కంకణాల పల్లిలో నివసించే చెన్నకేశవులు, వెంకట్రావు ఇద్దరూ మంచి స్నేహితులు. ఏ పనినైనా ఇద్దరూ కలిసి చేసేవాళ్ళు. ఏ విషయం అయినా కూడా వాళ్లిద్దరికీ తెలియాల్సిందే. ఆ విధంగానే వాళ్ళిద్దరూ పదో తరగతి కలసి పూర్తి చేశారు.

సరిగ్గా ఆ సమయానికే వెంకట్రావు వాళ్ళ నాన్న బాగా తాగి తాగి చనిపోయాడు.

ఇంటి పరిస్థితి అయోమయంగా ఉండటంతో కొన్ని రోజుల పాటు వెంకట్రావు కాలేజీలో చేరలేదు. అయితే వాడు పై చదువులు చదవాలనీ, గొప్పవాడు కావాలనీ‌ వాళ్ళ అమ్మ పట్టుదల.

అందుకని ఆమె తను కూడ బెట్టుకున్న కొద్ది పాటి డబ్బుతోటే వెంకట్రావుని చదివించాలని పూనుకున్నది.

కొద్ది కొద్దిగా డబ్బులు కడతానని కాలేజీ వారిని ఒప్పించి, చివరికి ఎలాగో‌ ఒకలా వెంకట్రావుని కాలేజీలో చేర్పించింది.

వెంకట్రావు కూడా తల్లి ఆశయానికి అనుగుణంగా శ్రద్ధగా చదువుతున్నాడు- సమయాన్ని అస్సలు వృధా చేసుకోవట్లేదు.

అయితే కొద్ది రోజులు గడిచేసరికి, కాలేజీ వారు తమకు రావలసిన ఫీజు కట్టమన్నారు. వెంకట్రావు వాళ్ల అమ్మ 'రెండు మూడు వారాలలో కడతా' నని చెప్పింది గానీ, ఎంతకీ ఫీజు కట్టలేకపోయింది.

చివరికి కాలేజీ వాళ్ళు వెంకట్రావుని ఇంటికి వెళ్ళమన్నారు. "సాయంత్రంలోగా ఫీజు కడితే కట్టు- లేకపోతే ఇక కాలేజీకి రానవసరంలేదు" అనేసారు.

వాడి ఆ కష్టాన్ని గమనించాడు చెన్నకేశవులు. అప్పటికి తాను పొదుపు చేసుకున్న డబ్బుల్ని తీసుకొచ్చి, స్నేహితులనుండి మరి కొంత డబ్బును పోగు చేసి, తన తండ్రికి కూడా తెలియకుండా కాలేజీ యాజమాన్యానికి చెల్లించాడు. దాంతో వెంకట్రావుమీద ఒత్తిడి తగ్గింది. కాలేజీ వారు వాడిని ప్రశాంతంగా వదిలారు.

ఆ వారం చివర్లో వెంకట్రావు వాళ్ళ అమ్మ డబ్బులు తీసుకువచ్చింది.

కాలేజీ వాళ్ళకు ఎంత కట్టాలో అంత కట్టింది. మిగిలిన డబ్బుల్ని చెన్నకేశవులుకు జమ చేసింది.

అట్లా వెంకట్రావు, చెన్నకేశవులు కలిసి చదివారు. బాగా కష్టపడ్డారు. మంచి మార్కులు తెచ్చుకున్నారు. చదువులు పూర్తి చేసుకొని తల్లి దండ్రుల కోర్కెలను తీర్చారు. తాము కోరుకున్న ఉద్యోగాలు సంపాదించుకోగలిగారు. మంచి స్నేహితులు అనిపించుకున్నారు.