"అట్లాగ, నేను కూడా ఆ మందవిషం లాగానే అవమానానికి ఓర్చుకొని, శతృవుల ఆలోచనను అణచి, మన పనిని నెరవేర్చుకొని వచ్చాను. భగ్గున మండే దావానలం వృక్షాల కొమ్మల్ని, ఆకుల్ని కాల్చి విడిపెడుతుంది తప్పిస్తే, ఆ చెట్లను నిర్మూలించలేదు. నదీ జలం చల్లనిదైనప్పటికీ తనకు అడ్డువచ్చినప్పుడు తీరంలో ఉన్న వృక్షరాజాలను వ్రేళ్లతో సహా పెకలించి వేస్తుంది- కాబట్టి, మంచి మాటలతో సాధిం- చగలిగే పనులను వంద యుద్ధాలు చేసి కూడా నెరవేర్చుకోలేము. ఏది ఎలాగున్నా 'హిరణ్యగర్భుడు సంధికి తగినవాడు' అనే నా విశ్వాసం" అన్నది మేఘవర్ణం.
అప్పుడు మంత్రి దూరదర్శి చిత్రవర్ణుడి వైపుకు తిరిగి "ప్రభూ! ఏరకంగా చూసినా ఇప్పుడు హిరణ్యగర్భుడితో సంధి చేసుకొని అతని రాజ్యానికి ఎప్పటిలాగా అతనినే రాజుగా పున: ప్రతిష్టించటం శ్రేయస్కరం అనిపిస్తున్నది. ఇవాల్టి ఉదయాన్నే మన గూఢచారులు ఒక సమాచారం అందించారు- "కొద్దిరోజుల క్రితమే కర్పూర-ద్వీపం నుండి ఒక కొంగను సింహళద్వీపపు రాజైన మహాబలుడి దగ్గరికి పంపారు" అని. ఆలోచిస్తే, హిరణ్య గర్భుడు ఆ దూతను అక్కడికి పంపించిన ఉద్దేశం స్పష్టంగా తెలుస్తున్నది- "మనతో యుద్ధం చేయటంలో మహాబలుడి సాయాన్ని కోరుతున్నాడు హిరణ్యగర్భుడు"!
మన ఈ ఊహ నిజమైతే- గతంలో ఒకసారి మహాబలుడు కూడా మనచేత ఓడించబడి అవమానాలకు గురైనవాడే- కాబట్టి, అతను మహా సంతోషంగా హిరణ్యగర్భుడికి తోడ్ప- డుతాడు- సందేహం లేదు. వాళ్లిద్దరూ కలుసుకొని మన మీదకి యుద్ధానికి రావటం గనగ జరిగిందంటే, మన ప్రస్తుత స్థితిని దృష్టిలో ఉంచుకొని చెబుతున్నాను- మనం వాళ్లని గెలవటం దాదాపు అసాధ్యం! అందువల్ల హిరణ్యగర్భుడితో సంధి చేసుకోవటమే 'ఉత్తమం' అని నాకు అనిపిస్తున్నది" అన్నది.
మంత్రి మాటలు విని చిత్రవర్ణుడు ఈసడింపుగా నవ్వుతూ "ఏనాడైతే ఆ హంసరాజు మన చేతిలో ఓడిపోయాడో, ఆనాడే అతను పూజార్హమైన స్థానాన్ని కోల్పోయి, మనకు సేవకునితో సమాను-డయ్యాడు. అట్లాంటి వాడిని మళ్లీ ఓసారి తెచ్చి గౌరవిస్తూ రాజపీఠం మీద కోర్చోబెట్టవలసినంత అవసరం మనకు ఇప్పుడు ఏం వచ్చింది?
నిజంగానే అంత అవసరం వస్తే అప్పుడు ఏదో ఒకటి చేద్దాంలే. పంటను విరగకాసేంత వరకు పెంచి అటు తర్వాత నక్కలకు పెట్టినట్లు, బాహుబలంతోటీ, ధైర్యంతో కష్టపడి గెల్చుకున్న రాజ్యాన్ని, అనుభవించే కాలం వచ్చాక, ఇప్పుడు పరాయి వాడి పాలు చేయమంటారేమి?
మహాబలుడికి ఇందులోకి దూరవలసిన అవసరం అసలు ఏమున్నది? అయినా అతను అంత ఇష్టపడి దూరితే, దూరనివ్వండి! నా ప్రతాపపు సెగ ఎంత తీవ్రంగా ఉంటుందో అతను మళ్ళీ ఓసారి తాజాగా రుచి చూస్తాడు-"
అని ఇంకేదో అనబోతుండగానే చిలుక ఒకటి రొప్పుకుంటూ వారి వైపుకు పరుగుపరుగున వచ్చింది. దూరం నుండే అది "మహారాజా! సింహళ ద్వీపపు రాజు పెద్ద సైన్యంతో వచ్చాడు! మన పట్టణాన్ని ఆక్రమించేందుకు గాను ఊరి బయటే విడిది చేస్తున్నాడు!" అని కేకలు పెట్టింది.
నెమలి రాజు ఆ కేకలు విని ఉలిక్కిపడి "ఏమది, ఏమది?!" అని ఆదుర్దాగా అడిగింది. కొలువులో ఉన్న వాళ్లంతా ఆశ్చర్యంతో నిశ్చేష్టులైపోయారు.
అంతలోనే చిలుకకూడా నెమలి రాజు దగ్గరికి వచ్చి నమస్కరించింది- "ప్రభూ! సింహద్వీపరాజైన మహాబలుడు అకస్మాత్తుగా, కోపకారణం ఏమీ లేకుండానే మనమీదికి యుద్ధానికి తరలివచ్చాడు. తన సేనల్ని మన నగరం వెలుపల విడిది చేయిస్తున్నాడు. అసలు అతను మన రాజధానికి ఇంత దగ్గరగా వచ్చేంతవరకూ మనవాళ్లకు ఎవ్వరికీ అతని రాక గురించి తెలియనే లేదు! మోహరించి ఉన్న శత్రు సైన్యాన్ని చూసిన తర్వాత, ఇప్పుడు మన కావలి వాళ్లు యుద్ధ భయంతో వణికిపోతూ, దిక్కు తెలీనట్లు తిరుగుతున్నారు!
ఇందాక కొద్దిసేపటి క్రితం నేను పళ్ల కోసం అడవికి వెళ్ళాను. కోసుకుంటూ, కోసుకుంటూ ముందుగా ఒక చెట్టు కొన కొమ్మ నుండి చూశాను- దూరంగా మిన్నూ-మన్నూ ఏకం చేస్తూ దుమ్ము లేస్తున్నది. దాంతో నా మనసు విపరీతంగా ఆందోళనకు గురవ్వగా, "ఏమిటి, యీ ధూళి?!" అని ఆలోచనలో పడ్డాను.
అంతలోనే కూతవేటు దూరంలో సైన్యాల కలకలం వినబడింది. ఆ వెంటనే బారులు తీరిన సైన్యాలు మన నగరం వైపుకు రావటం కనబడ్డది. అటుగా ఎగిరి వస్తున్న కొంగనొకదాన్ని ఆపితే తెలిసింది- 'మన రాజ్యాన్ని ఆక్రమించేందుకు వస్తున్న సింహళ సైన్యం గురించి. వెంటనే ఆ విషయాన్ని తమరి చెవిన వేసేందుకు పరుగున వచ్చాను" అని వివరంగా చెప్పింది.
అది విని నెమలిరాజు చిత్రవర్ణుడు రౌద్రమూర్తియై లేచింది. కోపంతో ముఖం ఎర్రబడగా తన కొలువులో ఉన్న మంత్రి-సేనా సమూహాన్ని కలయ చూస్తూ- "దూరదర్శీ!నిన్ననో- మొన్ననోనే కదా, మహాబలుడు మన మీద యుద్ధానికి వెడలి వచ్చి, మన చేత చావుదెబ్బ తిని, ఘోర పరాభావం పొంది, సేనల్ని నేలపాలు చేసుకొని, తాను మాత్రం ప్రాణాలు అరచేత పట్టుకొని, సొంత గడ్డకు పారిపోయింది?! దాన్నంతా మరచిపోయి, తనేదో వీర పురుషుడన్నట్లు, హెచ్చుతగ్గులు చూసుకోకుండా, పొట్టేలు వచ్చి కొండను ఢీకొన్నట్లు, ఏ ముఖం పెట్టుకొని మళ్లీ యుద్ధానికి తరలివచ్చాడు?!
చూశావా, అతని కండకావరం?! మనం ఇప్పుడే పోయి ఆ పొగరుమోతును వధించి, సైన్యంతో సహా యమపురికి అతిధిగా పంపుదాం! అడ్డులేని శౌర్యపరాక్రమాలకు నెలవునైన నా ముందు గడ్డిపోచలాంటి యీ పక్షి ఎంతటిది? ఇతని సైన్యం ఏపాటిది?
ముందు మనందరం వెళ్ళి, వచ్చిన ఈ వీర పురుషుల్ని అందరినీ నక్కలకు ఆహారం కానిచ్చి వద్దాం; ఆపైన సింహళ ద్వీపానికి కూడా యుద్ధానికి వెళ్లొద్దాం! యీ సారి అతని రాజధానిని కూకటి వ్రేళ్లతో సహా పెకిలించి, పేరుకి కూడా లేకుండా దాన్ని నేలమట్టం కావించి కానీ తిరిగిరావద్దు!" అన్నది.
అప్పుడు మంత్రి దూరదర్శి లేచి నిలబడి ప్రభువుకు నమస్కరిస్తూ, వినయంగా ఇలా అన్నది- “ప్రభూ! పరిస్థితులు ఇదివరకటి లాగా లేవు. మొన్న హంసరాజుతో జరిగిన యుద్ధంలో పేరు మోసిన వాళ్లు- మనవాళ్ళు అనేక మంది వీర మరణం చెందారు. దాంతో మన సైనికులను గుర్తించి, ముందుకు నడిపి, మన లక్ష్యం నెరవేరేట్లుగా వారి మనసుల్లో ధైర్యాన్ని, శౌర్యాన్ని, బాహుబలాన్నీ మెరిపించి, సైన్యాధ్యక్షత్వాన్ని వహించేందుకు తగినవాళ్ళు, ఏది సరైనదో, ఏదికాదో తెలిసిన విచక్షణ కలవాళ్ళు ఎవ్వరూ నా కంటికి ఇంకా కనబడలేదు. అందువల్ల యీనాడు మన సైనికదళానికి అనేక మంది ప్రభువులైనారు- ఎవరికివాళ్లు నాయకులైనారు ప్రభూ!
ప్రభూ! అన్యథా భావించకండి- సాహసం ఎల్లవేళలా పనికి రాదు. 'ఒకప్పుడు మన చేత ఓడినవాడే కదా, వీడు ఏపాటి శత్రువు' అనుకొనరాదు. అగ్నిజ్వాలలో కాగిన నీళ్లే పొంగి పడి, ఆ అగ్నిని చల్లార్చుతాయి. బండి చక్రం మాదిరి, కాలగతి వల్ల పరిస్థితులన్నీ క్రిందివి మీదకి, మీదివి క్రిందకి అవుతుంటాయి. చేత్తో విసిరిన బంతిలాగా, యీ భూమి మీదికి వచ్చిన జీవులన్నిటికీ ఇలా హెచ్చుతగ్గులు- క్రింద పడటం, తిరిగి పైకి లేవటం- ఇదంతా సహజం.
దయచేసి "ప్రాణాల మీది తీపితో వీడు ఇలా చెబుతున్నాడు" అనుకోకండి. మేఘం మారికి గొప్పగా గర్జించటం వల్ల కార్యం నెరవేరటం అనేది ఎప్పుడూ జరగదు! మహాత్ములు సావధానంగా, సాధక బాధకాలన్నింటినీ మంత్రులతో చర్చించి, చక్కగా ఆలోచించి, లాభనష్టాలను బాగా బేరీజు వేసుకొని, ఆ తర్వాత గానీ 'ఏంచేయాలి' అనేది నిశ్చయించరు.
రాజు తాను ఎంత బలవంతుడైనాగానీ, అనేక మంది రాజులతో ఒకే మాటు వివాదం పెట్టుకోకూడదు; అట్లా పోట్లాట పెట్టుకుంటే ఖచ్చితంగా నశిస్తాడు- ఇంకేమీ ఉండదు. పాము ఎంత బలమైనదైనా, చలి చీమల చేత చిక్కి చనిపోవటం మనం ఎరుగనిదా? అర్థం లేని విరోధాన్ని సమర్థించకండి-ప్రభువులవారు నా మీద దయ తలచి యుద్ధాన్ని మానండి. 'ఏది సరైనది, ఏది కాదు' అనే విచారణ లేకుండా, కేవలం కోపమే ప్రధానంగా, ఎవరైతే త్వరపడి నిర్ణయం తీసుకుంటారో, అలాంటి వాళ్ళు 'ముంగిసను చంపుకొని ఆనక విచారించిన బ్రాహ్మణుడి మాదిరి, పశ్చాత్తాపానికి గురవుతారు. ప్రభువులవారికి ఆ కథ చెబుతాను, వినండి” అని ఇలా చెప్పసాగింది- (..మిగిలినది మళ్ళీ)