వినాయక చవితికి మట్టి విగ్రహం తయారు చేద్దామని, మా నాన్నను బంకమట్టి తీసుకు రమ్మన్నాను. ఆరోజు సాయంత్రమే ఓ పెద్ద బంకమట్టి ముద్ద తీసుకొచ్చాడు మా నాన్న.

మట్టి ముద్దను తొట్టిలో వేసి నీళ్ళు పోస్తుండగా, నా ప్రమేయం లేకుండానే నేను జ్ఞాపకాల అలమారలోకి జారిపోయాను. నా కళ్ళలో గూడుకట్టిన నీళ్ళు మళ్ళీ కరిగి ప్రవహించసాగినై-

పోయిన వినాయక చవితికి నేను విగ్రహం తయారుచేస్తుంటే సాన్వి నా దగ్గరే ఉండింది...

నేను మట్టిలో నీళ్ళు పోస్తుంటే నా కాళ్లకు అడ్డం పడి గంతులు వేస్తూ ఉండింది. నేను మట్టి పిసుకుతుంటే ఆ మట్టిని వాసన చూడబోయిందది. 'ఏయ్! మట్టి తింటావా?' అని నేను దాని నోటికి మట్టి రాస్తే 'కుయ్..కుయ్' మని ఏడ్చుకుంటూ పోయిందది!

ఇప్పుడు నేను ఒక్కదాన్నే కూర్చొని విగ్రహం తయారు చేసుకోవాలి. తను లేదు కదా! నన్ను శాశ్వతంగా వదిలి వెళ్లిపోయింది. తను నాతో కలిసి ఉన్నది కొన్ని నెలలేనట.. అయితేనేమి, ఆ నెలల్లోని ప్రతి క్షణం‌ నాకు ఇంకా గుర్తున్నది. గుర్తుకు వస్తూనే ఉన్నది. నా కళ్ళలో నీరు ఇంకా ఇంకిపోలేదు.

"ఇది మరీ వింతగా ఉంది ఒదినా! కుక్క చచ్చిపోయిందని సంవత్సరం నుండి ఏడుస్తోంది ఏంటి, ఈ పిచ్చిది?! మొన్న మా అమ్మ చనిపోతే కూడా నేను ఒక్క చుక్క కన్నీరు కూడా కార్చలేదు. పాడు కుక్క కోసం ఇంత ఏడుపు దేనికి?!" పండగకొచ్చిన మా మేనత్త అడుగుతోంది అమ్మని.

నాకు చాలా ఆవేశం వచ్చింది. వెళ్ళి ఆమెకు 'నోరు మూసుకో' అని చెప్పాలనుకున్నాను. 'ఊరుకుంటావా, లేదా' అని గట్టిగా అరుద్దామనుకున్నాను. అయితే వెంటనే మా అమ్మ మాటలు వినిపించాయి- "దీనిది ప్రేమో, పిచ్చో మనకు అర్థం కాదులే వదినా. ఆ మూగ కుక్కంటే దీనికి ఇంత ఇదేంటో, ఎవ్వరికీ తెలీదు" అని.

నిజమే.. తనంటే నాకు ఎంత 'ఇదో' ఎవ్వరికీ తెలీదు. మా అమ్మకు కూడా పూర్తిగా అర్థం కాలేదు. నేను ఈ పెద్దవాళ్ళతో ఏమీ మాట్లాడదలచుకోలేదు. గబగబా నా గదిలోకి వెళ్ళి మంచం మీద బోర్లా పడిపోయి ఏడ్చాను. ఎప్పుడో ఓసారి వచ్చే మా అత్తయ్యకు నా భావనల లోతు ఎలా అర్థం అవుతుంది?...

తను మా అమ్మకు, అత్తయ్యకు ఉత్త పిచ్చి జంతువులాగ కనిపిస్తుంది- కానీ నావరకూ అది ఎప్పటికీ ప్రత్యేకమే. నాతోబాటు మనసును పంచుకున్న నేస్తం తను. నా తోడు. నా నీడ- నేను వ్యక్తం చేయలేక-పోయిన భావనల్ని కూడా తను తన భాషలో వ్యక్తీకరించగలిగేది మరి! నా సమస్యలు వేరే ఎవ్వరికీ అర్థం కాకపోయినా, దానికి మాత్రం అర్థమయ్యేవి.

మాకిద్దరికీ ఎప్పుడైనా గొడవైతే, కొంత సేపటికి ముందుగా అదే నా దగ్గరికి వచ్చేది; నా పాదాలను నాకేది- దోమల్ని పట్టుకునేందుకు గోడలమీదికి అది ఎంత ఎగిరెగిరి దూకేది?! ఆ క్షణం గుర్తుకు రాగానే నవ్వాను. నాన్న వచ్చినట్లున్నారు. నన్ను పిలుస్తున్నారు ఎందుకో? నాకు వెళ్ళాలని లేదు. "ఏయ్! నాన్న ఏం తెచ్చారో చూడు!" అరుస్తోంది అమ్మ. నాకు చూడాలని లేదు. నిద్ర వస్తోంది నిజానికి.. ఎప్పుడు తెచ్చినా ఏవో పిచ్చి పిచ్చి పళ్ళు తెస్తారు; ఒక్కోసారి ఏ చాక్లెట్లో‌ తెస్తారు. నాకేమీ అక్కర్లేదు...

నిద్రలో నా సాన్వి వచ్చింది. తన చిట్టి చిట్టి చేతులతో నా బుగ్గలు నిమురుతోంది. "ఏయ్!‌ ఊరుకో సాన్వీ! నోట్లో చేతులు పెడతారా ఎవరైనా?" సాన్వి వినటం లేదు. నా ముఖాన్ని నాకేందుకు ప్రయత్నిస్తున్నది. దాని శ్వాస నా ముఖానికి తగుల్తోంది. నాకు నవ్వొస్తోంది. ఎంత ఒద్దన్నా ఊరుకోదేమి, ఇది? బొత్తిగా భయం లేని పిల్ల.." అంతలో మెలకువ వచ్చింది... నా ముఖాన్ని నిజంగానే ఏదో నాకుతోంది!

నేను చటుక్కున చేతులు విదిలించాను. దూరంగా పడి 'కుయ్..కుయ్'మంటోంది సాన్వి- కాదు కాదు- ఇది ఇంకెవరో! నా సాన్వి కాదిది!

దాన్ని అదిలించాను. బెదిరి బయటికి పరుగెత్తింది. మళ్ళీ వచ్చి దూరంగా నిల్చున్నది. తోక ఊపుతోంది.. ముద్దుగానే ఉంది ఇది.. నాకు నేస్తం అవుతుందేమో.. "ఏయ్!..." అని అరిచి దాని వెంట పడ్డాను. అది ఇల్లంతా తిరిగి తిరిగి పోయి మా నాన్న కాళ్ళకు చుట్టుకున్నది. నేను నవ్వుతూ దాన్ని పట్టుకొని పైకి లేవనెత్తాను.

మా అందరి నవ్వులతో మళ్ళీ ఓసారి ఇల్లంతా పులకరించింది.