అనగనగా ఒక ఊళ్ళో పశువుల వ్యాపారి ఒకడు ఉండేవాడు. అతని భార్య వెంగమ్మ నిజంగానే ఒట్టి వెర్రి వెంగళమ్మ. ఒక రోజున వ్యాపారి ప్రక్క ఊరి సంతకు ప్రయాణం అయ్యాడు. వెళ్తూ వెళ్తూ అతను భార్యతో చెప్పి వెళ్ళాడు- "నేను రెండు రోజుల వరకూ తిరిగి రాను వెంగమ్మా! అయితే రేపు మన దగ్గరున్న మూడు ఆవుల్నీ కొనేందుకు బేరగాళ్ళు వస్తారు. ఒక్కో ఆవూ వంద నాణాల లెక్కన, మూడు ఆవులనూ మూడు వందల నాణాలకి అమ్ము. సరేనా?! వాళ్ళు అంతకంటే తక్కువకి బేరం అడిగితే మటుకు ఏమాత్రం ఒప్పుకోకు. అర్థం అయిందా, నేను చెప్పేది?!” అని.
“మీరేం కంగారు పడకండి, ప్రశాంతంగా వెళ్ళి రండి. అదంతా నేను చూసుకుంటాగా!" అంది వెంగమ్మ.
“ఏంటోనే, నువ్వు ఎప్పుడూ అలాగే చెప్తావు; కానీ ఏదో రకంగా పిచ్చి పనులు చేసి మోసపోతావు! ఈ విషయంలో ఏమీ తప్పులు జరగకుండా ఉండాలనే ఇంత చెప్తున్నాను- మూడు వందలు ఇస్తేనే ఆవుల్ని ఇవ్వు. అర్థమైందా, ఏమి?! నేను చెప్పేది వింటున్నావా?!” అన్నాడు.
“ఆఁ విన్నా, విన్నా!" అన్నదామె, తల ఊపుతూ.
వ్యాపారి ప్రయాణమై వెళ్ళిపోయాడు.
తర్వాతి రోజున అనుకున్నట్లుగానే బేరగాడు వచ్చాడు. ఆవులను చూసి, ఆమెతో బేరం మొదలు పెట్టాడు. మాట్లాడటం మొదలు పెట్టిన కొద్దిసేపటికే వెంగమ్మ ఎంత అమాయకురాలో గ్రహించేశాడు ఆ బేరగాడు. బేరం ఇంకా పూర్తి కూడా కాకనే, వాడు పశువుల పాక దగ్గరికి వెళ్ళి "సరే అక్కా! ఇంక ఆవులను నేను కొనుక్కున్నాను!" అంటూ ఆవులకు కట్టిన పలుపుతాళ్ళు విప్పి వాటిని బయటకి తోలటం మొదలు పెట్టాడు గడుసుగా.
వెంగళమ్మ అమాయకురాలే అయినా, మరీ ఇంత గడుసుదనాన్ని గమనించకుండా ఉండలేకపోయింది. పోయి కొట్టం గడప దగ్గర నిలబడి "ఒక్క నాణెం తక్కువైనా ఆవులను ఇవ్వను- ముందు మొత్తం మూడు వందల నాణాలు ఇచ్చి, ఆ తర్వాతనే ఆవులను బయటకి తోలండి!" అంది మొండిగా.
"ఇబ్బంది వచ్చి పడిందే-" అనుకున్నాడు బేరగాడు. అయినా మరో బాణం వేసి చూద్దామని, "అయ్యో అక్కా! నా దగ్గరుండగా నీ డబ్బు ఎక్కడికి పోతుంది? అయినా ఇవాళ్ళ డబ్బుల మూటను తీసుకురావడం మర్చిపోయానే, ఏం చేయను? -సరే, ఒక పని చేద్దాం! ఈ మూడు ఆవుల్లోనూ ఒక దాన్ని నీ దగ్గరే హామీగా వదిలి వెళతాను. ఇంటికి వెళ్ళి, మూడు వందల నాణాలు తెచ్చి ఇచ్చాక గానీ ఈ ఆవును విడిపించుకు పోను!" అన్నాడు, ఆ మూడు ఆవుల్లోనే ఒకదాన్ని గాటానికి తిరిగి కట్టేస్తూ. వెంగమ్మ ముఖం వెలిగింది. “ఆఁ అదీ మరి! ఏమీ హామీ లేకపోతే ఎలా?! అలా చెయ్యి. ఆ మూడో ఆవుని ఇక్కడే ఉంచి వెళ్ళు. డబ్బు నా చేతిలో పడ్డాకే, ఈ ఆవుని వదిలేది!" అంది గట్టిగా.
బేరగాడి పంట పండింది. ఉత్సాహంతో మురిసిపోయి, అతి మర్యాద నటిస్తూ, తాను ఆసరికే కట్టేసిన ఆవును అక్కడే వదిలి, మిగిలిన రెండు ఆవులనీ తోలుకుని చక్కా పోయాడు వాడు.
మూడో రోజున భర్త రాగానే తాను చేసిన ఘనకార్యాన్ని భర్తతో సంతోషంగా చెప్పింది వెంగమ్మ. వ్యాపారికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు- కోపం ముంచుకుని వచ్చింది.
“ఛీ! ఛీ! నీ కంటే తెలివి తక్కువ మనిషి ఈ లోకంలో లేరు. వాడు మళ్ళీ వస్తాడుటే, నీ వెర్రి గానీ?!" అని అరిచాడు ఆవేశంగా.
“అబ్బో! తెలివి నీ ఒక్కడిదేగా?" అంది వెంగమ్మ వెటకారంగా. "నేను అందరి కంటే తెలివి తక్కువ దాన్నా?! ఆ సంగతి నీకెలా తెలుసు? అసలు ఈ లోకంలో ఎట్లాంటి వాళ్ళుంటారో తెలీనిది నీకే. వెళ్ళి ఓసారి దేశం అంతా తిరిగి, చూసిరా!” అంది ఈసడిస్తున్నట్లు.
ఆమె అమాయకపు మాటలకి వ్యాపారికి బలే కోపం వచ్చింది. అయినా తమాయించుకుని "ఆ బేరగాడి ఆచూకీ తెలుసుకొని వస్తాను ఆగు!" అని హడావుడిగా సంత వైపు బయలుదేరి పోయాడు.
సంతలో మోసగాడి ఆచూకీ కొంత సులభంగానే దొరికింది. వాడి ఊరు మరీ ఏమంత దూరం కాదు. వ్యాపారి ఆ మోసగాడి ఆనవాలు పట్టుకుని ఆ ఊరికి బయలుదేరాడు.
నడుస్తూ నడుస్తూ వెనుదిరిగి చూసిన వ్యాపారికి ఓ వింత దృశ్యం కనబడింది. అతని వెనకగా ఎద్దుల బండి ఒకటి వస్తున్నది. ఆ బండి ఇరుసుపైన ఒక కాలు నిటారుగా మోపి, క్రిందికి పడిపోకుండా సర్దుకుంటూ నిలబడి బండిని తోలుతున్నది ఒకామె. బండిలో నిండుగా గడ్డి ఉంది- కావాలనుకుంటే ఆమె గడ్డి మీదైనా కూర్చోవచ్చు; లేదా దిగి నడుచుకుంటూ అయినా రావొచ్చు. రెండూ కాకుండా ఇరుసు మీద ఎందుకు, అలా ఒంటికాలి మీద నిలబడటం? 'ఈమె ఎవరో గొప్ప అమాయకురాలిలాగానే ఉంది' అనుకుని నవ్వుకున్నాడు వ్యాపారి.
వెంటనే అతనికి వెంగమ్మ మాటలు గుర్తొచ్చాయి. "పాపం, వెంగమ్మ మాటలు నిజమే కావొచ్చు- లోకం ఏమంత తెలివిగా లేదు- ఈమె ఎంత వెర్రివెంగళమ్మో కనుక్కుందాం!" అనుకున్నాడు.
కొంచెంసేపు ఆగి, బండి తన దగ్గరికి రాగానే ఆమెని పలకరిస్తూ "ఏమమ్మా, ఎందుకట్లా ఒంటి కాలిమీద నిలబడటం? పడితే ప్రమాదం కదా? గడ్డి మీద కూర్చొని రావొచ్చు; లేకపోతే అసలు పూర్తిగా దిగి నడిచి రావొచ్చు" అన్నాడు అతను.
“మా అబ్బాయి అట్లా చెప్పలేదు- బండి మీదే రమ్మన్నాడు" అన్నదామె పడిపోకుండా మళ్ళీ సర్దుకొని నిలబడుతూ- "ఇంతకీ నువ్వెవరు? నిన్ను మా ఊళ్ళో ఎప్పుడూ చూడలేదు- ఏదో ఆకాశంలో నుండి ఊడి పడ్డట్లున్నావు!" అన్నది ఆమె.
వ్యాపారికి ఆమెను కొంచెం ఆటపట్టించాలనిపించింది. "అవునవును- బలే కనుక్కున్నావే?! నిజంగానే నేను ఆకాశం నుండి ఊడిపడ్డాను- మీ ఊరు చూసి పోదామని!" అన్నాడు ఎగతాళిగా.
ఆమె నిజంగానే అమాయకురాలు. వ్యాపారి మాటలు నిజమనుకున్నది. "అవునా, అయితే నిన్నొకటి అడుగుతా చెప్తావా? మా ఇంటాయన పైకి వెళ్ళి మూడేళ్ళవుతున్నది. నీకు ఆయన అక్కడ కనిపించే ఉండాలి కదా, ఎట్టా ఉన్నాడు, కులాసానేనా?!” అని అడిగింది సూటిగా.
'వార్నాయనో, ఈమెవరో మా వెంగమ్మ కంటే వెంగళమ్మ. దేశంలో నిజంగానే చాలామంది అమాయకులు ఉన్నట్లున్నది" అనుకున్నాడు వ్యాపారి- "ఓఁ, చూడకేమి?! రోజూ చూస్తూనే ఉన్నాను మీ ఇంటాయన్ని. పాపం ఆయనకి అక్కడ గొర్రెలు కాచే పని ఇచ్చారు. మరి అవేమో, ఒక్క చోట నిలవకుండా కొండా-కోనా; గుట్టలూ-మిట్టలూ తిరుగుతున్నాయి. వాటి వెంబడి తిరగలేక మీ ఆయన నానా అవస్థలు పడుతున్నాడు. గుడ్డలు కూడా పీలికలై పోయాయి!" అన్నాడు పైకి.
“అయ్యో, మాకు ఎట్టా తెలుస్తుంది ఆ సంగతి?! మేం ఇక్కడే ఉన్నామాయె. అయినా మొన్న సంక్రాంతి పండక్కి బట్టలు కూడా పెట్టుకున్నామే; అంత అవసరం ఉంటే వచ్చి తీసుకు పోకూడదా?” అని యాష్టపడిపోయిందామె. "ఇక్కడే ఉండండి, ఇంటికి పోయి గుడ్డలు తెచ్చిస్తాను. ఈసారి పైకి వెళ్ళగానే మా యింటాయనకు ఇద్దురు" అని వేడుకున్నది.
వ్యాపారికి నవ్వు ఆగలేదు. ఆమెని ఇంకా పరీక్షించటం కోసం అతను "అది వీలు పడదు తల్లీ, ఆకాశానికి ఒక పెద్ద ద్వారం ఉంటుంది. అక్కడ ఉండే ద్వారపాలకుడికి లంచం ఇస్తేగాని వేటినీ లోపలికి తీసుకోని పోనివ్వడు, ఏం చేయను?!" అన్నాడు. “అలాగేలే, ఎంతో కొంత ఇస్తే సరి! నిన్ననే మా అబ్బాయి ధాన్యం అమ్మిన డబ్బులు తెచ్చి ఇనప్పెట్టెలో పెట్టాడు. గుడ్డలు, డబ్బులు తెచ్చి ఇస్తాను- కాసేపు ఆగండి" అని బండిని తోలుకొని ఇంటికి వెళ్ళింది ఆమె. వ్యాపారి అక్కడే ఆగిపోయాడు.
కొద్దిసేపటికల్లా గుడ్డలు, పైకం తీసుకుని అక్కడకి వచ్చింది అమె!
'ఈమె వెంగమ్మకు అక్క' అని గ్రహించిన వ్యాపారి కలవర పడిపోయి "ఒక్కసారి మీ అబ్బాయిని చూసి వెళతాను తల్లీ!" అని ఆమెతోపాటు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆమె కొడుకుకు జరిగినదంతా చెప్పి, ఆమె ఇచ్చిన డబ్బులు, గుడ్డలు అతనికి తిరిగి ఇచ్చేశాడు.
ఆ యువకుడు వ్యాపారికి అనేక కృతజ్ఞతలు చెప్పుకుని "మీరెవరు? ఏం పని మీద వచ్చారు?' అని అడిగాడు.
"నా భార్య వెంగమ్మ కూడా మీ అమ్మ మాదిరిదే- ఏమీ తెలీదు పాపం. మొన్న నేను ఊళ్ళో లేనప్పుడు మీ ఊరివాడు ఎవడో వచ్చాడట; మా వెంగమ్మని మోసం చేసి ఆవులని రెండింటిని తీసుకెళ్ళిపోయాడు. వాడిని వెతుక్కుంటూ నేను ఇట్లా వచ్చాను" చెప్పాడు వ్యాపారి విచారంగా.
ఆ కుర్రవాడికి ఊళ్ళో వాళ్ళంతా పరిచయమే- "ఓఁ, వాడు నాకు తెలుసు. వాడో పెద్ద మోసగాడు. నిన్ననే రెండు ఆవుల్ని తెచ్చాడు. అవి మీవే అయి ఉంటాయి- చూద్దాం పదండి" అని అతని ఇంటికి తీసుకు వెళ్ళాడు వ్యాపారిని.
తన ఆవుల్ని చూడగానే గుర్తుపట్టాడు వ్యాపారి. అవి కూడా వ్యాపారిని చూసి సంతోషంగా అరిచాయి. వెంటనే వ్యాపారి న్యాయాధికారికి ఫిర్యాదు చేయటం, న్యాయాధికారి విచారణ జరిపి మోసగాడిని శిక్షించటం, జరిమానాతో సహా ఆవుల్ని వ్యాపారికి ఒప్పచెప్పటం జరిగాయి.
వ్యాపారి ఇంటి కొచ్చి ఆవుల్ని కొట్టంలో కట్టేస్తుంటే "నేను చెప్పలేదూ, అతను చాలా మంచివాడేనని?! పాపం, మన ఆవుల్ని మనకు ఇచ్చేశాడు చూడు!" అన్నది వెంగమ్మ.
"నిజమేనే, లోకంలో నీలాంటివాళ్ళూ, నాలాంటివాళ్ళూ చాలా మందే ఉన్నారు. వాడిలాంటివాళ్ళూ ఉంటారు. అయితే అమాయకుల్ని మోసం చేస్తే ఎప్పటికైనా శిక్ష మటుకు తప్పదు"అన్నాడు వ్యాపారి.