రాము చాలా తెలివైన పిల్లాడు. చుట్టూ జరిగే సంగతుల్ని బాగా గమనిస్తుంటాడు వాడు. అందుకనే సైన్సు సార్‌కి వాడంటే ఇష్టం.

ఒకసారి సైన్సు సార్ తరగతిలోకి రాగానే వాడు పెద్ద గొంతుతో చెప్పాడు ఉత్సాహంగా: "సార్! నిన్న నేను రాణిని చూసి వచ్చాను!" అని.

"ఓహో! ఏమైంది రాణికి?" అడిగాడు సార్.

"దయ్యం పట్టింది!"

"ఓహో! అవునా! దయ్యం బాగుందా?! అసలు ఆ పాపకు దయ్యం పట్టిందని నీకు ఎలా తెలిసింది?" అడిగాడు సార్ నవ్వుతూ.

"చూసేందుకు రాణి మామూలుగానే ఉంది- కొంచెం‌ నీరసంగా ఉన్నట్లుంది- గానీ. వాళ్ళ అమ్మావాళ్ళు తనని ఊరవతల ఉన్న స్వామి దగ్గరికి తీసుకెళ్ళారుట. ఆయన వాళ్లని ఒక నిమ్మకాయ తెచ్చుకొమ్మన్నాడు. మంత్రం చదివి, చాకుతో ఆ నిమ్మకాయని కోసేసరికి, అందులోంచి రక్తం చుక్కలు కారాయట!" చెప్పాడు రాము, ఉత్సాహంగా. "ఆ పాపకి దెయ్యం‌ పట్టిందని ఆ తర్వాతనే అర్థమైంది అందరికీ!"

"ఓహో!‌ అవునా!" అన్నాడు సర్, ఆలోచిస్తూ. "సరేలే, అయితే మరి మీరు కూడా అంతా రేపు తలా ఒక నిమ్మకాయా తెచ్చుకోండి!" అని చెప్పాడు.

"మీకు కూడా మంత్రాలు వచ్చా సర్?" "దయ్యం ఎవరికి పట్టింది సర్?" "వావ్! రేపు దయ్యాల్ని చూస్తాం!" ఇట్లా ఎవరికి తోచినట్లు వాళ్ళు ఉత్సాహంగా అరిచారు పిల్లలంతా.

మరునాడు అందరూ తలా ఒక నిమ్మకాయా తెచ్చారు. సార్ రాముని పిలిచి, వాడికి ఒక చాకునిచ్చాడు. "పలుకు! నా వెంట పలుకు- మంత్రాలు చదవాలి!” అన్నాడు సర్. "న్యూటనే, థాంసనే, రూథరే, బోరే, చంద్రశేఖరే, మేరీక్యూరే ఫట్" అని మంత్రాలు చదివారు ఇద్దరూ. "సరే, ఇప్పుడు కొయ్యి!" అన్నాడు సర్. రాము ఆ నిమ్మకాయను కొయ్యగానే రక్తపు చుక్కలు జలజల కారాయి!

వెంటనే సారు "అమ్మో" అని రెండడుగులు వెనక్కి వేసాడు. పిల్లలంతా ఊపిరి ఎగబీక్కున్నారు. "రామూ! నీలో కూడా దయ్యం ఉంది!" అంటూ అతన్ని పక్కగా నిలబెట్టాడు సార్.

ఆ తర్వాత ప్రక్కనే ఉన్న తెల్ల స్పాంజితో చాకుని శుభ్రం చేసి, ఇంకో పిల్లాడిని పిల్చి, మంత్రం చదివాడు- 'న్యూటనే, థాంసనే, రూథరే, బోరే, చంద్రశేఖరే, మేరీక్యూరే ఫట్' అని. "కొయ్యి ఇప్పుడు! నీ పరిస్థితి ఏంటో తెలుస్తుంది!" అంటూ. ఈ నిమ్మకాయలో నుంచి కూడా రక్తం వచ్చింది. ఈసారి పిల్లలందరూ బయటికి పరుగు పెట్టారు!

సార్ నవ్వుకుంటూ పిల్లల దగ్గరికి వెళ్ళి, "ఏం భయపడకండి! నేను ఉన్నాను. లోపలికి రండి. ఏం కాదు!" అని ధైర్యం చెప్పాడు.

పిల్లలు అందరూ నిదానంగా లోపలికి వచ్చాక, సార్ చెప్పాడు- "ఇదిగో, చూడండి. సున్నం తెల్లగా ఉంటుంది. దానికి ఎప్పుడైనా పులుపు కలిసిందనుకోండి, అది ఇట్లా ఎర్రగా మారుతుంది. నేను కత్తిని శుభ్రం చేసే పేరుతోటి ఏం చేసాను? ఈ తెల్ల స్పాంజితో రుద్దాను. ఇప్పుడు దీనికి ఏమి అంటింది? సున్నం. ఇక ఈ కత్తితో ఎవరి నిమ్మకాయని కోసినా, ఇదిగో- ఎరుపు రంగు వస్తుంది!”

"స్వామీజీలకు, బాబాలకు ఈ సంగతి తెలుసు. వాళ్ళు తమ దగ్గరున్న కత్తికి సున్నం పూసి, ఆ కత్తితో మనం తెచ్చిన నిమ్మ-కాయను కోస్తారు. ఎర్రగా వచ్చేది 'రక్తం' అని నమ్మిస్తారు. పాపం ఎటూ‌ తెలియని పసి పిల్లలని, చదువు లేని పెద్దవాళ్ళను, వీళ్ళు ఇట్లా మోసం చేస్తున్నారు. రాణి లాంటి పిల్లలకు డాక్టర్ల అవసరం ఉంది- స్వాములకంటే" అంటూ అసలు రహస్యం చెప్పేసారు.

పిల్లలంతా ఎంచక్కా నవ్వుకొని, ఎవరికి వాళ్ళు నిమ్మకాయల్ని మంచి చాకు తోటీ, సున్నం పూసిన చాకు తోటీ కోసి చూసుకున్నారు. మంచి పాఠమే నేర్చుకున్నామని మురిసారు.