పుల్లయ్య ఒక సన్నకారు రైతు. అతనికి ఉన్న ఆస్తల్లా రెండెద్దులు, మూడెకరాల పొలం, పొలంలోనే ఒక మూలగా ఇల్లు. ఇంటికి పక్కనే ఎద్దులకోసం ఓ పాక, దానికి కొంచెం అవతలగా పేడ దిబ్బ ఉంటుంది. ఇంటి పెరట్లో కూరగాయలు వేస్తాడతను. ఓ అర్థ ఎకరంలో పశువుల మేతకోసం గడ్డి పెంచుతాడు.

అందరు రైతుల్లాగే పుల్లయ్య కూడా ప్రతిరోజూ చీకట్లోనే లేస్తాడు. ఎద్దుల్ని మేతకు వదలటం, పాకని శుభ్రం చేసుకోవటం, తర్వాత పొలం పనులు; సాయంత్రం అవుతుండగా ఊర్లో రచ్చబండ దగ్గర కబుర్లు- ఇదీ, పుల్లయ్య దినచర్య.

ఓ రోజు అతను కసువు ఊడ్చి దిబ్బలో వేయబోతుండగా, మసక వెలుతురులో కనబడింది- పాము తోక! పాము తలేమో దిబ్బకు అవలివైపుగా ఉన్నది. అది ఇప్పుడే ఏ ఎలుకనో మెక్కి ఉంటుంది; చురుకుగా కదలటం లేదు; అలికిడినీ పట్టించుకోలేదు.

పుల్లయ్య స్వతహగా ధైర్యవంతుడే; కానీ అతనిది కొంచెం సున్నితమైన మనసు. అందుకే 'చంపుదామా, వద్దా?!' అని ఆలోచనలో పడ్డాడు. 'అది నన్ను ఏమీ చేయలేదు కదా' అనుకున్నాడు. 'అలా అని వదిలేస్తే?' 'ఇల్లు ఇక్కడేనాయె. భార్యాపిల్లలు తిరుగుతుంటారు. ఎవరికైనా ఏదైనా జరగరానిది జరిగితే ఎలాగ?' పామును గమనిస్తూనే ఆలోచించసాగాడు. యింతలో పాము కాస్త కదిలింది.

పుల్లయ్య మనసూ గట్టి పడింది. అక్కడే ఉన్న ఓ కట్టె పట్టుకొని చటుక్కున ఒక్క దెబ్బ వేశాడు. వేటు సరిగ్గా పడ్డట్లు లేదు; పాము సరసర మని వంపులు తిరుక్కుంటూ పరుగు అందుకున్నది. పుల్లయ్య దాని వెంట పడి మరో రెండు వేట్లు వేశాడు. అయినా అది తప్పించుకున్నది.

పది రోజులు గడిచినై. ఒక రోజు సాయంత్రం పూట పొలంలో తిరుగుతుంటే అల్లంత దూరాన పాము కుబుసం ఒకటి కనబడింది పుల్లయ్యకు. అటు ఇటు చూస్తే అక్కడో గట్టు వెంబడి పాక్కుంటూ పోతున్నది పాము!

"అమ్మో!" అనుకున్నాడు పుల్లయ్య. "కొంపదీసి ఆ పాము పగ పట్టలేదు కద?!" అనుమానం మొదలైంది. ఆరోజు ఇంటికెళ్లి పడుకున్నాక నిద్రపట్టింది గానీ, ఎక్కడ లేని కలలూ వచ్చాయి. అయితే నిద్ర లేచేసరికి పాము సంగతి అతనికి గుర్తు లేదు.

మరో రెండు వారాల తర్వాత, ఎద్దులకు కుడితి పెడుతుండగా, పక్కనే ఏదో 'సరసర' ప్రాకినట్లయి, మళ్ళీ పాము గుర్తొచ్చింది. చేతిలో పనినంతా వదిలి దిబ్బ వరకూ అన్ని వైపులా చూసుకొచ్చాడు. ఊహు! ఏమీ దొరక లేదు.

మరో పక్షం రోజులు గడిచాయి. రాత్రి ఆరుబయట పడుకున్నారు అందరూ. ఎద్దు మెడలో గంటల శబ్దం అవ్వటంతో ఉన్నట్లుండి మెలకువ వచ్చింది. చూస్తే ఎద్దు లేచి నిలబడి ఉన్నది. ప్రక్కనే గంప క్రింద కోళ్లు 'క్కొక్కొక్కొ...'మంటున్నాయి…

'పాము!'అనుకుంటూ చటుక్కున కర్ర తీసుకుని ముందుకు ఉరికాడు పుల్లయ్య. చిన్న బల్పు వెలుతురులో కనబడింది పాము- ఓ ఆరడుగుల దూరంలో గబగబా పాక్కుంటూ‌ పోతున్నది.

పుల్లయ్య అనుమానం బలపడింది. "ఈ పాము నాపై పగ పట్టినట్టుంది. ఏదో ఒకటి చేయాలి రేపు" అనుకున్నాడు. ఆ రోజు సాయంత్రం రచ్చబండ దగ్గర చేరిన మిత్రులతో ఈ సంగతులన్నీ చెప్పాడు.

"జాగ్రత్తరోయ్‌! పాములు విషం!" అన్నాడు వెంకటయ్య.

"మన వెంకటసామి కాడికెళ్లు బావా! ఇసుక మంత్రించి ఇస్తాడు. ఇంటి సుట్టూ జల్లు; సరిపోద్ది. పిల్ల-జెల్ల తిరిగేదాయె!" బామ్మర్ది సుబ్బయ్య సలహా ఇచ్చాడు.

"ఇదో పుల్లయ్యా! ఎందుకైనా మంచిది; కాస్త జాగ్రత్తగానే ఉండు. పక్కూళ్ళో‌ పాములు పట్టే ఈరన్నుండ్లా, ఆణ్ణి పిలిపించుకో. నాల్రోజులు ఇంటి దగ్గరే రాత్రికి బస ఏర్పాటు జేయి. ఆడే జూసుకుంటాడు" అన్నాడు మరో పెద్దాయన.

ఇంతలో‌ రాజారావు వచ్చాడు అక్కడికి. అతను పట్నంలో లెక్చరర్‌గా పని చేస్తుంటాడు. సంగతంతా విని, అతను పెద్దగా నవ్వాడు.

"అదేంటిరా?! మీ మామ భయంతో వణికిపోతా వుంటే నీకు నవ్వుతాలుగా ఉందా?" అడిగాడు వెంకయ్య. "లేకపోతే ఏంది, పెద్దయ్యా?! మనం ఏ కాలంలో‌ఉన్నాం? పాములు పగ పట్టడమేంటి? ఇంత పెద్ద బుర్ర ఉన్న మనమే అనేక విషయాలు మరిచిపోతూ ఉంటామే, ఇంక పాముకు ఎంత మెదడు ఉందనుకున్నారు? దానికి ఉండే మెదడే‌ వేపకాయంత. అంత చిన్న మెదడులో దానికి ఇంకా ఇంత జ్ఞాపకశక్తి అంటూ అసలు ఉండనే ఉండదు!" నవ్వాడు రాజారావు.

"అంటే ఏందిరా, నువ్వనేది?.. పాములు పగపట్టవు అంటుండావా?" సుబ్బయ్య తాత.

"అవును తాతా, వాటికంత సీను లేదు"

"మరైతే రెండు నెలలుగా ఆ పాము నా చుట్టూతానే ఎందుకు తిరుగుతోంది అల్లుడూ?! నేను ఇట్టాంటివి పట్టించుకోనని నీకు తెలుసు కదా; అందుకే మొదట్లో‌ పట్టించుకోలేదు- కానీ జరిగినవన్నీ చూస్తుంటే నమ్మక ఎట్టుండేది?" పుల్లయ్య అడిగాడు భయంతో.

రాజారావు అందరికేసీ చూస్తూ చెప్పాడు- "సరే! అందరూ మరి నాతోబాటు పుల్లయ్యమామ ఇంటికి రండి! ఈ పాము పగ సంగతేందో స్పష్టంగా తేల్చేస్తాను. పుల్లయ్య మామా! నీ సమస్య తీరిందంటే మరి, మాకు అందరికీ మంచి భోజనం పెట్టించాలి, సరేనా?" అని.

అందరూ కదిలి పుల్లయ్య ఇల్లు చేరారు. వాళ్ళందరినీ అక్కడ తిన్నెలమీద కూర్చోబెట్టి, రాజారావు ఒక్కడే మెల్లగా పేడ దిబ్బ దగ్గరికి వెళ్ళాడు. ఏం మంత్రం వేసాడో మరి, కొద్ది సేపట్లోనే ఒక పామును, దాని నోటి దగ్గర నొక్కి పట్టుకొని- తీసుకొచ్చాడు! సన్నగా, గోధుమరంగులో మెరిసిపోతూ, నాలుగడుగుల పొడవు ఉంది అది. అందరూ తిన్నెలమీద నిలబడి హాహాకారాలు చేసారు.

"చూడు మామా, మూడు నాలుగు మార్లు పామును చూసినావు గదా, దీన్నేనా?" అడిగాడు రాజారావు. "ఇదే గావచ్చురా అల్లుడూ! దొంగది, నామీద పగ బట్టింది చూడు!" అన్నాడు పుల్లయ్య దానికేసే కోపంగా చూస్తూ.

గుడ్లప్పగించి తన చేతిలోని పామునే చూస్తున్న పుల్లయ్య కొడుకుని ఉద్దేశించి "కొన్ని గోనె సంచీలు తే రా" అని, రాజారావు చెప్పాడు- "ఇది విషం పాము కాదు మామా! దీని తల చూసావా, ఎలా ఉందో? విషం పాము తల త్రిభుజాకారంలో ఉంటుంది- దీనికి పళ్ళు ఉంటాయి గానీ, కోరలు ఉండవు చూడండి-" అని ఒక పుల్లతో ఆ పాము నోరు తెరిచి చూపాడు.

అందరూ ఆశ్చర్యంగా చూసారు.

ఆ పాముని గోనె సంచీలో వేసి మూతి బిగించిన రాజారావు, ఈసారి పశువుల శాల వెనకవైపుకు వెళ్ళి, ఐదు నిముషాల్లో మరో పాముతో తిరిగి వచ్చాడు- ఇది లావుగా, నల్లగా మెరిసిపోతూ ఆరేడు అడుగుల పొడవు ఉంది!

"ఇదే! ఇదే!‌ నన్ను వెంటాడిన నాగుపాము ఇదే" అన్నాడు పుల్లయ్య, చెమటలు కక్కుతూ.

"మామా! దీన్ని జర్రిపోతు- 'రాట్ స్నేక్' అంటారు. చూసేకి నాగుపాములా ఉంటుంది కానీ, ఇది ఎలుకల్ని తిని రైతుకు మేలు చేస్తుంది. దీనికి కూడా విషం ఉండదు-" అని దాని నోటినీ ఓ పుల్లతో తెరిచి చూపాడు రాజారావు.

ఆ పాముని కూడా గోనె సంచీలో వేసి మూతి బిగించాక, మళ్ళీ పోయి, ఈసారి దగ్గర్లోని పొదలోంచి చటుక్కున ఓ పామును ఎత్తుకొచ్చాడు- సన్నగా, కట్లు కట్లుగా ఉందది. ఎక్కువ పొడవు కూడా లేదు- ఏదో‌ పాము పిల్ల ఉన్నట్లు ఉంది-

"ఇది విషం పాము పెద్దయ్యా! కట్లపాము! దీని నోట్లో కోరలుంటాయి చూడండి!" అంటూ ఓ‌ పుల్లతోటి దాని నోరు తెరిచి చూపించాడు- నోట్లో‌ రెండు వైపులా రెండు పెద్ద పెద్ద కోరలు ఉన్నాయి! ఇది కరిస్తే కొద్ది గంటల్లో మనిషి చచ్చిపోతాడు. మీకు కనబడింది ఇదేనా?" అన్నాడు రాజారావు.

"ఇది కాదురా అల్లుడూ! నాకు కనిపించింది ఇందాకటి జర్రిపోతే అనుకుంటాను" అన్నాడు పుల్లయ్య అనుమానంగా.

కట్లపాముని కూడా గోనెసంచీలోకి వేసి మూట కట్టాక, రాజారావు వెళ్ళి వెతికి ఒక్కోసారి ఒక్కో‌ పాము లెక్కన ఇంకో ఐదు పాములు పట్టుకొచ్చాడు!

"ఒరే! ఇక్కడేదో పాముల ఫ్యాక్టరి పెట్టినట్టు ఉన్నాడురా, మీ‌మామ?!" నవ్వాడు సుబ్బయ్య తాత.

రాజారావు కూడా నవ్వుతూ చెప్పాడు "చూడండి, పుల్లయ్య మామ ఇల్లు ఊరి బయట ఉంది. కూరగాయల పంట ఉంది గనక, చెత్తాచెదారం బాగా పడుతుంది. దిబ్బలు గూడా దగ్గర్లోనే వేసుకునె!

దిబ్బలో కూరగాయలు, గింజలు తినేందుకని వాటిల్లోకి ఎలుకలు, ఏవేవో పురుగులూ, తేళ్ళూ, కప్పలూ అన్నీ‌ చేరతాయి. ఇవన్నీ రాత్రి పూట బయటికి వస్తాయి. వాటి కోసమని ఎక్కడెక్కడి పాములూ వస్తాయి. కూరమొక్కల గుబుర్లలో ఇవి పుట్టలు పెట్టుకోవచ్చు కూడా. ఇంకా వెతికితే ఎన్ని దొరుకుతాయో మరి-

పుల్లయ్య మామా! నువ్వు నాలుగైదు పాముల్ని చూసి ఉంటావు. ప్రతిసారీ ఆ పాము ఒకటే కానక్కర్లేదు. తరచుగా కంటపడటం వల్ల నీకు అట్లా అనిపించి ఉంటుంది.

పాములకు చెవులు ఉండవు! అయినా మనం అడుగులు వేసినప్పుడు భూమి కంపిస్తుందే, అ కంపనల ద్వారా అవి మనం వస్తున్నామని పసిగట్టి, కుదిరితే‌ పారిపోతాయి; లేకపోతే ప్రాణభయంతో కంగారు పడి, మిగతా ప్రాణులలానే పోరాడతాయి. అంతే" అన్నాడు.

ఇక ఎవ్వరూ రాజారావు మాటలకు ఎదురు పల్కలేక పోయారు. "అంతేనంటావా అల్లుడూ!" అని మాత్రం అనగలిగాడు పుల్లయ్య.

"అవును మామా, నీకు ఇంతకుముందే‌ ఎన్నోసార్లు చెప్పాను- ఆ దిబ్బలు ఇంటికి దగ్గరగా వేయొద్దని, గుబురుగా చెత్తని పడేయొద్దని. అలా గుబుర్లు, చెత్త, చెదారం ఉంటేనే‌ పురుగు పుట్ర చేరేది. పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకుని చూడు. ఇవేవీ ఇంక దగ్గరికి కూడా రావు. ఇంకా అనుమానం ఉంటే, ఎప్పుడూ పొలంలో గడ్డిలో తిరుగుతూ‌ ఉంటావు కనుక, మోకాళ్ళ వరకూ ఉండే బూట్లు కొనుక్కో. కాళ్ళన్నీ‌ మూసేసేలా ఉండే‌ మందమైన బట్టలు వేసుకో. ఒకవేళ పొరపాటున ఏ పురుగో కొరికినా ఏమీ ప్రమాదం కాదు"‌ జాగ్రత్తలు చెప్పాడు.

ఇక ఆ మరునాటి నుండే పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం మొదలు పెట్టాడు పుల్లయ్య. దిబ్బల్ని ఇంటికి దూరంగా జరిపాడు. చెత్త, మరుగు, పొదలు ఇంటికి దగ్గరగా ఏమేమున్నాయో వాటినన్నిటినీ‌ తొలగించి దిబ్బల్లో వేసేసాడు. పుల్లయ్యే కాదు- ఊళ్ళో చాలామంది తమ ఇంటి పరిసరాల్ని బాగు చేసుకున్నారు. ఇక అటుపైన వాళ్ళ ఇళ్లకు, పశువుల పాకలకు పాముల బెడద పూర్తిగా తొలగిపోయింది!