కుంతల రాజ్య సరిహద్దుల్లో ఒక గురుకులం ఉండేది. చాలామంది రాజకుమారులు, సామాన్యులు కూడా అక్కడ చదువుకునేందుకు పోటీ పడేవాళ్ళు. దాన్ని నడిపే ధర్మేంద్రుడు మంచివాడు, ఆప్యాయత గల వాడున్నూ. శిష్యులందరికీ శాస్త్ర విద్యలు నేర్పటంతో పాటు, వాళ్ళు ఎలా నడుచుకోవాలో, ఎవరితో ఎలా మెలగాలో కూడా సందర్భోచితంగా చెబుతుండేవాడు.
శిష్యులందరూ కూడా ఆయన బాటలో నడిచేవాళ్ళు: గురువుగారిని బాగా గమనించేవాళ్ళు. ఆయన ఏ పనిని ఎలా చేస్తాడో చూసి, తాము కూడా అన్నింటా అదే విధంగా ఉండేందుకు ప్రయత్నించేవాళ్ళు.
శిష్యులకు తన పట్ల ఉన్న గౌరవాన్ని, ప్రేమను చూసి ధర్మేంద్రుడు చాలా సంతోషపడేవాడు. తనే ఆదర్శంగా తమ ప్రవర్తనను మలచుకుంటున్న శిష్యుల పట్ల ఆయన చాలా బాధ్యతగా ఉండేవాడు. ఎప్పటికప్పుడు తనను తాను మెరుగు పరుచుకుంటూ, నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నించేవాడు.
అయితే ఎంత ప్రయత్నించినా, ఒక్క పచ్చడి అలవాటుని మాత్రం ఆయన మార్చుకోలేకపోయాడు: సంగతి ఏంటంటే, పిల్లవాడిగా ఉన్నప్పుడు ధర్మేంద్రుడు ఏనాడూ కడుపునిండా భోజనం చేసింది లేదు. చాలా సార్లు భోజనం లేక, పస్తులు ఉండాల్సి వచ్చేది. ఆ రోజుల్లో వాళ్లది అంత పేద కుటుంబం. అట్లాంటి పరిస్థితిలో ఆకలిని ఎదుర్కునేందుకు, వాళ్ళ అమ్మ ఒక ఉపాయం కనిపెట్టింది. తనకు దొరికిన కూరగాయ ముక్కల్నల్లా ఎప్పటికప్పుడు ఉప్పు, కారాలతో కలిపి, ఒక మట్టిపాత్రలో ఊరబెట్టేది. ఆకలైనప్పుడల్లా ఆ ఊరగాయని కొంచెం నోట్లో వేసుకొమ్మనేది ధర్మేంద్రుడిని.
ఆవిడ ప్రేమ కలవటం వల్లనో, ఏమో, మరి ఊరగాయ మటుకు చాలా కమ్మగా ఉండేది. అట్లా మొదలైన ఊరగాయ నాక్కునే అలవాటు, ఇన్నేళ్ళ తర్వాత కూడా ధర్మేంద్రుడిని వీడి పోలేదు. ఆ పచ్చడే లేకపోతే, ఆయనకి ప్రశాంతత ఉండేది కాదు.
అందుచేత, ఆయన ఊరగాయ జాడీని ఎప్పుడూ తనకు వీలైనంత దగ్గర్లో ఉంచుకునేవాడు. ధర్మేంద్రుడు ఎక్కడికి వెళ్ళినా, జాడీ కూడా ఆయనతోబాటు వెళ్ళేది. ఒక వైపున ఆయన పిల్లలకు పాఠాలు చెబుతుంటే కూడా, జాడీ ప్రక్క గదిలోనే ఉండేది.
శిష్యులకు పాఠం చెప్పి, వాళ్ళు దాన్ని వల్లె వేస్తున్న సమయంలో చటుక్కున పోయి, కొంచెం ఊరగాయ నోట్లో వేసుకునేవాడు ధర్మేంద్రుడు. పిల్లలంతా సాధన చేస్తున్నప్పుడు, తాను ఏదో ఒక వంక పెట్టుకుని ఇంట్లోకి వెళ్ళి, జాడీని తీసుకుని, కావలసినంత తిని, ఏమీ ఎరుగనట్టు తిరిగి వచ్చేసేవాడు.
అయితే అనుక్షణం గమనిస్తూ, ఆయన చేసే ప్రతి పనినీ పాఠంగా భావించే శిష్యులు కొందరు, ఆయన చేసే ఈ గొప్ప పనిని చూడనే చూసారు: 'గురువుగారి ఆ రహస్య జాడీ ఏంటి? అందులో ఉన్నది ఏంటి? అది ఎట్లా ఉంటుంది? దాన్ని రహస్యంగానే ఎందుకు తినాలి?'లాంటి ప్రశ్నలు అనేకం కలిగి, ఊపిరాడలేదు వాళ్ళకు.
'మీరు వల్లె వేస్తూండండి- నేను ఇప్పుడే ఓ ముఖ్యమైన పని ముగించుకొని వస్తాను" అని వెళ్ళిన గురువుగారు, జాడీలోంచి దేన్నో తీసి నోట్లో వేసుకుంటున్నారు.. అదే ముఖ్యమైన పని అన్నట్లు! ఎందుకు ఇలా?!' అని వాళ్ళకు ఒకటే ఆరాటం వేసింది.
సరిగ్గా అదే సమయంలో ధర్మేంద్రుడికి భార్యా సమేతంగా పొరుగూరికి వెళ్ళాల్సిన పని పడింది. ఆయన తన ఊరగాయ జాడీని కూడా భద్రంగా మూటగట్టుకొని, పోతూ పోతూ గురుకులాన్ని, ఇంటిని శిష్యులకు అప్పగించి వెళ్ళారు.
"ఇదే కదా, తగిన సమయం!" అనుకున్న శిష్యులు, వాళ్ళు అటు వెళ్ళగానే ఇటు వంటగదిలోకి దూరారు. వెతకగా వెతకగా వాళ్ళకు అక్కడో మూల మూటగట్టి ఉన్న జాడీ ఒకటి కనిపించింది.
వాళ్లంతా దాని చుట్టూ మూగారు. ఎవరికి వాళ్ళు ఆత్రంగా ఆ జాడీలో చెయ్యిపెట్టారు; అందులో ఉన్నదాన్ని తలా ఒక గుప్పెడూ తీసుకున్నారు; అటుపైన వేరే వాళ్లకు కనిపించకుండా దూరంగా పోయారు. ఎవరికి వాళ్ళు తమ గుప్పెళ్ళలో ఉన్నదాన్ని నోట్లో పోసుకున్నారు! అంతే- త్వరలోనే గురుకులమంతటా హాహా కారాలు మొదలయ్యాయి. అందరికీ కళ్ళు మంటలు, ముఖం మంట, తుమ్ములు, ముక్కు కారటం, దగ్గు, పడిశం!!ఎందుకంటే వాళ్లు తిన్నది ఊరగాయ కాదు- కొరివి కారం!!
ఎప్పుడూ పంచభక్ష్య పరమాన్నాలే తింటూ, 'కారం' అనేది ఒకటి ఉంటుందని కూడా తెలియకుండా పెరిగిన రాకుమారులందరూ, తాము బుక్కిన ఆ కారం ధాటికి తట్టుకోలేక పోయారు. నోరు, కళ్ళూ మండడమే కాదు- అందరికీ కడుపులో విపరీతమైన మంట పుట్టింది!
పని నెరవేర్చుకొని మధ్యాహ్నం కల్లా తిరిగి వచ్చిన ధర్మేంద్రుడు, అతని భార్య బాధతో మెలికలు తిరిగిపోతున్న తన శిష్యుల్ని చూసి కంగారు పడిపోయారు. "నాయనా ఏమయింది? ఎందుకిట్లా అయినారు అందరూ?" అని అడిగితే అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు; ఎవ్వరూ ఏమీ చెప్పరు!.
చివరికి వాళ్ల చేతికి అంటి ఉన్న కారాన్ని, మూత తెరిచి వున్న కారం జాడీనీ చూసి సంగతి కనుక్కున్నారు వాళ్ళు. సమయస్ఫూర్తి గల గురుపత్ని వెంటనే అందరిచేతా చన్నీళ్ళతో స్నానం చేయించింది; కడివెడు మజ్జిగ తెచ్చి పిల్లలందరి తోటీ త్రాగించింది. దాంతో మెల్లగా వాళ్ళ ప్రాణం కుదుట పడింది.
ఆ రోజు సాయంత్రం పిల్లలందర్నీ కూర్చోబెట్టి "నాయనలారా! అసలు ఏం జరిగింది? అసలు ఆ కారం జాడీని మీరెందుకు తీశారు? మీ అందరి చేతులకూ అట్లా కారం ఎందుకంటింది? అందరికీ ఒకేసారి కారం తినాలని ఎందుకనిపించింది? అసలు మీకేమైనా కావాలంటే నన్ను అడగవచ్చు కదా?!" అన్న గురువుగారితో పిల్లవాడొకడు ధైర్యం చేసి చెప్పేసాడు: "గురువుగారూ! క్షమించండి. చాలాసార్లు మీరు ఏదో దాచుకుని చాటుగా తినడం చూశాం మేమందరం. అది ఏంటో తెలుసుకోవాలని, కొంచెంగానన్నా రుచి చూడాలనీ ఎక్కడా లేని ఆశ పుట్టింది మాకు. అందుకే అందరం కలిసి వెళ్ళి ఆ జడీ మూత తీశాం.
ఇంకెప్పుడూ మీ అనుమతి లేకుండా ఏదీ చేయ్యం. ఈసారికి మమ్మల్ని క్షమించండి!" అని.
తప్పు తనలోనే ఉన్నదని అర్థమైంది ధర్మేంద్రుడికి: "తల్లిదండ్రుల్ని, గురువుల్నీ చూసి నేర్చుకుంటారు పిల్లలు. వాళ్లని మంచి దారిలో నడిపించాలంటే ముందుగా పెద్దలు మంచి దారిలో నడవాలి. ఎవరు ఎంత ప్రయత్నించినా, చెడు మాత్రం దాగదు!" ఇక ఆ నాటి నుండి ఆయన మరెప్పుడూ దొంగ చాటుగా ఏమీ తినలేదు. తనలోని చెడును సంపూర్ణంగా జయించాడు.