చాలా వేల ఏళ్ల క్రితం, దేవుడు ఇంకా దయామయుడిగా ఉన్న రోజుల్లో, గొర్రెల కాపరి ఒకడు ఉండేవాడు. అతను చాలా కష్టజీవి. గొర్రెల్ని చిన్నగా ఉన్నప్పటినుండి సాకి, అవి ఒక వయసుకు చేరుకున్నాక అమ్మి, అలా జీవనం సాగించేవాడు.

గొర్రెల్ని పెంచటం అంటే మాటలు కాదు. వాటిని వెంటబెట్టుకొని కొండలు, గుట్టలు అన్నీ దాటుకొని, ఇల్లూ వాకిలీ వదిలి, గడ్డి ఎటు ఉంటే అటు పోవాల్సి ఉంటుంది.

గొర్రెల్లో చిన్నవీ, అప్పుడే పుట్టినవీ, బాగా నడవలేనివి కూడా ఉంటాయి. వాటిని ఒక్కోసారి ఎత్తుకొనీ, ఒక్కోసారి అదిలించీ, ఒక్కోసారి మరేవైనా మంచి పొట్టేళ్ల మీదికి ఎక్కించి, మిగిలిన వాటితో కలిపి త్రిప్పవలసి ఉంటుంది.

అతని దగ్గర రెండు కుంటి గొర్రెలు ఉండేవి. అవి రెండూ పుట్టటమే వెనక కాళ్లు చచ్చుగా పుట్టాయి. అయినా గొర్రెల కాపరి వాటిని చిన్న చూపు చూడలేదు; వదిలి పెట్టలేదు. అట్లాగే చేతులమీద ఎత్తుకొని సాకాడు- మిగిలిన గొర్రెలన్నీ ఎక్కడ మేస్తుంటే వీటిని అక్కడికి మోసుకెళ్లేవాడు. వీటిని అలా ప్రత్యేకంగా సాకటం చాలా కష్టమే, అయినప్పటీకీ అతను ఏమీ నొచ్చుకునే-వాడు కాదు.

దీన్నంతా గమనిస్తూన్న దేవుడు అతని కష్టాన్నైతే తగ్గించలేదు గానీ, ఇతరత్రా వీలైనన్ని లాభాలు, వసతులు కల్పిస్తూ వచ్చాడు.

అయితే గొర్రెలు మటుకు తమలో తాము బాధ పడుతుండేవి: "ఎందుకు, ఈ బ్రతుకు? ఇట్లా ఇంకొకరి మీద ఆధారపడి బ్రతకటం కూడా ఒక బ్రతుకేనా?" అని వాటి భాషలో ఏడ్చుకునేవి. "ఈ దేవుడికి దయలేదు. లేకపోతే మమ్మల్ని ఇలా ఎందుకు పుట్టిస్తాడు?" అని తిట్టేవి. అయినా దేవుడు వాటి తిట్లను పట్టించుకునేవాడు కాదు.

ఆ గొర్రెలు రెండూ పెద్దవి అవుతున్న కొద్దీ గొర్రెల కాపరి కష్టం కూడా ఎక్కువైంది. అతనిప్పుడు ఒక్కో కుంటి గొర్రెనీ ఒక్కోసారి ఎత్తుకొని పోవాల్సి వస్తున్నది. అవి కూడా బాగా బరువైనాయి గద! అయినా అతను ఏమీ బాధ పడలేదు. చిన్నప్పటినుండీ చూస్తున్నవే గనక, ఇప్పుడు కూడా తన పని తను చేస్తూ ఉండేవాడు. కుంటి గొర్రెల్లో ఒకటి తెల్లది; ఒకటి నల్లది. తెల్లది ఒకసారి ఆ గొర్రెల కాపరి కష్టాన్ని చూసి చలించిపోయింది:

"అయ్యో! దేవుడా! మాదే కష్టం అనుకుంటే పాపం, యితనికి ఎన్ని కష్టాలు పెట్టావయ్యా?! మా కంటే కాళ్లు లేవు, నడవలేము; కానీ పాపం మమ్మల్ని మోసే కష్టాలన్నీ ఇతనికి ఇచ్చావుగదా?" అని బాధపడింది.

అంతలో దేవుడు చటుక్కున దాని ముందు ప్రత్యక్షమై 'సరేలే! ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు!' అన్నాడు. "మాకు కాళ్లు ఇవ్వవయ్యా, స్వామీ! ఇతని కష్టాలూ, మా కష్టాలూ రెండూ తీరతాయి" అన్నది తెల్ల గొర్రె. దేవుడు కొంచెం ఆలోచించి, "సరే, నీకు కాళ్లు ఇస్తాను; కానీ దానికి మటుకు ఇవ్వను-" అన్నాడు నల్ల గొర్రెకేసి సాలోచనగా చూస్తూ.

తెల్ల గొర్రె దేవుడికి దండంపెట్టి, "అంత ఆలోచించకు స్వామీ! నాకు ఒక్కదానికీ కాళ్ళిస్తే ఏం ప్రయోజనం; ఆ గొర్రెల కాపరి సమస్య తీరదు! అతను ఆ రెండో గొర్రెను మోస్తూనే ఉండాలి కదా! దయ చూడు!" అన్నది. దాంతో దేవుడికి సరేననక తప్పలేదు. గొర్రెలు రెండిటికీ కాళ్లు ప్రసాదించి మాయమయ్యాడు.

తన గొర్రెలకు కాళ్ళు వచ్చినందుకు గొర్రెల కాపరికి చాలా సంతోషమైంది. కుంటి గొర్రెల్ని మోసే పని లేదు గనుక, ఇప్పుడు అతను చిట్టి గొర్రెల్ని బాగా సంరక్షించగల్గుతున్నాడు. అన్నిటినీ మించి, అతను ఇప్పుడు అలిసిపోవటంలేదు!

కానీ కొద్ది రోజులు గడిచేసరికే నల్ల గొర్రెకి అసంతృప్తి మొదలైంది: 'ఇంతకు ముందు కాపరి తమని ఎత్తుకొని తిప్పేవాడు. ప్రేమగా ముచ్చట్లు పెట్టేవాడు. మిగిలిన గొర్రెలకంటే ప్రత్యేకంగా చూసేవాడు. ఇప్పుడు అతను తమని పట్టించుకోవట్లేదు. తమ వైపుకు కూడా చూడట్లేదు. పైగా మొన్న ఒకసారి మిగిలిన గొర్రెల్ని కొట్టినట్లు నన్ను కూడా ముల్లుకర్రతో కొట్టాడు!.. "ఇట్లా బ్రతికే కంటే అసలు కాళ్లు లేకుండా బ్రతకటమే మేలు!" అనిపించింది దానికి.

"దేవుడా! ఎందుకు ఇట్లా చేసావు? కాళ్ళిచ్చి మోసం చేసావే, మమ్మల్ని?!" అని ఏడ్చింది.

ఇన్నాళ్ళుగా దాని మొర పట్టించుకోని దేవుడు, ఈసారి మటుకు దాని ఏడుపు విన్నాడు. వెంటనే దాని కాళ్లు రెండూ పడిపోయాయి.

అయితే కొద్ది కాలంగా సుఖానికి అలవాటు పడిన గొర్రెలకాపరికి, ఇప్పుడు దాన్ని మొయ్యటం బరువనిపించింది. వారం తిరిగేలోగా అతను దాన్ని కటికవాళ్ళకు అమ్మి, శ్రమ తగ్గించుకున్నాడు.

బేతాళం కధని అక్కడితో ఆపి,"చూసావుగా విక్రం, దేవుడు బలహీనులతో ఎలా ఆడుకుంటాడో?! పుట్టుకతోటే కాళ్లు లేవు కదా, ఆ బక్క ప్రాణుల మొరల్ని ఆయన అంత కాలం పాటు ఎందుకు, వినలేదు? తీరా విన్నాక, రెండు గొర్రెల నడుమా అంత భేదం ఎందుకు చూపాడు? ముందుగా తనని రమ్మని పిల్చిన తెల్లగొర్రె పట్ల ఆయనకు పక్షపాత దృష్టి ఉన్నదని అనిపించట్లేదా? దేవుడనేవాడు అందర్నీ సమానంగా చూడాలి కదా, ఈ రెండు గొర్రెలూ సమానత్వానికి ఎందుకు నోచుకోలేదు మరి?! అంతా చేసి, చివరికి ఆయన సాధించిందేమిటి, ఒక గొర్రెను కటిక వానికి పంపటం మినహా?" అన్నాడు.

"అనంతమైన ఈ సృష్టిలో ప్రతి ప్రాణీ తన స్వార్థంకోసం ఏవేవో కోరికలు కోరుకుంటూనే ఉంటుంది. డబ్బు, దస్కం, సంతోషం కావాలని మనుషులు కోరుకుంటున్నట్లే, గొర్రెలు కూడా ఆరోగ్యం కావాలని కోరుకోవటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. దేవుడు ప్రాణులన్నిటి వ్యక్తిగత కోరికల్నీ పట్టించుకోవాలనేమీ లేదు.

తెల్ల గొర్రెకు ఆయన వరం ఇచ్చిన రోజున, అది తన గురించి కాక, తనని మోసే యజమానికి కష్టాలు తప్పించమన్నది. ఆ ప్రవర్తన దాని ఉదాత్తతకు సూచిక కావచ్చు. దానితో‌ పోల్చితే రెండవ గొర్రె స్వార్థ జీవి. కానీ మరి దేవుడు ఏమనుకున్నాడో? బహుశ: గొర్రెల కాపరి కష్టాల్ని తొలగించాలని అనుకొని ఉండొచ్చు. రెండవ గొర్రె స్వార్థాన్ని ఇష్టపడి ఉండకపోవచ్చు. దానికి తగినట్లుగానే ముందు గొర్రెలకు రెండింటికీ కాళ్ళు ఇవ్వటం, తర్వాత రెండవ గొర్రెను కటిక వానికి పంపటం కూడా చేసి ఉంటాడు...

ఏది ఏమైనా కోరికలు కోరేప్పుడు మనకుగాని, ఇతరులకు గాని నష్టం చేసేవి కోరకపోవటం ఎప్పటికైనా మంచిదే. దేవుడు ఏ పనిని ఏమి ఆలోచించి చేస్తాడో, మానవులం, మనం ఏం చెప్పగలం? అవి చూస్తే మరి గొర్రెలు, పాపం వాటికి అసలు ఇంకేం తెలుస్తుంది?" అన్నాడు విక్రం, కొంచెం‌ అనుమానంగానే.

అట్లా అతనికి మౌనభంగం కలగగానే బేతాళం చటుక్కున పైకి ఎగిరి, మళ్లీ చెట్టెక్కింది.