నేనొక చిన్న పచ్చని చెట్టుని. మా ఊరి బళ్లో పిల్లలు పోయిన సంవత్సరం చెట్ల పండక్కి నన్ను, నాతో పాటు ఇంకో నాలుగు చెట్లనీ

నాటారు. అప్పుడప్పుడు నీళ్లు పోస్తుంటారు.


పోయిన సోమవారం అనుకుంటాను, నాకు రొమ్ములో కొంచెం కిత కిత మొదలైంది.

కొంచెం కొంచెం పెరిగి ఇవ్వాళ బాగా నొప్పి పుడుతుంది. ఏం చెయ్యాలో!

"ఏదో పిట్ట చప్పుడవుతోంది...అమ్మో! ఇది పొడిచే పిట్ట..! నా దగ్గరికి రాకపోతే బాగుండు!"

"అరే..నా మీదనే వాలింది. పొడుస్తుందేమో! ఏం పాడో...!అసలే నొప్పిగా ఉంది!"


"పాడు పిట్ట- పొడుస్తున్నది.. అబ్బా! అబ్బబ్బా...! సరిగ్గా నొప్పి పుడుతున్న చోటనే పొడుస్తున్నదే, ఇది?!"

"దీని సిగ తరగ...! పొడిచి చంపేస్తున్నది"

"అమ్మయ్య! ఇప్పటికైనా ఆపేసింది!-"


"అయ్యో! వామ్మో! బాబోయ్! కాపాడండి! ఈ‌ పిట్ట ఇప్పుడు ఏం చేస్తున్నదో చూడండి! నా లోపలికి ముక్కు పెట్టి తిప్పుతున్నది!"

"అబ్బా..నొప్పి..!"

"నా కొమ్మలే చేతులైతేనా.., దీన్ని నలిపేద్దును! ఒట్టి పనికి మాలిన పిట్ట. నా మీదే ఎందుకు వాలాలి?"

"అయ్యో! ఈ పిట్ట ఏదో లాగుతున్నది..వామ్మో!..ఎంత పెద్ద పురుగో!..నా రొమ్ము లోనించే లాగింది?!...పురుగుని ఎట్లా తినేసిందో చూడు!

"ఉం... బాగుంది! ఇప్పుడు నా నొప్పి కూడా తగ్గుతున్నట్లుంది... చాలా హాయిగా ఉంది ఇప్పుడు"

"ఇంతకీ నాకు ఆ పురుగు వల్లనే అనమాట, నొప్పి పుట్టింది! దాన్ని బయటికి తీసేసి ఈ పిట్ట నాకు చాలా సాయం చేసింది! నిజంగా ఇది ఎంత మంచిదో‌ కదా..! అనవసరంగా తిట్టినట్లున్నాను, దాన్ని?!"