అక్షయ్‌ తల్లిదండ్రులు వ్యవసాయదారులు. పెద్దగా చదువుకున్నవాళ్ళు కాదు. "చదువు రాకపోవటం వల్ల మేము చాలా నష్టపోయాం" అన్న భావనతో వాళ్ళు అక్షయ్‌ని బడికి పంపించేవాళ్ళు.

"మంచిగా, బుద్ధిగా చదువుకోరా నాయనా! చదువే మనకు బువ్వ పెడుతుంది. ఈ పొలంలో మిగిలేది లేదు" అని వాళ్ళు అక్షయ్‌ని పొలం పనుల్లో పెట్టకుండా, దూరంగా ఉన్న ప్రైవేటు బడిలో చేర్పించారు.

అక్షయ్ తెలివైన వాడే, కానీ వాడికి చదువంటే ఇష్టముండేది కాదు. అయినా బలవంతంగా బడికి పంపించేవారు తల్లిదండ్రులు. కొద్ది రోజులు ఇట్లా గడిచేసరికి, వాడు బడి ఎగగొట్టటం నేర్చుకున్నాడు. బడికి వెళ్లినట్టుగానే వెళ్లి ఊరంతా తిరిగొచ్చేవాడు.

ఇట్లా రెండు నెలలు అయ్యే సరికి, తల్లిదండ్రులకు పిలుపు వచ్చింది. ఉపాధ్యాయులు వాళ్లను కూర్చోబెట్టి, అటెండెన్సు రిజిస్టరు చూపించి, అక్షయ్ ఎన్ని రోజులు రాలేదో వివరించారు.

దాంతో పరిస్థితి స్పష్టమైంది: "అక్షయ్ బడికి వెళ్ళడం లేదు, అమ్మానాన్నలను మోసం చేస్తున్నాడు" అని అందరికీ తెలిసిపోయింది.

ఇక ఆరోజు నుండి అందరూ వాడిని 'నువ్వు బడి దొంగవి, మొద్దువి' అని ఎగతాళి చేయటం మొదలు పెట్టారు. ప్రతి ఒక్కరూ తనని అట్లాగే అంటూండే సరికి అక్షయ్ చిన్నబోయాడు.

సరిగ్గా ఆ సమయానికి చంద్రం మామయ్య వచ్చాడు వాళ్ళింటికి. చంద్రం పట్నంలో పరీక్షలకోసం చదువుతుంటాడు. అక్షయ్‌కి అతనంటే చాలా ఇష్టం. "వీడికి కొంచెం‌ బుద్ధి చెప్పురా!" అని తల్లిదండ్రులు చంద్రానికి పురమాయించారు. చంద్రం సరేనన్నాడు గాని, ఏమి చేస్తే వీడు బాగుపడతాడో అతనికీ అర్థం కాలేదు.

ఆ రోజున కూడా అక్షయ్ బడి ఎగగొట్టి, ఊరి చివరన చెట్టుకింద కూర్చొని ఉండగా, వాడికి చిట్టి పిట్ట ఒకటి కనబడింది. అది గూడు తయారు చేసుకుంటున్నది. ఎగురుకుంటూ పోయి, ఎక్కడినుండో‌ ఒక రకమైన పుల్లల్ని ముక్కున కరచుకొని తెస్తున్నది. వాటిని ఒక పద్ధతిగా అమర్చి, మళ్ళీ ఎగిరి పోతున్నది. ఒకసారి అది అట్లా ఎగిరి పోగానే అక్షయ్ ఆ గూడు దగ్గరకు వెళ్ళి చూసాడు. మెల్లగా ఆ గూడుని అక్కడినుండి తీసేసి, దూరంగా పడేసి, ఏమీ‌ ఎరగనట్లు వచ్చి కూర్చున్నాడు.

పిట్ట వచ్చి, తను తయారు చేసిన గూడు కోసం వెతుక్కున్నది. గూడు అక్కడ లేకపోయే సరికి కంగారుపడ్డది. అటూ ఇటూ‌ ఎగిరి, 'వీడు ఏమైనా తీసుకున్నాడా' అన్నట్టు చూసింది. అక్షయ్ కదలకుండా అట్లాగే కూర్చున్నాడు. అది ఏమనుకున్నదో, ఏమో- మళ్ళీ కొత్తగా గూడు కట్టటం మొదలు పెట్టింది. ఒక్కొక్క పుల్లా తీసుకొచ్చి కూర్చింది. అక్షయ్ కళ్ళముందరే కొత్త గూడు తయారైంది.

గమనిస్తూ కూర్చున్న అక్షయ్ మనసులో‌ ఆలోచనలు తిరిగాయి.. "అరే! అంత చిన్న పక్షికూడా, చూడు, ఎట్లా శ్రమ పడుతున్నదో! దానికి అసలు ఏ సదుపాయమూ లేదు. తల్లిదండ్రులూ లేరు, ఇల్లూ వాకిలి కూడా లేవు. అయినా అంత కష్టపడి, తన భవిష్యత్తు కోసం, తనే సొంతంగా గూడు కట్టుకుంటున్నది. మధ్యలో నాలాంటి వాళ్ళు దాన్ని తీసేస్తే కూడా, ఆ పనిని మానెయ్యటంలేదు. ఓపికగా మళ్ళీ తన పనిని తను కొనసాగిస్తున్నది.. మరి నేను? నేను ఏం చేస్తున్నాను?" అనిపించింది.

ఆ రోజున చంద్రం మామయ్య వాడితో చదువుల గురించి ఏమీ అనలేదు. కాసేపు పిచ్చాపాటీగా మాట్లాడి వెళ్ళిపోయాడు.

అయితే ఆ తర్వాత అక్షయ్ కొత్త పిల్లవాడై-పోయాడు. తనంత తాను బడికి వెళ్లటమే కాదు. తరగతిలో ఫస్టు వచ్చేట్లు శ్రమపడి చదివాడు.

వాడిలో వచ్చిన మార్పుని చూసి అంతా 'మామయ్య మహిమ' అనుకున్నారు. కానీ అక్షయ్‌కి మాత్రం నిజం తెలుసు- అదంతా 'పక్షి' మహిమే!