అనగనగా ఒక ఊళ్లో ఒక మామిడి తోట ఉండేది. నల్ల చీమలు కొన్ని, అందులో ఒక పుట్టను పెట్టాయి.
ఇలా ఉండగా ఒక రోజు ఎక్కడి నుంచో ఒక పాము వచ్చింది, తోటలోకి. వచ్చి, తోట అంతా కలయ తిరిగింది. అయితే అంతలోకే వర్షం మొదలైంది. 'ఎటు పోవాలి...? ఎటో ఒకవైపు!' అనుకొని, అది చకచకా చీమలు పెట్టుకున్న పుట్టలోకే దూరింది.
దాంతో చీమలన్నీ భయపడ్డాయి. గబగబా బయటకు వచ్చాయి; కకావికలై పరుగులు పెట్టాయి. కొన్ని చీమలు, గ్రుడ్లు పాము కిందపడి నలిగిపోయాయి.
వర్షం ఆగిన తర్వాత పాము బయటికి వచ్చింది. తన దారిన తాను ఎటో వెళ్ళి పోయింది-
కానీ తర్వాతి నుండీ ప్రతి రోజూ రాత్రంతా చీమల పుట్టలోనే నిద్ర పోసాగింది. మెల్ల మెల్లగా ఉదయం సమయాల్లోనూ ఉండటం మొదలెట్టింది. తర్వాత పుట్టను మొత్తాన్నీ ఆక్రమించుకుంటూ అక్కడే తన నివాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నించింది! చీమలకు చాలా బాధ వేసింది. వాటికి ఇది నిజంగానే ప్రాణ సంకటం అయ్యింది: ప్రతిరోజూ వందలాది చీమలు పాముకు బలి ఔతున్నాయి. చివరికి "ఎలాగైనా పాము పీడ వదిలించుకోవాలి!" అని నిశ్చయించు-కున్నాయి అవన్నీ.
తర్వాతి రోజు ఎప్పటిలాగే పాము చీమల పుట్టలోకి దూరగానే, బయట కాపలా కాస్తున్న చీమలన్నీ ఒకే సారి లోపలికి పోయినై. అన్నీ కలిసి ఒక్కసారిగా పామును చుట్టు ముట్టినై. దాన్ని కసితీరా కుట్టసాగినై.
నల్ల చీమలే అయినా, అన్నీ కలిసి కుట్టేసరికి పాము బిత్తరపోయింది. నిశ్చేష్టం అయిపోయింది. కదలలేక పోయింది. చివరికి అటూ ఇటూ పొర్లటం మొదలు పెట్టింది. అయినా వాటినుండి తప్పించుకోలేకపోయింది: ఆ ఇరుకులోనే తన్నుకులాడి, చివరికి ప్రాణాలు విడిచింది.
చీమలన్నీ సంతోషంతో పండగ చేసుకున్నాయి.
బలవంతుడ నాకేమని
పలువురితో నిగ్రహించి పల్కుట మేలా?
బలవంతమైన సర్పము
చలి చీమల చేత చిక్కి చావదె, సుమతీ?