అనగనగా ఒక పండితుడు ఉండేవాడు. అర్థం అదీ పట్టించుకోకుండా ఊరికే భట్టీ పట్టడమే అతని పని. అతను ఒకసారి

అమరకోశంలోంచి ఒక శ్లోక పాదాన్ని భట్టీ పట్టాడు:

" వనప్రియః పరభృతః కోకిలః పిక ఇత్యపి " అని.

"వనప్రియ, పరభృతము, కోకిల, పికము- ఇవన్నీ కోకిలకు పర్యాయపదాలు" అని దీనికి అర్థం.

అయితే దీనికి చివరన ’ఇత్యపి’ అని ఉన్నది చూసారా, 'ఇత్యపి' అంటే "ఇటువంటివి" అని అర్థం. కానీ ఆ పండితుడికి ఈ సంగతి తెలీదు. ’ఇత్యపి’ అనేది కూడా కోకిలకు పర్యాయపదమే అనుకున్నాడు.

అట్లాగే మరో చోట, ’అప్యేకదంతః హేరంబః..’ అని చదివాడతను-

"ఇంకా ఏకదంతుడూ, హేరంబుడూ..” అని దీని అర్థం. ఏకదంతుడూ, హేరంబుడూ,.. ఇవన్నీ వినాయకుడి పేర్లన్నమాట. కానీ అర్థం చేసుకోవటం రాని ఆ భట్టీ పండితుడు ’అప్యేకదంతుడు అనేదే వినాయకుడి పేరు' అనుకున్నాడు. ఆ తర్వాత ఒకసారి ఆ పండితుడు తన భట్టీ పాండిత్యంతో రాజసభకు వెళ్ళాడు.

అక్కడ ఎవరో కవులు వసంత కాలాన్ని గురించి చెబుతున్నారు. మధ్యలో కల్పించుకుని మనవాడు ఇలా అన్నాడు: ’ఇత్యపులు

గూయంగ
కోనంగుడేయంగ
అప్యేకదంతుడు
ఆడదొడగె’ అని.

అది వినగానే అక్కడ చేరిన కవులందరూ నిశ్శబ్దం అయిపోయారు. పట్టు వస్త్రాలు అవీ ధరించి హుందాగా కనబడుతున్న పండితుడిని చూసి- "మీరెవరో మహా పండితుల్లా ఉన్నారు. కొంచెం అర్థం వివరించండి" అన్నారు.

మనవాడు చెప్పాడు:

"ఇత్యపులు - అంటే కోకిలలు
కూయంగ - కూతలు పెట్టగా
కోనగుడు - మన్మథుడు
ఏయంగా - బాణాలు వేయగా
అప్యేకదంతుడు - వినాయకుడు
ఆడదొడగె - ఆడసాగినాడు" అని.

అంతలో పండితుల్లో‌ ఒకడు అసలు రహస్యం కనుక్కొని బయటికి చెప్పేసాడు. అర్థమైన మిగతా వాళ్ళందరూ గొల్లున నవ్వారు. రాజుగారు పండితుణ్ణి మందలించి ఇంటికి పంపేశారు. పాపం, తన పాండిత్యంతో ఏ ఉద్యోగమో, ఏ కొన్ని డబ్బులో‌ వస్తాయనుకున్న పండితుడు తలవంచుకొని ఇంటిదారి పట్టాడు!