అనగనగా ఒక ఊళ్లో రాము, సోము, రాజు అనే ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వాళ్ళలో అన్నలు రాము, సోము ఒక జట్టుగా ఉండేవాళ్ళు. ఒంటరిగా, తనే 'రాజు' అన్నట్లు సంతోషంగా ఉండే తమ్ముడు రాజు అంటే వాళ్ళిద్దరికీ అస్సలు ఇష్టం ఉండేది కాదు.

ఒక రోజు వాళ్ల నాన్న పొలం పనికి వెళ్ళాడు- చూడగా ముందు రోజు రాత్రి ఎవరో దొంగలు పైరు కోసినట్లు అనిపించింది.

ఆయన ఇంటికి వెళ్ళి కొడుకులు ముగ్గురినీ పిలిచి, "ఒరే! పిల్లలూ! పగలంతా పొలంలో ఉండీ ఉండీ అలిసి పోయి వస్తాను. మళ్ళీ రాత్రిపూట కూడా కాపలా కాయాలంటే నా వల్ల కాదు. ఇకనుండీ మీరు రాత్రిళ్లలో కాపలాకు వంతులు వేసుకోండి. మన పైరును కోస్తున్న దొంగ ఎవరో కనిపెట్టండి" అన్నాడు.

"నీకెందుకు నాన్నా! నేనున్నాను కదా" అన్నాడు పెద్ద కొడుకు రాము. ఆ రోజు రాత్రి చీకటి పడుతూండగానే అతను పొలానికి వెళ్ళాడు గానీ, అక్కడ వీచే చల్లటి గాలికి ఒక్క గంట సేపు కూడా మేలుకొని ఉండలేకపోయాడు. అతను అట్లా ఒకవైపున హాయిగా నిద్రపోతుంటే ఎవరో దొంగలు వచ్చి పొలంలో మరో చెక్కను కోసేసుకున్నారు.

పొద్దునే అతను నిద్రలేచి ఇంటికి వెళ్ళి "నేను రాత్రి ఒక్క కునుకు కూడా తీయలేదు- కానీ ఏం మాయో ఏమో, ఎవరో కొరికినట్లు పొలం ఒక మూలంతా నలిగి ఉంది" అన్నాడు. వాళ్ల నాన్న వాడిని తిట్టి తిట్టి అలసిపోయి ఊరుకున్నాడు.

రెండో రాత్రి కాగానే రెండో వాడు సోము- తను కూడా అన్న లాగే "నీకెందుకు నాన్నా! నేనున్నాను కదా!" అంటూ కడుపునిండా అన్నం తిని పొలానికి చేరుకున్నాడు. పొలంలో ఒక మూలన మంచె కట్టుకొని కూర్చున్నాడు. నిద్ర రాకుండా కళ్ళకు పెట్టుకునేందుకు కొన్ని క్లిప్పులు కూడా వెంట తీసుకెళ్ళాడతను. కానీ వాటిని వేటినీ వాడకనే మరి, ఎప్పుడు పడుకున్నాడో, పడుకుని నిద్రపోయాడు! ఆ రోజున పొలం ఇంకొంచెం నలిగింది.

మూడో రాత్రి వచ్చింది. "నీవల్ల ఏమౌతుందిలే రాజూ! నాన్ననే పోనివ్వు" అన్నారు అన్నలిద్దరూనూ. అయినా రాజు వాళ్ల నాన్నతో చెప్పి పొలానికి బయలు దేరి పోయాడు. ఒక కజ్జికాయ, కొన్ని మురుకులు జేబులో పెట్టుకొని పోయి, నిద్రవచ్చినప్పుడల్లా ఒక్కో ముక్క కొరుకుతూ కూర్చున్నాడు. అంతలోనే ఎవరో పైరు దగ్గరకు వస్తున్న శబ్దం వినిపించింది.

"ఎవరా?!" అని బయటికి వెళితే ఎవరో మరుగుజ్జు మనిషి ఒకడు వంగుని పైరు కోస్తున్నాడు!

అప్పుడు రాజు పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని కాళ్ళు పట్టేసుకున్నాడు. "నన్ను వదిలెయ్! నన్ను వదిలెయ్! ఇంక నేను నీ పైరు కొయ్యను- నన్నొదిలి పెట్టు!" అని మొత్తుకున్నాడు మరుగుజ్జు వాడు.

"సరేలే పాపం! పొట్టివాడు" అని వదిలి పెట్టాడు రాజు.

అప్పుడు ఆ మరుగుజ్జువాడు సంతోషపడి, రాజుకి పది బంగారు నాణాలు ఇచ్చి, "నిన్ను అడక్కుండానే మీ పొలంలోంచి పైరు కోసినందుకుగాను ఇవిగో, ఇవి మీకు!" అన్నాడు. "అంతేకాదు- నేను అడగగానే నన్ను వదిలేసావు కదా, అందుకని మనిద్దరం‌ ఇప్పుడు స్నేహితులం ఐపోయాం! నీకు ఎప్పుడైనా నా సాయం కావాలంటే ఇదిగో, ఈ ఉంగరాన్ని రుద్ది, 'చీంచాంచాంచీంబుష్' అంటే చాలు- నేను నీ ముందు ప్రత్యక్షమౌతాను!" అని చెప్పి బుడుంగున మాయమైపోయాడు. "మన ఊరి జమీందారుకు మన పైరు చాలా నచ్చిందట. వాళ్ల మనిషి ఎవరో వచ్చి పైరు కోసుకుంటున్నాడు. నన్ను చూసి, ఇదిగో ఈ ఐదు బంగారు నాణాలు ఇచ్చి పోయాడు" అని ఆ డబ్బుల్ని వాళ్ల నాన్న చేతిలో పెట్టాడు రాజు. నాన్న రాజుని మెచ్చుకున్నాడు గానీ, అన్నలిద్దరికీ వాడంటే ఇంకా చాలా కోపం వచ్చింది.

అంతలో వాళ్ల ఊరి జమీందారు టముకు వేపించాడు: అదేమిటంటే, "నా కూతురు ఒక ఒంటి స్తంభం భవనంలో కూర్చొని, అద్దంలో నించి బయటికి చూస్తూ ఉంటుంది. తన వేలికి ఒక వజ్రాల ఉంగరం ఉంటుంది. గుర్రంమీదెక్కి వచ్చి ఎగ్గిరి దూకి ఆ ఉంగరాన్ని ఎవరైతే అందుకుంటారో వాళ్ళకి నా కూతురినిచ్చి పెళ్ళి చేస్తాను" అని.

జమీందారు కూతురంటే అందరికీ‌ ఇష్టమే కదా, అందుకని ఊళ్లలో పెళ్ళికాని కుర్రవాళ్ళు అందరూ బయలుదేరి పోయారు. రాము, సీను కూడా గుర్రాలెక్కి బయలుదేరారు, పోటీలో‌ పాల్గొనేందుకు.

"అన్నలూ! నాకు కూడా ఒక గుర్రాన్నివ్వరూ?!" అని అడిగాడు రాజు. కానీ వాళ్ళిద్దరూ వెటకారంగా నవ్వారు.

"నీకెందుకురా?! జమీందారు కూతురుతో నీకేం పని?! నీ మురికి బట్టలు చూస్తే అక్కడికి ఎవ్వరూ రానివ్వరు అసలు. నువ్వు పొలంలో దొంగల్ని పట్టుకుంటూండు, మేం పోయి జమీందారు కూతురుని పెళ్ళి చేసుకొస్తాం" అని ఇకిలిస్తూ, వాడికి గుర్రాన్ని ఇవ్వకుండానే వెళ్ళి పోయారు.

కాసేపు ఆగాక రాజుకి ఒక ఐడియా వచ్చింది. "నాన్నా! నేను పుట్టగొడుగులు ఏరుకొస్తాను" అని చెప్పి, పొలంలోకి వెళ్ళి 'చీంచాంచాంచీంబుష్' అన్నాడు.

అంతే! మరుగుజ్జు మనిషి ప్రత్యక్షమయ్యాడు. "నమస్తే రాజూ! ఏం కావాలి నీకు?" అన్నాడు.

"నాకు ఒక జత రాజుల్లాంటి మంచి బట్టలు, ఒక మంచి పంచకల్యాణి గుర్రం కావాలి- ఇవ్వగలవా?" అన్నాడు రాజు.

"ఓఁ తప్పకుండా ఇస్తా.. దానిదేముంది?" అని మరుగుజ్జువాడు చేతులు తిప్పగానే అవి ప్రత్యక్షం అయ్యాయి.

రాజు మరుగుజ్జుకు ధన్యవాడాలు చెప్పుకొని, ఆ బట్టలు వేసుకొని గుర్రం మీద జమీందారు దగ్గరికి బయలుదేరి పోయాడు. అక్కడ చేరినవాళ్లంతా ధగధగా మెరిసిపోతున్న రాజుని చూసి 'ఎవరో రాజకుమారుడులా ఉన్నాడు- ఈ గుర్రం పంచకల్యాణి కావచ్చు- బలే ఉంది' అనుకున్నారు. వాడిని రాము, సీను కూడా గుర్తు పట్టలేదు!

కొంచెం సేపటికి పోటీ‌ మొదలైంది. జమీందారు కూతురు ఒంటి స్తంభం మేడ మీద కూర్చుని, అద్దంలోంచి బయటికి చూస్తున్నది. ఆమె చేతులు మటుకు కిటికీలోంచి బయటికి పెట్టింది. దూరంనుండి పరుగెత్తుకొని వచ్చి, గుర్రాన్ని ఎగిరించి, ఆమె వేలికి ఉన్న ఉంగరాన్ని అందుకోవాలి!

అది వినగానే అక్కడ చేరిన యువకులందరూ చప్పగా అయిపోయారు. వాళ్లంతా గుర్రాల్ని దూకించారు గానీ, ఎవ్వరూ అంత ఎత్తుకు ఎగరనే లేక పోయారు. చివరికి, మన రాజు లేచి, పంచకల్యాణి వీపు నిమిరి, వేగంగా పరుగు పెట్టించాడు. మెరుపు వేగపు ఆ గుర్రం తటాలున కిటికీ అంత ఎత్తుకు ఎగిరింది! దాని మీద హుందాగా కూర్చున్న రాజు జమీందారు కూతురు చేతికున్న ఉంగరాన్ని సున్నితంగా అందుకొని, ఈక దిగినట్లు అలవోకగా నేలమీదికి దిగాడు! చూస్తూన్నవాళ్లంతా ఆశ్చర్యంతో చప్పట్లు చరిచారు.

అట్లా జమీందారు కూతుర్ని పెళ్ళి చేసుకున్న రాజు కొంతకాలానికి తనే జమీందారు అయ్యాడు. మంచి పేరు తెచ్చుకున్నాడు.