగుతున్నాయో అవన్నీ ఉత్సాహంగా చెప్పేస్తూ పోయాడు: పిచ్చుకల్ని పెంచుకోవటం గురించి చెప్పాడు; 'దానివల్ల పిచ్చుకల సంఖ్య పెరుగుతుంది' అని తాతయ్య మెచ్చుకున్న సంగతి చెప్పాడు; తన వల్లనే తాతయ్య, అమ్మమ్మ పిచ్చుక గూడుని ఇంట్లోకి తెచ్చారని చెప్పాడు; దావీదు ప్రొద్దున్నే న్యూస్ పేపర్లు వెయ్యటం, స్కూటర్ తగిలి క్రింద పడిపోయి దెబ్బలు తగలటం, తాతయ్య దావీదుని చదివిస్తానని మాట ఇవ్వటం, అన్నీ చెప్పాడు.

అటుపైన తన క్రొత్త స్నేహితులు రమ్య, రాహుల్ గురించి; జయమ్మమ్మ రెయిన్బోగాడిని విసుక్కుందనీ, కానీ ఆ తర్వాత వడియాలు ఎండబెట్టినప్పుడు కోతుల గురించి రెయిన్బో గాడు హెచ్చరించాడనీ, అప్పట్నుంచి జయమ్మమ్మ వాడిని ఇష్టంగా చూస్తోందనీ చెప్పాడు.

కమలమ్మ ఇంట్లో కరీనా అనే ఒక గేదె ఉందని, అది ఒక బుజ్జి దూడని ఈనిందని, జున్ను పాలతో అమ్మమ్మ అందరికీ జున్ను వండిందని' చెప్పాడు. అలా చెబుతున్నప్పుడు నాలుక మీద మెదిలిన జున్ను రుచికి వాడి మాట తడబడింది కూడా!

-అన్నీ వింటోంది సునంద. వాడికి అక్కడ బాగుందని ఆమెకి అర్థం అయ్యింది. జున్ను పేరు ఎత్తేసరికి ఆమెకు కూడా జున్ను తినాలని ఆశ పుట్టింది; కానీ పాపం, ఏమీ చెయ్యలేక నిట్టూర్చింది. అకస్మాత్తుగా చెప్పింది: ‘నాన్న-నేను ఇద్దరమూ నిన్ను చాలా మిస్ అవుతున్నాంరా, బిట్టూ! నీకేమో అక్కడ బోలెడు ప్రపంచం తయారైంది... నేను ఇంకో వారం రోజుల్లో వస్తాను అక్కడికి సరేనా? ఆ తర్వాత మనిద్దరం కలిసి మళ్ళీ మన ఊరు దిల్లీకి వెళ్ళిపోదాం. నీకిక్కడ స్కూలు ఇంకో పదిరోజుల్లో తెరుస్తారు కదా?!’

-బిట్టు ఉలిక్కిపడ్డాడు. 'అమ్మ వచ్చేస్తుందా? తనని దిల్లీ తీసుకెళ్లిపోతుందా? అప్పుడే సెలవులు అయిపోయాయా?!' బిట్టుకి ఏడుపొచ్చినట్లు అయ్యింది. ఏం మాట్లాడాలో తెలియలేదు. అమ్మ చెప్పే సంగతులన్నీ ఊరికే వినటం మొదలు పెట్టాడు మౌనంగా.

అక్కడే ఉండి వాడిని గమనిస్తూన్న అమ్మమ్మ కంట్లో నీళ్లు తిరిగాయి: 'నెల రోజులుగా వీడు గలగలా మాట్లాడుతూ ఇల్లంతా తిరుగుతుంటే, అందరం ఒకరికొకరం అలవాటు పడిపోయి, 'అసలు వాడు ఇక్కడి వాడే' అన్న ధోరణిలోకి వచ్చేసాం' అని అవిడకి అర్థమైంది. 'ఇప్పుడింక వాడు వెళ్తాడు. మళ్లీ వేసవి సెలవుల కోసం ఎదురు చూడాల్సిందే. అంతకు మించి చెయ్యగలిగింది లేదు..' అని విచారం వేసింది ఆమెకి కూడా. ‘పోనీ, అమ్మా....నేను ఇక్కడే దావీదు, చిట్టితో పాటు చదువుకోనా?’ బిట్టు ఫోనులో అడుగుతున్నాడు.

వాడి ప్రశ్నకి తాతయ్యకీ దిగులేసింది. ఒక్కసారి అమ్మమ్మ మనసులో ఆశ కలిగింది- బిట్టుని తమతోబాటే ఉంచుకుని చదివిద్దామని. కానీ అంతలోనే 'వాళ్ల అమ్మ- నాన్నల దగ్గరికెళ్లద్దూ, బిట్టు?' అనుకుంది. 'ఇక్కడ చిట్టి, దావీదు ఉంటారు కదా, ఇంట్లో పిల్లల్లాగా? మాకు కాలక్షేపం చేస్తారులే' అని సరిపెట్టుకుంది. ఆరోజు బిట్టు తన మంచం మీద పడుకోకుండా అమ్మమ్మ ప్రక్కన చేరాడు. వాడి మనసులో దిగులు అమ్మమ్మకి తెలుసు. కానీ వాడు వాడి అమ్మ-నాన్నల దగ్గర పెరగటమే న్యాయం కదా? వాడి చదువులు, ప్రపంచం అంతా అక్కడే ఉంది. వాడు పోరంకికి సెలవుల్లో మాత్రమే రాగలడు- ఊరికే, ఒక ఆటవిడుపుగా. అంతే. బిట్టు తల నిమురుతూ నిమురుతూ కూడా అమ్మమ్మ ఇదే ఆలోచనలో పడి, వాడికి కథ చెప్పటం మరిచిపోయింది. చటుక్కున తేరుకొని చూస్తే, ఆ సరికే వాడు నిద్రలోకి జారిపోయాడు.

ప్రొద్దున్నే కమలమ్మతో పాటు వచ్చింది చిట్టి. బిట్టూ తనకి చెప్పేసాడు: "మా అమ్మ వస్తోంది. నేను అమ్మతో పాటు దిల్లీకి వెళ్లిపోతున్నాను" అని. చిట్టి కూడా కాస్సేపు దిగులు పడింది. అంతలోనే ఆరిందాలా ‘బిట్టూ! మీ అమ్మా, నాన్న నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా; దిల్లీలో నీ స్నేహితులు, మీ జావేద్ అంకుల్ అందరూ 'నువ్వు ఎప్పుడు వస్తావో' అని చూస్తూ ఉంటారు. నువ్వు ఇప్పుడు వెళ్లి, ఈసారి మళ్లీ వేసవి సెలవులివ్వగానే వచ్చెయ్యి. అప్పుడు మాకు మళ్ళీ క్రొత్త క్రొత్త సంగతులు చెబుదువుగాని. సరేనా?!’ అంది. బుధ్ధిగా తలూపాడు బిట్టు.

ఆరోజు రెయిన్బో గాడికి స్నానం చేయిస్తూ, ‘అమ్మమ్మా, నేను రెయిన్బో గాడిని దిల్లీ తీసుకెళ్తాను’ అని చెప్పాడు బిట్టు ఉత్సాహంగా.

అమ్మమ్మ మాత్రం 'అది కుదరదు' అంది. ‘వీడిని దిల్లీ తీసుకెళ్తే, అక్కడ నువ్వు, అమ్మ, నాన్న- అందరూ‌ బడులకు, ఆఫీసులకు వెళ్లిపోతే, అప్పుడింక రెయిన్బోగాడిని ఎవరు చూసుకుంటారు? అదీకాక అక్కడ అపార్ట్మెంట్లలోకి కుక్కపిల్లల్ని అనుమతిం-చరు; ఇక్కడైతే మేమందరం వాణ్ని చూసుకుంటాం. వాడు ఆడుకునేందుకు బోలెడు స్థలం ఉంటుందిక్కడ. నువ్వు మళ్లీ వచ్చేసరికి చక్కగా పెద్దవాడు అవుతాడు కూడా. అప్పుడు నువ్వు బలే ఆడుకోవచ్చు వాడితో..’ అమ్మమ్మ మాటలు విని ఆలోచనలో పడ్డాడు వాడు. 'బిట్టూ దిల్లీ వెళ్ళిపోతున్నాడు' అన్న వార్త ఆరోజు సాయంత్రం కల్లా పిల్లలందరికీ చేరింది. అందరికీ దిగులు మొదలైంది. వాళ్ల దిగులు మరిపించటం కోసం అమ్మమ్మ కమలమ్మ సాయం తీసుకొని పూరీలు, మైసూర్‌పాక్ చేసింది. ఆ ఇష్టమైన పలహారాలు చూసాక పిల్లల ముఖాల్లోకి కొద్దిగా సంతోషం వచ్చి చేరింది.

'బిట్టు వెళ్ళిపోతాడు' అన్న వార్త తాతమ్మకి కూడా చేరింది. వాడు వెళ్తాడంటే ఆమెకి కూడా ఏమీ తోచకుండా అయ్యింది. చక్కగా తనకి ఏం కావాలంటే అవి అందిస్తాడు; బోలెడు కబుర్లు చెబుతాడు; పాటలు పాడతాడు; తాతయ్యతో షికారు వెళ్తాడు; తను చేసే పనులన్నీ ప్రక్కనే కూర్చుని గమనిస్తాడు.. వాడు కాస్తా ఇప్పుడు దూరం వెళ్తున్నాడంటే ఆవిడకి కూడా నచ్చటం లేదు. కానీ ఏం చెయ్యాలి?!

అప్పటికీ ‘మణీ, నువ్వు ఆమాత్రం పెంచలేవటే, పిల్లాడిని?! అయినా చంటి వెధవ- వాడికి ఏం చెయ్యాలి గనక?! వాడే నీళ్లు పోసుకుంటాడు; వాడే తల దువ్వుకుంటాడు; ప్రొద్దున్నే కాస్త అన్నం పెట్టి బడికి పంపటమేగా? ఆమాత్రం పని నువ్వు చెయ్యలేవూ? దిల్లీలో వాళ్ల అమ్మకి ఉద్యోగంతో ఎక్కడ తీరుతుంది, వాడిని చూసుకుందుకు?!’ అంటూ కోడల్ని మెత్తబరచే ప్రయత్నం చేసింది.

"అన్నం పెట్టి బడికి పంపటం ఒక్కటే కాదు అత్తయ్యా, పిల్లవాడు పాపం అమ్మానాన్నల దగ్గర పెరగద్దూ?! వాడు లేకపోతే వాళ్లకీ బెంగే! పైగా వాడి చదువు కూడా ఉందాయె! ఇప్పుడు పంపించేసి, మళ్ళీ సెలవులకి తీసుకొద్దాంలెండి" అని అత్తగారికి సర్ది చెప్పింది మణి.

తాతయ్య కూడా కొంచెం దిగులు పడ్డారు కానీ, "వీడు దిల్లీ వెళ్లే లోపు అందరినీ ఎక్కడికైనా పిక్నిక్ కి తీసుకెళ్లాలని ఉందిరా!" అన్నారు. అప్పుడప్పుడే రాష్ట్ర రాజధానిగా తయారవుతున్న అమరావతిలో మ్యూజియం, విజయవాడలో దుర్గగుడి దగ్గరలో అభివృద్ధి చేసిన భవానీ ద్వీపం వీళ్లకు చూపిద్దామని ఉండింది ఆయనకు.

బిట్టు వాళ్ళ అమ్మ సునంద ఇంకా నాలుగురోజుల్లో వస్తుంది, ఆమె వచ్చిందంటే ఇక సామాన్లు సర్దుకునే హడావుడి మొదలవుతుంది. ఈ లోపు రమ్య, రాహుల్ కూడా వాళ్ల ఊరుకు వెళ్లిపోతారు. అందుకని పిల్లలందరితో పాటు జయమ్మమ్మ, తాతమ్మ, కమలమ్మ, వీరబాబు లని కూడా పిక్నిక్ కి తీసుకు వెళ్లేందుకు ఏర్పాటు చేసారు తాతయ్య. ఒక ఒక పది పన్నెండు మంది పట్టే చిన్న వ్యాన్ ఒకటి ఏర్పాటు చేసి, అందరికీ సరిపడ పలహారాలు, భోజనాలు, మంచినీళ్ల సీసాలు పట్టుకుని, పిక్నిక్ కి బయలు దేరారు.

కొత్తగా తయారవుతున్న అమరావతి నగరం విజయవాడకు 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయవాడలో మామూలు జనాలు నివసించే ఇళ్ళు, గుళ్ళు, బళ్ళు ఉంటే, అమరావతిలో ప్రభుత్వం కట్టించే ఆఫీసులు, పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి.

రాష్ట్ర రాజధానిని నిర్మించటంలో భాగంగా క్రొత్త క్రొత్త రోడ్లు, భవనాలు తయారవుతున్నాయి అక్కడ. వాటినన్నిటినీ‌ పిల్లలు ఆశ్చర్య పోతూ చూసారు.

బుధ్ధుడి జీవిత విశేషాలను తెలియజేసే చిన్నమ్యూజియం ఒకటి ఉందక్కడ. అందులో క్రీ. పూ. 3 శతాబ్దం నుండి క్రీ. శ. 12 వ శతాబ్దం వరకు- ఆ మధ్య కాలానికి చెందిన వస్తువులను ఉంచారు. 'ఇవన్నీ‌ త్రవ్వకాల్లో‌ దొరికాయి' అని తాతయ్య చెబితే, 'అసలు అవన్నీ‌ మట్టిలో‌ ఎందుకు పూడిపోయాయట?!' అని ఆశ్చర్య-పోయారు అందరూ. అమరావతిలోనే ధ్యాన బుధ్ధ విగ్రహాన్ని, బౌధ్ధ స్థూపాన్ని చూసారు. క్రీస్తుపూర్వం 3 వ శతాబ్దం నాటి 'మహా చైత్య స్థూపం' అట అది.

అక్కడి నుంచి కృష్ణా నదిలో ఉన్న భవానీ ద్వీపం వెళ్లారు. ఆ ద్వీపం చేరేందుకు ఒక పడవ ఎక్కి వెళ్లాలి. చుట్టూ పచ్చని చెట్లు; ఒక ప్రక్కన కనకదుర్గ గుడి కొండ; మరో ప్రక్క ప్రకాశం బ్యారేజీ- వీటిని చూస్తూ పడవ ప్రయాణం! పిల్లలకి ఆ పడవ ప్రయాణం బలే నచ్చింది. పడవ మీద రెయిన్బో గాడు తెగ సందడి చేశాడు. ఆ ద్వీపం చాలానే పెద్దది. మొత్తం 133 ఎకరాల స్థలమట. అక్కడ అంతా రకరకాల జల క్రీడలు- బనానా బోట్లు, స్వాన్ బోట్లు, స్పీడు బోట్లు, వాటర్ బెలూన్ లాంటివి అభివృధ్ధి చేసారు. బోలెడన్ని చెట్లతో చక్కని అడవిలాగా కూడా ఉంది ఆ ప్రాంతం. చెట్ల కొమ్మలకు ఉయ్యాలలు, కొమ్మల పైన పైననే నడిచే 'రోప్ వే'ల్లాంటి ప్రత్యేకతలు కూడా ఉన్నాయి.

ప్రభుత్వంవారు పర్యాటకాన్ని అభివృధ్ధి చేసేందుకు అక్కడ అనేక సాంస్కృతిక కార్యక్రమాల్ని కూడా ఏర్పాటు చేశారు. పర్యాటక శాఖ వారి అనుమతితో అక్కడ పిల్లల పుట్టిన రోజులు లాంటి వేడుకలు కూడా జరుగుతున్నాయి. చక్కని రుచికరమైన భోజనం కూడా దొరికింది. అక్కడే రాత్రి పూట కూడా ఉండచ్చట! దానికి గాను అక్కడ చెట్టు కొమ్మల మీద నిర్మించిన ప్రత్యేకమైన కాటేజీలు కూడా ఉన్నాయి! పిల్లలంతా అక్కడ ఆడి-ఆడి, అలిసి పోయి ఇల్లు చేరారు.

(ఇక వచ్చేసారితో ముగింపు..)