అనగనగా ఒక అడవి అంచున 'అశ్వరాజపురం' అనే ఊరు ఒకటి ఉండేది. ఒకసారి ఆ అడవిలో తిరిగే గుర్రం పిల్ల ఒకటి, తన తల్లి నుండి విడిపోయి, ఒక్కతే నడుచుకుంటూ ఆ ఊళ్లోకి వచ్చింది. గ్రామస్తులకు ఆ గుర్రపు పిల్ల చాలా నచ్చింది.
వాళ్ళందరూ దాన్ని దయతో సాకారు. వంతులవారీగా ఆహారం పెట్టి, పెంచారు. దాన్ని ఎవ్వరూ ఏమీ అనేవాళ్ళు కాదు. అది ఆ ఊరంతా తిరుగుతూ, అందరినీ శ్రద్ధగా గమనిస్తూ ఉండేది.
ఒకసారి బందిపోటు దొంగలు కొందరు ఆ ఊరిని దోచుకునేందుకు పథకం వేసారు. భిక్షగాళ్ల వేషాలు వేసుకొని, పగలంతా ఊళ్ళో తిరిగారు.
అట్ల తిరుగుతూ ఊరి తీరు తెన్నుల్నీ, వీధుల్నీ, దారుల్నీ, ఊరి సంపదనీ అంచనా వేసుకున్నారు.
ఎన్నడూ లేనిది ఇంత మంది బిచ్చగాళ్ళు వచ్చి హడావిడిగా తిరగటాన్ని చూసి ఊళ్ళో ఒక ముసలాయనకు అనుమానం వచ్చింది. వాళ్లు వెళ్లిపోయాక, ఆయన ఊళ్ళోవాళ్లందరినీ పిలిచి, "నాకెందుకో అనుమానంగా ఉంది.. ఊళ్లోకి ఒక్కసారిగా ఇంతమంది బిచ్చగాళ్ళు రావటం చూస్తే, ఇదంతా బందిపోట్ల పనేమో అనిపిస్తోంది. ఏది ఏమైనా మనం అందరం ఈ రెండు మూడు రోజులూ బాగా మెలకువగా ఉండాలి" అని చెప్పాడు.
ఊళ్ళో జనాలు భయపడ్డారు: "వాళ్లని మనం ఏం ఎదిరించగలం? వాళ్ల దగ్గర ఏవేవో ఆయుధాలు ఉంటాయాయె" అని, ఎవరికి వాళ్ళు ఊరి విడిచి పెట్టి పోయేందుకు ఏర్పాట్లు చేసుకోసాగారు.
ఇదంతా చూసిన ఆ గుర్రం కలవర పడింది. ఇన్నాళ్ళూ తనను ప్రేమగా సాకిన ఆ ఊరివాళ్లని ఎలాగైనా కాపాడాలనుకున్నది. రాత్రి కాగానే ఊరి పొలిమేరల్లో అంతటా టకటకా తిరగటం మొదలు పెట్టింది.
ఆ రోజు రాత్రి దోచుకునేందుకు వచ్చిన బందిపోటు దొంగలు దూరం నుండే గుర్రపు డెక్కల చప్పుడు విన్నారు- "రాజసైనికులు పహరా కాస్తున్నారల్లే ఉంది. దొరికితే మన పని అంతే!" అని భయపడి, అటు నుండి అటే వెళ్లిపోయారు. అట్లా కొన్నాళ్ల పాటు ప్రతి రోజూ వాళ్ళు రావటం, గుర్రపు డెక్కల చప్పుడు విని వెనక్కి పోవటం జరిగింది. చివరికి విసుగొచ్చి, వాళ్ళు వేరే వైపుకు బయలుదేరి పోయారు! అట్లా గుర్రం తనను సాకిన ఊరి రుణం తీర్చుకున్నది!