అది ఏమిటో, ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు..

అందరం భయంతో, ఆశ్చర్యంతో దానికేసే చూస్తున్నాం నిశ్శబ్దంగా.

పిల్లలం అందరం పిక్నిక్ కోసం నాగసముద్రం చెరువుకు వెళ్ళాం. చెరువు నిజంగా సముద్రం లాగానే అనంతంగా ఉంది. నీళ్ళు ఎక్కడ అంతమవుతున్నాయో కనిపించటమే లేదు. దానికి తోడు బాగా దట్టంగా మబ్బులు క్రమ్మినై. నల్లటి మేఘాలు ఆకాశాన్ని మూసేసేటప్పటికి వాతావరణం అంతా చల్లగా, తేమగా ఒక రకంగా అయ్యింది. పిల్లల చాలా మంది స్నానాలు చేసేశారు. మేం కొందరం పెద్ద పిల్లలం మటుకు ఇంకా నీళ్ళలోనే నిలబడి, దూకి, ఈత కొట్టి ఆటలాడుతున్నాం. ఆ సమయంలో జరిగిందది. ఓ పెద్ద- సొరచేపనా..? -తిమింగలం అంటే అదేనేమో మరి- మొత్తానికి మేమెవ్వరం ఏనాడూ చూడనంత పెద్ద చేప!- వచ్చి పిల్లల ఎదురుగా నిలబడి పెద్ద కొండ గుహ లాంటి తన నోరును తెరిచింది. సాయంత్రపు వెలుగులో దాని కోర పళ్ళు తళతళా మెరిసాయి.

పిల్లలు అట్లా చూస్తూ చూస్తుండగానే. హఠాత్తుగా ఆ చేప చాలా చాలా పెద్దగా పెరిగిపోయింది! దాని నోరు మరింత పెద్దదైంది. పిల్లలు ఎక్కడి వాళ్ళు అక్కడే శిలా విగ్రహాలలాగా నిలబడి పోయారు. చిన్నపిల్లలందరూ భయంతో గట్టిగా ఏడవటం మొదలుపెట్టారు. ఆ చేపకు ఉన్న కళ్ళు ఎర్రగా మెరవటం మొదలుపెట్టాయి. దాని నోట్లోంచే కావచ్చు, ఒక విపరీతమైన దుర్వాసన మొదలైంది.

అందరికంటే ముందు తేరుకున్న నేను గట్టిగా అరిచాను. "అందరూ వెనక్కి తిరిగి పరుగు పెట్టండి. గబగబా! ఎవ్వరూ‌ నీటికి దగ్గర్లో‌ ఉండకండి! గట్టెక్కండి, త్వరగా పరుగెత్తాలి. రన్!" అని.

పిల్లలందరూ ఒక్కసారిగా వెనుతిరిగి పరుగు పెట్టాం. చేప వేగంగా మమ్మల్ని వెంబడిస్తూ నీటి అంచు వరకూ వచ్చింది. అయితే ఆ సరికే పిల్లలందరమూ బురద-ఇసకలో దానికి అందనంత దూరం పరుగుపెట్టాం. ఆ మధ్యలో నాకు ఒక్క క్షణం పాటు అనుమానం వచ్చింది- "అది నీళ్ళలోంచి బయటికి రాదు కదా" అని. అయితే అదృష్టవశాత్తు అది నీళ్ళ అంచునే ఆగిపోయి, భయంకరంగా బుసకొట్టి, గట్టిగా గాలిని, నీళ్లను చిమ్మింది మాపైకి. ఆ గలీజు వాసనకి పిల్లలందరం కొంతసేపు ముక్కులు మూసుకోవాల్సి వచ్చింది.

అయితే మేం ఎవ్వరం అందలేదని దానికి చాలా కోపం వచ్చినట్లుంది. అది మెరుపులాగా చెరువులో అంతటా తిరుగుతూ కనిపించిన చేపనల్లా తినేసింది. దాని తాకిడికి అప్పటివరకూ తేటగా ఉన్న చెరువునీళ్లన్నీ బురద బురదగా తయారయ్యాయి. అంతలో చెరువుకు అటువైపు నుంచి మేం ఉన్న వైపుకు మరపడవ ఒకటి రాసాగింది. దానినిండా జంతువులు, ప్రయాణీకులు కనిపిస్తున్నారు. కొందరు పిల్లలు కూడా ఉన్నారు ఆ పడవలో. మేం చాలా కంగారు పడి, గట్టు పైనుండి చేతులు ఊపుతూ అరిచాం- "వెనక్కి వెళ్ళిపోండి!‌ ఇటు రాకండి! సొరచేప!" అని. అయితే మా మాటలు వాళ్ళకు వినబడ్డట్లు లేదు- సొరచేప అటు వైపుకు తిరిగి గబగబా ఆ పడవ మీదికి ఉరికింది. మరుక్షణాన అది పడవ క్రిందికి చేరుకొని దాన్ని తిరగ త్రిప్పి పడేసింది! పడవలో ఉన్న ప్రయాణీకులందరూ మునిగిపోతున్నారు- కొందరు సహాయం కోసం గట్టిగా అరుస్తున్నారు.

గట్టున నిలబడి చూస్తున్న కొద్దీ నాకు చాలా ఆవేశం వచ్చింది. కానీ ఏమి చేయాలో తెలీలేదు- ప్రయాణీకులను కాపాడాలి. అయితే సొరచేపని ఆపకుండా ఎవ్వరూ నీళ్లలో అడుగు పెట్టలేరు..ముందు దాన్ని ఏదైనా చెయ్యాలి.. ఏం చెయ్యాలి? సొరచేపకేసి చూస్తుంటే నాకొక ఆలోచన వచ్చింది. దాని తలమీద మెరుస్తూ వజ్రం లాంటిది ఒకటి ఉన్నది. అది కదుల్తున్న తీరును చూస్తే "దీని ప్రాణం ఈ వజ్రంలోనే ఉంది" అనిపించింది నాకు. "నేను ఈ చేప సంగతి చూస్తాను. మీలో ఈత వచ్చిన పెద్ద పిల్లలు చెరువులోకి దూకి తలా ఒక్క ప్రయాణీకుడినీ కాపాడి గట్టు చేర్చగలరేమో చూడండి" అని అరిచి నీళ్ళలోకి దూకేశాను. వేగంగా ఈదుకుంటూ పడవ దగ్గరికి పోబోయాను- నాకు తెలుసు- చేప మధ్యలోనే నన్ను అడ్డుకుంటుందని.

హటాత్తుగా నా క్రిందినుండి పైకి లేచింది చేప! నన్ను ఒక్కసారిగా ఎత్తి ఆకాశంలోకి విసిరేసినట్లయింది. నా కళ్ళు గిరగిరా తిరిగాయి. అయితే నేను తిరిగి దాని వీపు మీదనే దబ్బున పడ్డాను. అది నీళ్ళలోనే గిరగిరా తిరుగుతున్నది. అల్లకల్లోలం చేస్తున్నది. నేను క్రింద పడకుండా దాని మొప్పలనొకదాన్ని పట్టుకొని ఊగులాడాను కొంత సేపు. ఆ తర్వాత ఊపిరి బిగబట్టి అక్కడినుండి ఎగిరి నేరుగా దాని తలమీద వాలి, అక్కడున్న వజ్రాన్ని పట్టుకున్నాను. చేప నన్ను వదిలించుకునేందుకు గింగిరాలు కొట్టింది. అయితే నేను ధైర్యంగా నా తల పిన్నుతో వజ్రాన్ని అన్ని వైపులనుండి పొడిచి పొడిచి పెకిలించాను.

అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలు ఆ వజ్రం మీద పడి తిరిగి నా మీదికి ప్రతిఫలించాయి. నిజంగానే చేపకది ప్రాణం అనుకుంటాను. నేను ఇటు వజ్రాన్ని పెకిలించానో లేదో, అటు అది కాస్తా నీళ్ళపైన కదలక మెదలక పడి చచ్చిపోయింది! పిల్లలు కాపాడిన ప్రయాణీకులంతా ఆ సరికి ఒడ్డుకు చేరుకొని చప్పట్లు కొడుతూ నన్ను అభినందిస్తున్నారు. నేను నా కనుబొమలకు అంటిన చెమటను తుడుచుకుంటూ వాళ్ళవైపు చూసి నవ్వాను.

అంతలో నాకు అనురాధ అక్క గొంతు వినిపించింది. "గెటప్ మా! గెటప్ మా! పి.టి.టైం!!" అని! నేను సంతోషంగా నవ్వుకుంటూ లేచి నా స్నేహితులందరికీ కలలో నేను ఎన్నెన్ని సాహసాలు చేశానో‌ గొప్పగా వివరించి చెప్పాను. "నువ్వు గొప్ప సాహస వనితవే, సందేహం లేదు" అని అందరూ‌ మెచ్చుకుంటే నాకు బలే గర్వంగా అనిపించింది!