ఒకసారి ఓ వెంగళప్ప పని కోసం వెతుక్కుంటూ ఇల్లిల్లూ తిరగసాగాడు "అయ్యా! నాకు ఏమైనా పని ఉంటే ఇవ్వండయ్యా. ఇంతకు ముందు ఒక ఇంట్లో పనోడిగా చేశాను" అంటూ.

ఆ వీధిలో ఒక ఇంటి యజమానికి పనివాడి అవసరం ఉంది. అతను వెంగళప్పను ఎగాదిగా చూసి అడిగాడు- "ఇంతకు ముందు వాళ్ళు నిన్ను ఎందుకు పనిలోనుండి తీసేశారు?" అని.

"అయ్యా, అదే నాకు అర్థం కాలేదయ్యా" చెప్పాడు వెంగళప్ప- "మా యజమాని ఒకసారి 'కాళ్లు నొప్పి, కాళ్లునొప్పి' అన్నాడయ్యా. నేను ఆయన కాళ్లు పిసికాను. బాగుందన్నాడు.


మళ్ళీ ఒకసారి 'భుజం నొప్పి, భుజం నొప్పి' అన్నాడయ్యా. నేను వెళ్ళి భుజాలు నొక్కాను. 'చాలా బాగుందిరా' అని మెచ్చుకున్నాడు. ఇంకోసారి 'నడుము నొప్పి, నడుమునొప్పి!' అని మొత్తుకున్నాడయ్యా. సరేనని నేను నడుము పిసికాను. 'బలే ఉంద'ని మెచ్చుకున్నాడయ్యా.

తరువాత కొన్ని రోజులకు 'మెడ నొప్పి మెడనొప్పి' అన్నాడయ్యా. 'దానిదేముంది' అని నేను పోయి మెడ పిసికానయ్యా. అప్పటినుండి ఆయన కదలకుండా అలాగే ఉన్నారు.



ఆ ఇంట్లో వాళ్లందరూ నేనే ఆయనను చంపానని నన్ను పనిలోనుండి తీసేశారయ్యా.

ఇంటి యజమాని ఆశ్చర్యపోయి నోరు తెరిచాడు కొంతసేపు. అయినా అతనికి పనివాడి అవసరం ఉంది మరి- "నా దగ్గర మాత్రం అలాంటి పిచ్చి పనులు చేయకు, నువ్వు పనిలోకి రావచ్చు" అనేశాడు చివరికి.

"చాలా ధన్యవాదాలయ్యా" చెప్పాడు వెంగళప్ప. పనిలోకి చేరి "ముందుగా ఇప్పుడు ఏం చేయమంటారయ్యా?" అని అడిగాడు.


"వీడు నా కొడుకు- మూడేళ్లు రాలేదింకా. అమ్మగారు పనిలో ఉన్నట్లున్నారు, ముందు వీడిని కొంచెంసేపు బయటికి తీసుకెళ్లి ఆడించు" అని అన్నాడు.

"అలాగేనయ్యా" అని పిల్లవాడిని తీసుకెళ్లాడు వెంగళప్ప.

యజమాని ఇక ఆ సంగతే మర్చిపోయాడు. కొంతసేపటికి వెంగళప్ప ఒక్కడే వెనక్కి తిరిగి వచ్చాడు.

"ఒరేయ్! మాబాబు ఏడి?!" అని అరిచాడు ఇంటి యజమాని.


"అయ్యా! నేను మీవాడిని బయటికి తీసుకెళ్ళానా, ముందు వాడు బయట ఇసుకలో ఆడుకుంటానన్నాడు. నేను వాడిని ఇసకలో వదిలేశాను. కొద్దిసేపటికి తిరిగి వచ్చి, "ఇప్పుడు పార్కులో ఆడుకుంటా" అన్నాడు. "సరేలే" అని వాడిని తీసుకెళ్ళి పార్కులో వదిలేశాను.

మళ్ళీ వచ్చి "ఈసారి రోడ్డుమీద ఆడుకుంటా" అన్నాడు. "పోనీలే, దానిదేముంది" అని రోడ్డు మీద వదిలేశాను.

తర్వాత కొద్దిసేపటికి తిరిగొచ్చి "ఈ బావిలో ఆడుకుంటా" అన్నాడు. "ఆడుకో" అని ఈసారి బావిలోకి వదిలేశాను- కానీ ఎంతసేపు చూసినా వాడు పైకి రాలేదయ్యా. దాంతో 'ఇంక పనిచేటు ఎందుకు' అని నేను ఒక్కడినే ఇక్కడకు వచ్చేశానయ్యా!" చల్లగా చెప్పాడు వెంగళప్ప.

ఇంటి యజమాని గుండెకు ఏమైందో మరి మీరే ఊహించుకోండి!