ఒకసారి ఓ వేటగాడు అడవిలో తిరుగుతూ ఒక పొదను చూసాడు. ఆ పొద మాటున అతనికి ఒక పుర్రె కనబడింది.
వేటగాడు పుర్రెను చేతిలో పట్టుకొని తిప్పుతూ "ఆశ్చర్యంగా ఉందే! ఇక్కడ ఎముకలు ఏమీ లేవు; ఒట్టి పుర్రె మాత్రం ఉంది! ఇది ఎలా సాధ్యం?"అనుకొంటూ, ఊరికెనే "నిన్ను ఇక్కడికి ఎవరు తెచ్చారు, పుర్రే?!"అని అడిగాడు.
ఆశ్చర్యంగా, ఆ పుర్రె మాట్లాడింది: "నన్ను మాటలే తెచ్చాయి, ఇక్కడికి!" అన్నది. వేటగాడు భయంతో వణికి పోయాడు. పుర్రెను తటాలున ఆ పొదలోకే విసిరేసి, వగర్చుకుంటూ అడవికి అడ్డం పడి పరుగు పెట్టాడు.
అట్లా పోయిన వాడు నిండు సభలో కొలువు దీరి ఉన్న రాజుగారి దగ్గరికి చేరుకునే వరకూ ఆగలేదు. ఏవేవో రాజ్య వ్యవహారాలతో తలనొప్పిగా ఉన్న రాజు అతన్ని చూసి "సంగతేంటి?" అని అడిగాడు.
వేటగాడు ఆయన దగ్గరికి పోయి నిలబడి గుసగుసగా చెప్పాడు: "అయ్యా! నేను మా ఊరి ప్రక్కనున్న అడవిలో ఇందాకే ఒక పుర్రెను చూసాను. ఎండిపోయిన మనిషి పుర్రె అది. ఒక పొదలో ఇరుక్కుని ఉండింది. నేను దాన్ని చేతిలో పట్టుకోగానే అది మాట్లాడింది: తమరి గురించి అడిగింది! తమరి తల్లిదండ్రులెలా ఉన్నారని అడిగింది! దాంతో నాకు భయం వేసింది. దాన్ని అక్కడే పడేసి నేరుగా తమరి దగ్గరికి వచ్చేసాను. దయచేసి తమరు నాతో రండి. ఆ పుర్రె సంగతేదో తేల్చండి" అని.
రాజు గారికి చికాకు వేసింది. ఆయన అనుకున్నాడు "నాకు తెలివి వచ్చిన నాటినుండి ఎవ్వరూ ఇట్లాంటి చెత్త కబురు పట్టుకొని నా ముందుకు రాలేదు. పుర్రె మాట్లాడుతున్నదని ఇంత ఉషారుగా చెప్పిన వాడు ఒక్కడూ లేడు. వీడొక్కడికే అంత ధైర్యం, అంత తెగువ!" అని.
బయటికి మాత్రం ఆశ్చర్యం ప్రకటించి "అవునా?!" అన్నాడు. అని, వెంటనే ఇద్దరు సైనికులను పిలిచి వేటగాడిని చూపిస్తూ, "ఇదిగో, ఈ వేటగాడు 'పుర్రె మాట్లాడింది' అని చెబుతున్నాడు. ఇతని వెంట వెళ్ళండి. ఇతను చెప్పింది నిజమైతే తనను ఇంటికి పంపించి, ఆ పుర్రెనేదో ఇక్కడికి పట్టుకు రండి. లేకుంటే వీడిని చంపేసి అక్కడే పడేయండి" అన్నాడు.
సైనికులిద్దరినీ వెంట బెట్టుకొని వేటగాడు అడవిలో తనతో మాట్లాడిన పుర్రె దగ్గరికి వచ్చాడు. "మాట్లాడు, పుర్రే! నిన్ను ఇక్కడికి ఎవరు తెచ్చారు?" అన్నాడు. పుర్రె చప్పుడు చేయలేదు. వేటగాడు ఎన్ని రకాలుగా అడిగినా, ఎంత ప్రాధేయపడినా, ఇక అది నోరు విప్పనే లేదు!
సైనికులు ఇద్దరూ వేటగాడికేసి జాలిగా చూసారు. కొద్ది సేపు తటపటాయించినా, చివరికి వాళ్ళలోని రాజభక్తే గెలిచింది.
వేటగాడిని అక్కడికక్కడే చంపి పడేసారు.
కొన్ని ఏళ్ళ తరువాత వేరే ఒక వేటగాడు.. మళ్ళీ ఆ పొద దగ్గరికే వచ్చాడు... పుర్రెని చూసాడు... ఆశ్చర్యపోయాడు.. తను కూడా పుర్రెని అదే ప్రశ్న వేశాడు. "నిన్ను ఇక్కడికి ఎవరు తెచ్చారు పుర్రే?!" అని.
ఆశ్చర్యంగా, వేటగాడి పుర్రె నోరు విప్పింది: "నన్ను మాటలే ఇక్కడికి తెచ్చాయి" అన్నది…!