ఒక రోజున నేను సముద్ర తీరాన నడుస్తూ పోతుంటే, అప్పుడే ఒక పెద్ద అల వచ్చింది. ఆ అల పైభాగాన ఎర్రగా మెరుస్తున్న వింత చేప ఒకటి కనిపించింది. అలమీద ఉన్న చేపను చూసి నేను ఆశ్చర్యపోతుండగానే ఎక్కడినుండి ఊడిపడ్డాడో మరి, జాలరివాడొకడు పరుగున వచ్చి, గురిచూసి దాని మీదికి తన వలను విసిరాడు. వల ఎగిరి వెళ్ళి ఆ చేప మీద పడటం నాకు కూడా స్పష్టంగా కనిపించింది- కానీ అంతలోనే ఏమైందో ఏమో, విచిత్రమైన ఆ చేప వలను కూడా లాక్కొని సముద్రంలోకి జారిపోయింది!

"అయ్యో, ఎంత పని ఐపోయిందో..." అని అక్కడే ఇసుక మీద ఏడుస్తూ పడిపోయాడు జాలరివాడు. ఆ సమయంలో సముద్రతీరాన ఉన్నవాళ్లంతా ఓసారి అతని వైపు వింతగా చూసి, మళ్ళీ పట్టించుకోకుండా ఎవరిదారిన వాళ్ళు పోయారు. నేను అతని దగ్గరకి పోయి "అబ్బా! ఒక వల పోయిందని అంత ఏడవాలా?" అన్నాను.

"నేను ఏడుస్తున్నది వల పోయిందని కాదు- చేప పోయిందని!" అన్నాడతను గట్టిగా.

నాకు ఇంకా నవ్వు వచ్చింది. "చూడు, ఇక్కడ- ఈ సముద్రంలో ఒక చేప కనపడిందంటే, అలాంటి చేపలు ఇంకా ఎన్నో ఉండి ఉంటాయి కదా, దగ్గర్లోనే?!" అన్నాను.

అతను పైకి లేచి, తన లుంగీకి అంటిన ఇసుకను దులుపుకున్నాడు- "అది కాదు బాబూ! ఈ చేప-...అంటే-" అని ఆగి, కొంచెం సేపు ఆలోచించాడు- "నీకు ఎలా చెబితే అర్థమవుతుంది, చెప్పు?! సరే! ఈ ప్రపంచంలో ఎన్ని రకాల చేపలు ఉన్నాయనుకుంటున్నావు?" అని అడిగాడు.

"సరిగ్గా చెప్పాలంటే కష్టం- కొన్ని వేల కొలది రకాలు ఉంటాయి" అన్నాను తెలివిగా.

"నిజమే. మరి వాటిలో మనుషులు ఎన్ని రకాలని చూసి ఉంటారు అనుకుంటున్నావు?" అన్నాడు ఇసుక దులుపుకుంటూ. "నాకు తెలిసి, మనుషులు అన్ని రకాల చేపలనీ చూసే ఉంటారు" అన్నాను.

"అయితే రా బాబూ! మా ఇంటికి రా! నీకు ఆశ్చర్యాన్ని కలిగించే సంగతి ఒకటి చూపిస్తాను" అని నా వీపు మీద తట్టి, భుజం మీద చెయ్యి వేసి నడిచాడతను.

రోడ్డు దాకా నడిచాక, నన్ను ఒక కారులో కూర్చోబెట్టాడు-

"అమ్మ బాబోయ్! ఈ చేపలు పట్టే వాడికి కూడా ఇంత మంచి కారు ఉందా!" అని అనుకున్నాను.

"మీరు ఎవరు సర్?" అని అడుగుదామనుకున్నాను; కానీ నా నోట్లోంచి మాట బయటికి పెగిలి రాలేదు. ధైర్యం కూడగట్టుకొని అడగబోయే సరికి-

"సర్! మీరు పనిలో ఉండగా చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. నేను ఒకసారి ఫోన్ లిప్ట్ చేసి 'ఎవరు?' అని అడిగితే 'మీ సర్ పనిలోంచి ఇంకా రాలేదా?' అని ఫోన్ కట్ చేసారు" చెప్పాడు డ్రైవర్.

"అవునా! అట్లా అయితే కొంపలు మునిగినట్లే. త్వరగా పోనియ్యి ఇంటికి! చాలా పని ఉంది!" అన్నాడు జాలరివాడు, అతన్ని తొందర పెడుతూ. ఆ హడావిడిలో నేను అడగాలనుకున్న ప్రశ్నను అడగనే లేదు.

చూస్తూ చూస్తూండగానే కారు ఓ పెద్ద గేటు ముందు ఆగింది. గేటు ప్రక్కనున్న వాచ్‌మ్యాన్ చటుక్కున నిలబడి గేటు తెరిచి ఆ చేపలు పట్టే వాడికి సెల్యూట్ చేశాడు. కారు సూటిగా గేటు లోపలికి దూసుకు పోయి, ఒక పెద్ద ద్వారం దగ్గర ఆగింది. మేమిద్దరం కారు దిగగానే డ్రైవరు కారును పార్క్ చేయడానికి తీసుకెళ్ళాడు.

"రా, రాహుల్!" అని ఆ జాలరివాడు బంగళా మెట్లు ఎక్కాడు. అద్దంలాగా మెరుస్తున్న ఆ మెట్లను, ధగధగలాడుతున్న రెయిలింగులను చూసి, నేను ఆశ్చర్యపోయాను. 'ఇతనిది ఇంత పెద్ద ఇల్లా!' అని. ఇంటిలో బండలు వజ్రాల మాదిరి మెరుస్తున్నాయి. తల ఎత్తి చూస్తే పైకప్పు- రకరకాల రంగు రాళ్లతో- బహుశ: నవరత్నాలు కావొచ్చు- తాపడం చేసి ఉంది. "రా బాబూ, రా!" దగ్గుకుంటూ అన్నాడు జాలరివాడు. నన్ను మేడ మీదికి తీసుకెళ్ళాడు. ఇద్దరం అక్కడ బాల్కనీలో కూర్చున్నాము. చుట్టూతా గొప్ప సముద్రపు దృశ్యం కనిపిస్తున్నది. చల్లటి సముద్రపు గాలి నా ముఖానికి తగులుతున్నది. "ఆఁ.. ఇప్పుడు నీకు చెబుతాను విను-" అని జాలరివాడు మొదలు పెట్టగానే, "సర్, మంచి నీళ్లు-" అని ఒక పని మనిషి అడిగింది.

"మంచి నీళ్లు వద్దులే, కాని బాబు కోసం జ్యూస్ తే" అన్నాడతను.

"ఇంక చెప్పండి సర్?!" అని నేను అతనికి గుర్తుచేయబోయాను.

'మాట్లాడద్దు' అని నన్ను వారిస్తూ చెప్పాడతను- "ఒకప్పుడు నేను మామూలు చేపలు పట్టే జాలరిని. ఇవాళ్ళ నేను 'ప్రొఫెసర్ బవిరి'ను. '

పేద జాలరి ఇంత ఎత్తుకు ఎలా ఎదిగాడు?' అని నీకు ఆశ్చర్యం వేయచ్చు. దానికి కారణం ఇవాల్టి రోజున నువ్వు చూసిన చేప- దాని పేరు నేనే పెట్టాను- 'బవిరి'. అవును- నా పేరే!

బవిరి చేపలు నువ్వన్నట్లు సముద్రంలో ఎన్నో లేవు- ప్రపంచంలో ఈరోజున అత్యంత అరుదైన చేప ఏదైనా ఉందంటే అదే. ఆ వింత చేప శరీర నిర్మాణం పూర్తిగా మనిషి శరీర నిర్మాణాన్ని పోలి ఉంటుంది. అవి మనుషులకు ఎంత దగ్గరగా ఉంటాయంటే, వాటి శరీర భాగాలను మనిషి శరీరభాగాలకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు!

నువ్వు ఇవాళ్ళ చూసిన బవిరి జాతి చేప ఒకటి, చాలా సంవత్సరాల క్రితం నాకు దొరికింది. అప్పుడు నేను నీ అంత చిన్న పిల్లవాడిని. అది నా చేతికి అందిన తర్వాత నా జీవితమే మారిపోయింది. ఈ రోజు నా చుట్టూ నువ్వు చూస్తున్న సంపద అంతా బవిరి చలవే.

బవిరి చేపలు ఎన్నడో‌ ఒకసారి తప్ప, మామూలుగా సముద్ర తీరానికి రావు. జాలరుల వలలకు దొరకవు. అయితే వాటికి క్రమం అంటే చాలా ఇష్టం. క్రమం తప్పకుండా పనులు చేసేవాళ్లకు తప్ప, ఇతరులకు కనిపించనుకూడా కనిపించవవి! ఒకసారి బవిరి కనిపిస్తే ఎవరైనా ఇంక ఉండలేరు. 'మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందా?' అని ఎదురు చూస్తారు- ఇప్పుడు నువ్వు ఆ దశలోకే పోబోతున్నావు...

అయితే నేను నీకో జాగ్రత్త చెప్పాలి. బవిరి చేపలకు అనేక అద్భుత శక్తులున్నాయి. అవి తమకు నచ్చిన వాళ్ళను తామే ఎంచుకుంటాయి- మనం ఎంత ఎదురు చూసినా ప్రయోజనం లేదు.. అవి ఇప్పుడు నిన్ను ఎంచుకున్నాయేమో అని నాకు అనిపిస్తున్నది.."

అతను ఇంకా ఏదో చెబుతున్నాడు గానీ నాకు వినిపించటం మానేసింది. నిశ్శబ్దంగా కదుల్తున్న అతని పెదవులూ, ఆశ్చర్యాన్ని రేకెత్తించే అతని సంపదా అన్నీ గిరగిరా తిరగటం మొదలుపెట్టాయి. వాటిని మరింత స్పష్టంగా చూడాలని నేను ఎంత ప్రయత్నించానో నా తల అంత తిరిగింది.

మళ్ళీ మెలకువ వచ్చేసరికి నేను సముద్ర తీరంలో పడి ఉన్నాను. నా చుట్టూ మూగి ఉన్న జనాలను నెట్టుకొని ముందుకి వచ్చారు మా నాన్న- "ఏమైంది రాహుల్?!" అంటూ.

నేను సముద్రంవైపుకు చూపించి 'బవిరి.. బవిరి' అన్నాను గానీ ఎవ్వరికీ ఏమీ అర్థం‌ కాలేదు.

ఆ తర్వాత చాలా రోజుల వరకూ నేను క్రమం తప్పకుండా సముద్రం ఒడ్డుకు వెళ్ళాను. అట్లా వెళ్ళిన ప్రతిసారీ బవిరి చేప కోసం క్రమం తప్పకుండా ఎదురు చూశాను. 'ప్రొఫెసర్ బవిరి' కోసం అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ వెతికాను. అతని ఇల్లు కనిపిస్తుందేమోనని సముద్ర తీరం అంతటా పిచ్చి పట్టినట్లు తిరిగాను. 'బవిరి' గురించి ఇంటర్నెట్లో కూడా వెతుకుతూనే ఉన్నాను- ఏమీ లాభం లేకపోయింది. ఇప్పుడు నేను ముసలివాడిని- అయినా ఇంత వరకూ మళ్ళీ ఆ బవిరి నా కంట పడనే లేదు!

నిన్ననే ఎవరో చెప్పారు- 'బవిరి'అంటే భ్రాంతి అని అర్థం ఉందట!

మరి ఇదంతా నా భ్రాంతేనంటారా....?