కటారుపల్లె శివార్లలో వేపచెట్టు ఒకటి ఉండేది. అందులో గూడు కట్టుకుని నివసించేవి, ఒక తల్లికాకి, దాని నాలుగు చిట్టి చిట్టి పిల్లలు!

అదే చెట్టు క్రింద, తొర్రలో ఉడత ఒకటి ఉండేది.

కాకీ, ఉడతా రెండూ "వదినా-వదినా" అనుకుంటూ చాలా సన్నిహితంగా ఉండేవి. తల్లి కాకి రోజూ ఊళ్ళోకి వెళ్ళి ఆహారం కోసం వెతికేది. దొరికిన ఆహారాన్ని ముందుగా పిల్లలకు తెచ్చి పెట్టేది. అంతా అయినాక మళ్ళీ వెళ్ళి, తను కడుపు నింపుకొని వచ్చేది.

ఉడత మటుకు అక్కడికి దగ్గర్లోనే తిరుగుతూ‌ ఉండేది రోజంతా. సాయంత్రం కాగానే ఓమాటు కాకినీ, పిల్లల్నీ పలకరించి, తన తొర్రలో‌ దూరేది.

అయితే ఒకసారి చీకటి పడుతున్నది, అయినా తల్లికాకి ఇల్లు చేరలేదు. అమ్మ రాలేదని పిల్లలు కంగారు పడసాగాయి. ఉడత కొంచెం సేపు ఉండి వాటిని ఊరడించింది. "వచ్చేస్తుందిలే, ఏమీ పర్లేదు" అని చెప్పింది. పిల్లలు కొంచెం సర్దుకోగానే "నేను మళ్ళీ వస్తాను" అని ఇంటికి పోయింది. అయితే, రోజంతా తిరిగి తిరిగి అలసిపోయిందేమో, తొర్రలోకి దూరగానే దానికి విపరీతమైన తూగు వచ్చింది. "కొంచెం అటో ఇటో- వదిన రాక ఎక్కడికి పోతుందిలే!" అని తను నడుం వాల్చింది.

అంతలో బాగా చీకటి పడింది. అయినా కాకి ఇంకా ఇల్లు చేరలేదు. పిల్లలు తల్లికోసం ఎదురు చూస్తూనే ఆడుకుంటున్నాయి. అయితే అంతలోనే అకస్మాత్తుగా ఎక్కడినుంచో పెద్ద కాకి ఒకటి ఎగిరి వచ్చింది. పిల్లల దగ్గర ఉన్న తిండి అంతా లాక్కొని తినేసింది. పిల్లలు భయంతో "కుయ్యో!మొర్రో!" అని కేకలు పెట్టాయి. ఉన్న అన్నం అంతా తినేసాక, పిల్లల్ని గూట్లోంచి కిందకు తోసేసింది పెద్ద కాకి. పిల్లలు చాలా సేపు "అమ్మా! అమ్మా!" అని ఏడ్చి, అక్కడే సొమ్మసిల్లి పడిపోయాయి.

గాఢ నిద్రలో ఉన్న ఉడతకు ఇదంతా తెలియదు.

ఆరోజు రాత్రి చీకటి పడ్డాక వచ్చింది తల్లి కాకి. 'చూస్తే పిల్లల జాడ లేదు! వేరే ఏదో‌ పెద్ద కాకి తన గూట్లో‌ పడుకొని ఉన్నది!' అది కంగారుగా దాన్ని నిద్రలేపింది. ప్రశ్నల మీద ప్రశ్నలు వేయసాగింది.

"ఏయ్! ఎవ్వతెవే నువ్వు?! ఆపు, నీ గోల! ఇంత రాత్రి వచ్చి నా నిద్ర చెడగొట్టింది చాలక, పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి విసిగిస్తావా? ఇది నా గూడు! నువ్వు ఎటుపోతావో పో! నీ‌ పిల్లల సంగతి నన్ను అడక్కు!" అని అరిచి, దాన్ని ఒక్క తోపు తోసింది పెద్ద కాకి.

దెబ్బకు కింద పడింది కాకి. చూస్తే తన పిల్లలు కూడా అక్కడే చెట్టు మొదట్లో దిక్కులేకుండా పడి ఉన్నాయి. దాని గుండె తరుక్కుపోయింది. అంతలో పిల్లలు లేచి "అమ్మా!అమ్మా!"అంటూ ఏడవసాగాయి. తల్లికాకి వాటిని సముదాయించసాగింది. ఆ గందరగోళానికి మెలకువ వచ్చింది ఉడతకు. జరిగిన విషయం తెలుసుకొని అది "అయ్యో! ఎంత పని జరిగింది! ఇప్పుడు ఎలాగ? ఇద్దరం వెళ్ళి దాని అంతు చూద్దామా?" అన్నది.

"వద్దులే వదినా! ఎవరి పాపాన వాళ్లే పోతారు!" అంది తల్లికాకి.

"రేపు ఉదయాన్నే ఏదో ఒకటి చేద్దాం. ఈ రోజుకు ఇక్కడే పడుకోండి వదినా!" అని అవి పడుకునేందుకు ఏర్పాట్లు చేసింది ఉడత.

సరేనని అన్నీ అక్కడే పడుకొని నిద్రపోయాయి.

వేపచెట్టుకు ఎదురుగా ఓ చింత చెట్టు ఉంది. ఆ చెట్టు మీద పాత గూడు ఒకటి, ఖాళీగానే ఉన్నది. తెల్లవారగానే ఆ గూటిలోకి చేరినై, కాకి, పిల్లలు. కాకి ఆహారం కోసం ఊళ్ళోకి వెళ్దామనుకున్నది. 'అవతలి చెట్టుపైన తుంటరి కాకి ఏం చేస్తున్నదా' అని చూసింది. అది ఇంకా పడుకునే ఉంది. "అది లేచి, ఆహారం కోసం బయటికి వెళ్ళాక, అప్పుడు వెళ్తా, నేను!" అనుకొని ఇంకా కాసేపు చూసింది తల్లి కాకి. అయితే పెద్ద కాకి ఎంతకీ లేవలేదు.

ఇంతలో తల్లికాకికి ఒక ఆలోచన వచ్చింది. ఆ రోజు నుండి తను ఇంకా కష్టపడటం మొదలు పెట్టింది. తెచ్చిన ఆహారాన్ని పిల్లలకు సరిపడా పెట్టి, ఆపైన మిగిలిన దాన్ని తీసుకెళ్ళి పెద్దకాకికి వేయడం ప్రారంభించింది.

"ఇదేదో బాగానే ఉందే!" అనుకున్న బద్ధకపు కాకి అసలు ఇంట్లోంచి కాలు బయటికి పెట్టటమే మానేసింది: పిల్లల జోలి వదిలేసింది. ఏమంటే తల్లి కాకికి శ్రమ ఎక్కువైంది.

ఒకరోజు సాయంత్రం ఉడత కాకితో 'ఏంటి వదినా, నీవు చేసే పని?! దానికి కూడా నువ్వు ఆహారం తెచ్చి పెట్టడం ఏంటి?!' అన్నది.

'ఏం చేస్తాం వదినా, తప్పదు! పిల్లలు పెద్ద అయ్యేంతవరకూ దుష్టుల్ని దూరంగా ఉంచాలంటే ఇది తప్ప వేరే మార్గం లేదు! అయినా ఏం పోయిందిలే, నాకు ఇంకో పిల్ల అనుకుంటా' అన్నది తల్లి కాకి.

అయితే ఇట్లా వారం రోజులు గడిచాయో లేదో- పెద్ద గాలివాన వచ్చింది. వేపచెట్టు క్రిందినుండి దభీల్మని శబ్దం వచ్చింది. "ఏమిటా?!" అని బయటికి తొంగి చూసింది ఉడత. కొత్త కాకి! గూటితో సహా క్రింద పడి ఉన్నది! మూలుగుతూ ఉంది! దెబ్బలు తగిలి రక్తం కారుతున్నది. ప్రాణాపాయ స్థితిలో ఉంది!

ఉడత పోయి, ఎదురుగుండా చింత చెట్టు మీద ఉన్న తల్లి కాకిని పిలిచింది. రెండూ కలిసి దానికి కట్లు కట్టి, సపర్యలు చేసాయి. తల్లి కాకి దానికి ఆహారం తెచ్చి పెట్టింది. రెండు రోజులకు మరి కొంత కోలుకుంది పెద్ద కాకి. అటుపైన మరో రెండు రోజులు కష్టపడి దానికి ఒక మాదిరి గూడు కూడా ఏర్పాటు చేసింది తల్లికాకి.

అదంతా చూసిన పెద్ద కాకి మనసు కరిగింది. కళ్ళనీళ్లు తిరిగాయి. 'ఛీ! అసలు నాకు బుద్ధి లేదు. ఇంత మంచి కాకికి నేను ఎంత ద్రోహం చేశాను! బ్రతికుండగా ఇంక ఎప్పుడూ ఎవరికీ హాని చేయకూడదు. చేతనైతే వాళ్లలానే ఇతరులకు సహాయం చేయాలి' అనుకుంది మనసులో.

తర్వాతి రోజున తను కూడా త్వరగా లేచి, ఆహారం కోసం వెళ్లింది. కొంత ఆహారాన్ని తెచ్చి కాకి పిల్లలకు పెట్టింది: "భయపడకండి, నేను మిమ్మల్ని ఏమీ చేయను. నేను మీ పెద్దన్ననే అనుకోండి!" అన్నది. పిల్లలు, తల్లికాకి అన్నీ చాలా సంతోషపడినాయి. సంగతి తెల్సిన ఉడత "నీ మంచితనం ఊరికే పోలేదులే వదినా! దానివల్ల మనకు మరో‌ మిత్రుడు దొరికాడు!" అంటూ ఆనందపడింది.