మంచి దొంగల కథ
దట్టమైన అడవిలో గుహ ఒకటి ఉండేది. అది ఒక సొరంగ మార్గం. గుహలాంటి ఆ సొరంగంలో కొందరు యువకులు నివసిస్తూ ఉన్నారు. నిజానికి వాళ్లు చాలా మంచివాళ్ళు. ధనవంతుల దగ్గర డబ్బులు, నగలు దోచేసి, వాటిని పేదవారికి దానం చేసేవాళ్ళు. అయితే భటులు, సైనికులు వాళ్లని దోపిడీకోరులనీ, తీవ్రవాదులనీ ముద్రవేసి, ఏదో ఒక విధంగా పట్టుకొని శిక్షించాలని శ్రమిస్తూండేవాళ్ళు.
ఈ దొంగల గుంపు ఖర్చులకోసం తమకు అనుకూలంగా ఉండే ప్రజల మీద ఆధారపడేవాళ్ళు. ఇట్లా ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చే విరాళాలను, తాము ధనికులనుండి దోచుకునే డబ్బుల్నీ రెంటినీ వాళ్ళు వేరు వేరుగా ఉంచేవాళ్ళు- వేటి లెక్కలు వాటివే.
అయితే అడవిలో బలాదూరుగా తిరిగే యువకుడొకడు, ఒకసారి వాళ్ళ గుహలోకి వెళ్ళే మార్గం కనుక్కున్నాడు. వాడు చాలా తెలివైనవాడు కూడా. గుహ ద్వారానికి అవతలగా ఉన్న చెట్టు మీద మాటు వేసి, దొంగలు అందరూ ఎప్పుడు బయటికి వెళ్తారో చూసుకున్నాడు. ఆపైన కాపలా వాళ్లకు సందేహం రాకుండా మారువేషం వేసుకున్నాడు. దొంగలు బయటికి పోగానే, తను నేరుగా లోనికి వెళ్ళాడు; లోపల అంతా తిరిగి చూసాడు. దొంగలు గుహలో దాచిన నగల్ని, డబ్బుల్ని పూర్తిగా తీసుకెళ్ళకుండా, ఎప్పటికప్పుడు కొద్ది కొద్దిగా ఎత్తుకు పోవటం మొదలెట్టాడు. అట్లా చేస్తే దొంగలకు అనుమానం రాదనుకున్నాడు వాడు.
అయితే దొంగల నాయకుడిది సునిశితమైన బుద్ధి. తాము లెక్కపెట్టి, దాచిన తర్వాత ఆ డబ్బుల నిలవ తగ్గిపోతున్నదని అతనికి అనుమానం రానే వచ్చింది. లెక్క సరిచూసుకుంటే పెద్ద పెద్ద మొత్తాల్లోనే తేడా ఉన్నది. దాంతో అతను తన అనుచరులనందరినీ గుహముందే సమావేశపరచి "మన ఖర్చులకోసం ప్రజలు ఇచ్చిన డబ్బు సరిగానే ఉన్నది గానీ, మనం దోచుకొచ్చిన డబ్బూ, నగలూ మాత్రం రోజు రోజుకీ తగ్గిపోతున్నాయి. వాటిని 'మనకు తెలీకుండానే ఎవరో దొంగలిస్తున్నారు' అని నాకు అనుమానంగా ఉంది. వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి. రేపు, మర్నాడు రెండు రోజులూ ఇక్కడ మాటు వేసి ఉండండి. మూడో రోజునుండీ వారం పాటు మనం ఇక్కడ ఉండము కదా, ఎలాగూ?!" అన్నాడు.
ఈ మాటల్ని కూడా చాటుగా విన్నాడు యువకుడు.
ఆ తర్వాత రెండు రోజుల పాటు దొంగలు ఆ చుట్టు ప్రక్కల అంతా మాటు వేసి ఉన్నారు యువకుడికోసం. కానీ తెలివిగల యువకుడు ఆ రెండు రోజులు అటుకేసి తిరిగి కూడా చూడలేదు. చూసి చూసి వేసారిన దొంగలు నాయకుడి దగ్గరికి వెళ్ళి, "మన ప్రయత్నం ఫలించలేదు. ఇప్పుడు మనం వారం రోజుల పాటు బయటికి వెళ్ళామంటే మనం దోచుకున్న డబ్బులు, నగలు అన్నీ ఆ దొంగ పాలు అయిపోతాయి" అన్నారు.
దొంగల నాయకుడు చిన్నగా నవ్వి- "మనం ఎక్కడికీ వెళ్ళట్లేదు. అందరం ఈ రెండు రోజులూ గుహలోనే ఉంటాం" అన్నాడు. దొంగలకు అతని పథకం అర్థమైంది. వాళ్ళు అనుకున్నట్లు గానే తర్వాతి రోజున బలాదూరు యువకుడు వచ్చాడు. గుహముందు ఎవ్వరూ కనిపించకపోవటంతో ఏమరపాటుగా గుహలోకి ప్రవేశించాడు; వాడికోసమే ఎదురు చూస్తున్న దొంగలకు దొరికిపోయాడు.
దొంగల నాయకుడు వాడితో "ఒరే నీకు ఎంత ధైర్యం ఉంటే మా దగ్గరే నగలు డబ్బు దోచుకుంటావు?! అదంతా పేద ప్రజలకు చెందాల్సిన డబ్బు. దాన్నంతా మర్యాదగా తిరిగి ఇచ్చెయ్యి" అన్నాడు.
బలాదూరు యువకుడు డబ్బు నగలు తిరిగి ఇచ్చి "అయ్యా నన్ను క్షమించండి. నేను ఏదో దురుసు తనంతోటి ఈ డబ్బును దోచుకున్నానుగానీ, అటు తర్వాత చాలా పశ్చాత్తాప పడ్డాను. మీరు చేస్తున్న మంచి పనులు నాకు తెలుసు. నన్నూ మీలో ఒకడిగా ఉండనివ్వండి" అన్నాడు.
దొంగల నాయకుడు ఒక క్షణం ఆలోచించి, 'సరే'నన్నాడు.
రచన: శరణ్య, ఎనిమిదవ తరగతి, అరవింద స్కూల్
సొరంగం కథ
కోసల రాజ్యం, శృంగరాజ్యం రెండూ ఇరుగు పొరుగు రాజ్యాలు. కోసల రాజు శాంతవర్మ ఉత్తముడూ, సౌమ్యుడున్నూ. ప్రజాక్షేమం కోరి, జనరంజకంగా పరిపాలించేవాడు. ఇక శృంగ రాజ్యాధిపతి గుణసేనుడు కౄరుడు. అతని రాజ్యంలో హింస, కటుత్వం అధికంగా ఉండేవి. శాంతవర్మని ఏమీ చేతకాని చవటగానూ, దద్దమ్మగానూ భావించిన గుణసేనుడు, ఒకసారి కేవలం రాజ్యకాంక్షతో కోసల మీదికి దండెత్తాడు. దీనికి ప్రేరణనిచ్చింది రణధీరుడనే గూఢచారి:
రణధీరుడు ఒకసారి మారువేషంలో కోసల సమీపంలోని అడవిలో తిరుగుతూ, ఆసక్తికరమైన దృశ్యాన్నొకదాన్ని గమనించాడు. కోసల రాజు శాంతవర్మ, మరి కొందరు సైనికులు సాధారణ పౌరుల మాదిరి దుస్తులు ధరించి, ఒక గుహముందు నిలబడి ఉన్నారు. శాంతవర్మ పురమాయించగా ఆ సైనికులు గుహకు అడ్డుగా ఉన్న బండనొకదాన్ని తొలగించారు. ఆపైన అందరూ గుహలోకి వెళ్ళి బండను తిరిగి అడ్డుగా నిలిపారు. అటుపైన ఆ రోజంతా ఎవ్వరూ బయటికి రాలేదు!
వాకబు చేసిన రణధీరుడికి చాలా ముఖ్యమైన సైన్య రహస్యం ఒకటి తెలిసింది: గుహనుండి కోసల రాజ భవనానికి ఒక సొరంగ మార్గం ఉన్నది. శాంతవర్మ, అతని ముఖ్య అనుచరులు మాత్రమే ఆ మార్గాన్ని వాడతారు. ప్రజల కష్టసుఖాలను కనుగొనేందుకు నెలకొకసారి ఆ మార్గాన్ని ఉపయోగిస్తుంటాడు శాంతవర్మ.
దాన్ని ఉపయోగించుకుంటే శృంగరాజ్య సైన్యాలు సునాయాసంగా కోసల రాజ భవనానికి చేరుకోగలవని, కోసల రాజ్యం తమ పరం అయిపోతుందనీ ఊహించిన రణధీరుడు, ఆ రహస్యాన్ని తమ రాజుకు చేరవేసాడు. తక్షణం యుద్ధం ప్రకటించాడు గుణసేనుడు. మరుసటి రోజుకల్లా శృంగరాజ్య సైన్యాలు కోసల రాజ్యపుటంచుల్లో మోహరించాయి.
'జననష్టం కలిగించే యుద్ధం వద్దం'టూ సంధి ప్రతిపాదనలు పంపాడు శాంతవర్మ. ఐతే గుణవర్మ దానికి అంగీకరించలేదు. ఏది ఏమైనా యుద్ధం తప్పదని, కాపాడుకోవటం చేతకాకుంటే కోసలను అప్పగించి ప్రాణాలు కాపాడుకొమ్మనీ కబురంపాడు.
యుద్ధం తప్పదని గ్రహించిన శాంతివర్మ తమ సైనికులతోటీ, ప్రజా ప్రతినిధులతోటీ మాట్లాడి, వారిలో ఉత్తేజం నింపాడు.
"విజయమా! వీరమరణమా!!" అని అతనిచ్చిన సందేశం సైనికులందరిలోనూ ఆవేశాన్ని రగిలించింది. "ప్రతి కోసల పౌరుడూ ఒక వీర సైనికుడు" అంటూ శృంగ రాజ్య సైన్యాలను ఊరూరా ఎదుర్కొనే వ్యూహాన్ని రచించారు కోసల ప్రజలు.
దండయాత్రలో భాగంగా కోసలలోకి ప్రవేశించబోయిన శృంగరాజ్య సైన్యాలకు అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యాయి. చివరికి ఎలాగో ఒకలాగా గుహ ముఖద్వారాన్ని చేరుకున్న సైన్యం యావత్తూ రణధీరుడి ప్రోత్సాహంతో చకచకా గుహలోకి ప్రవేశించింది. "ఇట్లా దూరి అట్లా తేలతాం, కోసల రాజ భవనంలో!" అనుకుని, గుణసేనుడితో సహా అందరూ ఉత్సాహంగా లోనికి దూరి, గుహ తలుపులు మూసారో, లేదో- అన్నివైపులనుండీ బాణాల వర్షం కురిసింది. బయటికి వెళ్ళే దారి దొరకక, బాణవర్షాన్ని ఎదుర్కోలేక, శృంగ రాజ్య సైన్యం మొత్తం అంతరించిపోయింది!
అటుపైన శాంతి వర్మ పాలనలో రెండు రాజ్యాలూ ప్రగతి బాట పట్టాయి!!
వి. వంశీ కృష్ణ, ఎనిమిదవ తరగతి.