మమ్మీలు!

ఏసు క్రీస్తు పుట్టి ఇప్పటికి దాదాపు 2000 సంవత్సరాలు అవుతున్నది కదా, అంతకు 2500 సంవత్సరాల ముందు- అంటే ఇప్పటికి దాదాపు నాలుగువేల ఐదువందల సంవత్సరాల క్రితం- ఈజిప్టును "ఫారో"లు పరిపాలించారు.

ఆనాడు "ఫారో" కేవలం రాజు మాత్రమే కాదు- అద్భుత శక్తులకు ఆయన ప్రతీక; భగవంతునితో నేరుగా సంబంధం కలిగి ఉండే మంత్రవేత్త. రాజ్యంలో ఉండే అద్భుత సంపదలన్నిటికీ ఆయనే అధిపతి; ఈ భూమి మీద నడిచేదేవుడు ఫారో. ఆ ఫారోల శరీరం మామూలుది కాదు- దివ్య శరీరమే అది; అందరూ ఎల్లకాలమూ పూజించుకోవలసిన శరీరం అది. అట్లాంటి శరీరం నశించిపోతే, మరి దాన్ని అందరూ పూజించుకునేది ఎలాగ? అందుకని ఆనాటి వైద్యులు ఫారోలు చనిపోయాక, వాళ్ళ శరీరాలను 'మమ్మిఫై' చేయటం మొదలుపెట్టారు-

ఫారోల శరీరాల్లోంచి మెదడును, ఇతర పెద్ద అంతర్గత అవయవాలను అన్నింటినీ తీసేసి, ఎంపిక చేసిన రసాయనాలను శరీరంలోపల అంతా కూరేవాళ్ళు. పైన చర్మం పాడవ్వకుండా ఉండేందుకు గాను రకరకాల లేపాలను పూసి, శరీరం మొత్తాన్నీ బట్టతో గట్టిగా చుట్టేసేవాళ్ళు. అట్లా తయారు చేసిన 'మమ్మీ'ల చర్మం ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా పాడవ్వకపోవటం నిజంగా ఆశ్చర్యం; నాటి వైద్య శాస్త్రపు అద్భుతం! 'యునానీ' వైద్యుల గొప్పతనం.

మరి, మనం- తెలుగు వాళ్ళం- మన అమ్మను చక్కగా 'అమ్మా!' అని పిలవకుండా 'మమ్మీ' అని పిలిస్తే ఏం బాగుంటుంది?!







ప్రపంచపు వింత- గీజా పిరమిడ్

'మమ్మిఫై' చేసిన ఫారోల శరీరాలను అందుకోసమే ప్రత్యేకంగా నిర్మించిన గొప్ప గొప్ప కట్టడాల్లో భద్రపరచేవాళ్ళు- అవే ఈజిప్టు పిరమిడ్లు. వాటిలో అన్నింటికంటే పెద్దది, 'ఖూఫూ' అనే ఫారో తన శరీరాన్ని భద్రపరచటంకోసం తానుగా కట్టించుకున్న 'గీజా'

పిరమిడ్.

దాని ఎత్తు 455 అడుగులు! అంటే కనీసం‌ 45 అంతస్తుల భవంతి అంత!

నేలమీద దాని పొడవు, వెడల్పు 756 అడుగులు!

దానికోసం వాడింది 23,00,000 బండలు. వాటి మొత్తం బరువు కనీసం 59,00,000 టన్నులు! ఇంత బరువును పూర్తిగా మనుషులు- ఎడారి దాటించి తీసుకొచ్చారు- క్రేన్లు, యంత్రాలు ఏవీ‌ వాడకుండా!

గీజా పిరమిడ్ నిర్మాణానికి మొత్తం 20 సంవత్సరాలు పట్టిందట. ప్రతిరోజూ సరాసరి 14,000 మంది పనివాళ్ళు పని చేశారట. అవసరం ఉన్నప్పుడు ఒక్కోసారి 40,000 మంది కూడా పని చేశారట! ఇంత పెద్ద పిరమిడ్ నిర్మాణంలో వచ్చిన తేడాల్లా కేవలం 5.8 సెంటీమీటర్లు! పిరమిడ్ ముఖాలు నాలుగూ డిగ్రీలో వందో వంతు తేడా కూడా లేకుండా ఖచ్చితంగా తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిశల్ని సూచిస్తున్నాయి!

వీలైతే ఈజిప్టు దేశం వెళ్ళి పిరమిడ్లను చూడచ్చు, మనమూనూ!