అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది చాలా పొగరుబోతుది, బద్ధకపుది కూడాను. ఒకరోజున అది తీరికగా కూర్చొని ఆలోచిస్తూంటే గొప్ప ఆలోచన ఒకటి వచ్చింది దానికి. వెంటనే అది అడవిలోని జంతువులన్నిటితోటీ సమావేశం ఏర్పాటు చేసింది.

గుంపు కూడిన జంతువులతో చెప్పింది: "ఒకవైపున నేను మీ అందరికీ రాజుగా ఉంటూ, మరోవైపున మిమ్మల్నే తినటం అదోలా అనిపిస్తున్నది. అందుకని నేను ఇందాకే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇకమీద నేను ఎన్నడూ మాంసం ముట్టను.

అంతేకాదు- ఇవాల్టి నుండి మన అడవిలో వేటను పూర్తిగా నిషేధిస్తున్నాను. మీరంతా సుఖంగా, ప్రశాంతంగా బ్రతకొచ్చు" అంటూ సభను ముగించింది.

వెర్రి జంతువులన్నీ చప్పట్లు కొట్టి పండగ చేసుకున్నాయి. "ఇవాల్టినుండి అడవిలో స్వాతంత్ర్యం" అని చెప్పుకున్నాయి.

అక్కడినుండి గుహకు చేరగానే సింహం తన మంత్రి నక్క వైపుకు తిరిగింది- "పో- ఏవైనా మాయమాటలు చెప్పి, ఇక్కడికి దగ్గర్లో కనబడ్డ జంతువు దేన్నైనా ఆహారంగా తీసుకురా!" అన్నది.

"కానీ, ప్రభూ!‌ మీరు, శాకాహారం.." అని గొణిగిన నక్క, దాని కేసి చూస్తూనే మాట మార్చి, "సరే ప్రభూ!‌ తమరు ఎట్లా అంటే అట్లా చేద్దాం. ఏదైనా జంతువును పిల్చుకొచ్చి, ఆనక మిమ్మల్ని కలుస్తాను" అంటూ బయటికి పోయింది.

ఆ రోజున దానికి గుహ దగ్గర్లోనే జింక ఒకటి కనబడింది. దానికి మాయమాటలు చెప్పి, గుహ ముందుకు తీసుకొచ్చి 'రాజా' అని పిలిచింది నక్క. సింహం గబుక్కున బయటికి దూకి, ఒక్క దెబ్బకు దాన్ని చంపేసి, గుహలోకి ఈడ్చుకుపోయింది. అది తినగా మిగిలిన మాంసం ముక్కల్ని నక్క సంతోషంగా మెక్కింది.

ఇట్లా ఎవ్వరికీ అనుమానం‌ రాకుండా రోజుకో జంతువును చంపి తినటం మొదలు పెట్టాయి, సింహం-నక్క.

అయితే, చచ్చిపోయిన ఆ జింకకు రెండు స్నేహితులు ఉండేవి- ఎలుగు బంటి, ఏనుగు. మాయమైన జింక కోసం అవి రెండూ వెతకటం మొదలు పెట్టాయి. చివరికి సింహం ఉండే గుహకు దగ్గర్లో వాటికి జింక ఎముకల కుప్ప కనిపించింది. దాంతో వాటికి సింహం మీద, ఎప్పుడూ‌ సింహం తోకలాగా తిరిగే నక్క మీద అనుమానం వచ్చింది.

ఆ రోజు సాయంత్రం సమయంలో అవి రెండూ సింహం గుహకి దగ్గర్లో మాటు వేసాయి. అంతలోకే నక్క సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఒక జంతువును వెంట తీసుకురావడం, గుహ బయట నిలబడి 'రాజా' అని పిలవటం, క్షణాల్లో సింహం బయటికి దూకి ఆ జంతువును చంపి, గుహలోకి ఈడ్చుకెళ్ళటం మొత్తం చూసాయి.

"వామ్మో! ఇవి ఎంత మోసపువి?! బయటికేమో మాంసం మానేసామని చెప్పుకుంటూ, లోపల్లోపల ఎట్లాంటి పని చేస్తున్నాయో చూడు-" అనుకొని అవి రెండూ అడవిలోకి జారుకున్నాయి.

మరుసటి రోజు సాయంత్రం అవి గుహ వైపుకు పోతుంటే, దూరంగా నక్క ఉషారుగా ఈల వేసుకుంటూ రావటం కనిపించింది. దాన్ని చూడగానే ఏనుగు కనుసైగ చేసి, తను ఓ చెట్టు ప్రక్కకు పోయి గడ్డి మేస్తున్నట్లు నటించటం మొదలు పెట్టింది. ఎలుగుబంటి తను ఒక్కతే వచ్చినట్లు, రోడ్డు వెంబడి ముందుకు సాగింది.

నక్క ఎలుగు బంటిని చూస్తూనే "ఏం మామా?! ఇటు వచ్చావు? సింహం రాజుని కలిసే పని ఏదైనా ఉందా?" అని పలకరించ బోయింది. అయితే దాన్ని చూడగానే కోపం నసాళానికంటిన ఎలుగుబంటి దానిమీదికి దూకి, కసిగా చంపేసింది.

ఆ తర్వాత ఏనుగు, ఎలుగుబంటి రెండూ కలిసి దాన్ని ఓ మూలకు ఈడ్చుకు పోయినై; తాము ముందుగానే తయారు చేసి తెచ్చుకున్న విషపు ఆకుల రసాన్ని దాని నోట్లో పిండినై; ఆ ముద్దను దాని గొంతులోకి కూరినై; చివరికి దాని శరీరాన్ని సింహం గుహ ద్వారం దగ్గరికి తీసుకెళ్ళి పడేసినై.

ఆలోగా గుహ లోపల సింహానికి చాలా ఆకలి వేసింది. ఎంతకీ తిరిగిరాని నక్కమీద చాలా కోపం కూడా వచ్చింది. చివరికి అది కోపంతో‌ మండిపోతూ గుహలోంచి బయటికి వచ్చింది. ముఖద్వారం లోనే దానికి నక్క శరీరం కనిపించింది. మామూలుగా సింహం చనిపోయిన జంతువుల్ని తినదు; కానీ బాగా ఆకలితో ఉండటం వల్లనో ఏమో, అది చక చకా నక్కను గుహలోకి ఈడ్చుకు పోయి ఆబగా తినేసింది. ఇంకేముంది? విషపు ఆకుల ప్రభావంతో కొద్ది సేపటికి అది కూడా తన్నుకులాడి చనిపోయింది.

సంగతి తెలుసుకున్న జంతువులన్నీ సంతోష పడ్డాయి, "ఊరికే ఎవ్వరి మాటల్నీ గుడ్డిగా‌ నమ్మకూడదు" అని తెలుసుకున్నాయి.