"అప్పుడు రాజకుమారుడు కీలుగుర్రం ఎక్కి ఎగురుకుంటూ పోయాడు... ఏడు సముద్రాలు దాటాడు.. అయినా రాజకుమారి జాడలేదు.." తాత గట్టిగా అనుకున్నాడు- తనకూ, చిట్టికీ మాత్రమే వినబడేట్లు.
"ఏమంటున్నావ్.. గట్టిగా చెప్పు, మళ్ళీ!" అరిచింది చిట్టి.
ఆ అరుపులకు మరో‌ పదిమంది పిల్లలు వచ్చి చేరారు తాతయ్య చుట్టూ.
"ఏంలేదు, ఏం లేదు, ఏదో గుర్తొస్తేనూ.." గొణిగాడు తాతయ్య.
"ఏదో కథ అయ్యుంటుంది. చెప్పు. విని పోతాం" సూటిగా అడిగేశాడు రవి.
"కథేం కాదు గానీ..మీకందరికీ పని! పెద్ద పెద్ద పొడుపులు! మీకు ఎంత తెలివి ఉందో మరి!" అన్నాడు తాతయ్య, పిల్లల్ని బెదిరిస్తున్నట్లు.
"తెలివి నీ సొత్తేనా? మమ్మల్ని అడిగి చూడు, దానికేం!" అన్నాడు ఐదేళ్ల బాబి- అందరూ నవ్వారు.
"సరేరా, అయితే చెప్పండి చూద్దాం. రాకుమారుడు ఏడు సముద్రాలు దాటాడట కదా, ఏమిటా ఏడు సముద్రాలు?"
"అవును తాతయ్యా, మహాసముద్రాలు ఐదే కదా ఉన్నది?" అడిగింది సుధ, ఆలోచనలో పడి.
"మన కథల్లో వచ్చే ఏడూ వేరు- "ఉప్పు సముద్రం, చెరకు సముద్రం, కల్లు సముద్రం, నేతి సముద్రం, పాల సముద్రం, పెరుగు సముద్రం, మంచి నీళ్ళ సముద్రం- ఇవి ఏడూనట! ఊరికే కథలు చదివి ఏం లాభం?" వెటకారంగా నవ్వాడు తాతయ్య.
"తాతయ్యా, నీ తెలివీ చూస్తాను- ఏడు వారాలు ఏంటో చెప్పు చూస్తాను?!" వెంటనే గట్టిగా అడిగేశాడు బాబి, రోషంగా. అందరూ నవ్వారు. "నాకు తెలీదురా బాబీ, నువ్వే చెప్పు!" అన్నాడు తాతయ్య.
"ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం- ఇవి ఏడూ వారాల పేర్లు" చెప్పాడు బాబీ టకటకా. అందరూ చప్పట్లు కొట్టారు.
"బాగుందిరా, మీ తాతయ్యకు ఇది తెలీకనా?!" అన్నది మామ్మ, వచ్చి కూర్చొని.
"ఆఁ వచ్చావా, నీ తెలివీ చూస్తాను. నీ పెళ్ళప్పుడు నీకు ఏడువారాల నగలు ఉండేవటనే, వాటిలో ఏమేం‌ ఉంటై, చెప్పు చూద్దాం?!" మామ్మని అడిగేశాడు తాతయ్య గడుసుగా.
"చెప్పు మామ్మా! మాకు ఆ నగలేంటో కూడా తెలీవు ఇప్పుడు" అంది రాధిక.
"ఆలోచించనివ్వండి.. వారానికొకటి.. సూర్యుడికి కెంపులు, చంద్రుడికి ముత్యాలు, కుజుడికి పగడాలు, బుధుడికి పచ్చలు, గురుడికి పుష్యరాగాలు, శుక్రుడికి వజ్రాలు, శనికి నీలాలు- అంతేగా?" అంది మామ్మ, వేళ్ళు లెక్క పెట్టుకుంటూ.
"వామ్మో! నీకు గుర్తున్నాయే!" ఆశ్చర్యపోయాడు తాతయ్య.
"తాతయ్యా! ఇంద్రధనస్సులో ఏమేం రంగులుంటై, చెప్పు. తెలుగులో చెప్పాలి!" అడిగింది సుధ.
"ఇంద్రధనస్సు రంగులు ఏడు- ఊదారంగు, 'ఇండిగో', నీలం, ఆకుపచ్చ, పసుపు పచ్చ, నారింజ, ఎరుపు- నిజమే, ఇండిగో కూడా ఓ రకం నీలమేగా, మరి దాన్ని ఆకాశనీలం అనాలేమో!" మూతి ముడుచుకున్నాడు తాతయ్య. "-అయినా మీకు మన దేశం గురించి ఎంత తెలుసో చూస్తాను. మన దేశంలో "ఏడు అక్కచెల్లెళ్ళు- సెవెన్ సిస్టర్స్" ఏమిటి, ఎక్కడున్నాయి?"
"నాకు తెలుసు! నిన్ననే చదివాను! మన దేశంలో ఉన్న ఏడు ఈశాన్య రాష్ట్రాలు- అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర- వీటిని సెవెన్ సిస్టర్స్ అంటారు!" అరిచాడు శివకుమార్, ఉత్సాహంగా.
"ఎవ్వరూ చెప్పలేరనుకున్నానురా, నీకు ఐదు మార్కులు!" నవ్వాడు తాతయ్య.
"నేను పోతాను నాయనా. ఇక్కడ కూర్చుంటే పనులు ఇంక అయినట్లే. మిమ్మల్ని ఈయన బారినుండి ఆ ఏడుకొండలవాడే కాపాడాలి" అంటూ లేచింది మామ్మ.
"ఆగాగు- ఇది చెప్పిపో- ఆ ఏడుకొండలూ ఏంటి?" అడుగుతుంటే తాతయ్య కళ్ళు మెరిసాయి.
"రోజూ సుప్రభాతంలో చదివేదేగా, ఆ మాత్రం తెలీదా ఏంటి- శ్రీశైలం, శేషశైలం, గరుడాచలం, వేంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి" అన్నది మామ్మ. పిల్లలంతా చప్పట్లు కొట్టారు. "మీ తెలివికి నేనూ ఓ పరీక్ష పెడతాను ఆగండి- "సప్త ద్వీపా వసుంధరా" అని చెబుతారు మన పెద్దలు. ఆ రోజుల్లో భూమి ఏడు ముక్కలుగా ఉండేదట. ఏమిటా ద్వీపాలు, చెప్పండి చూద్దాం" నిలబడే అడిగింది మామ్మ!
"వావ్! మామ్మా!‌ నువ్వు మావైపు! ఇప్పుడు తాతయ్య ఆట కట్టు!" అరిచారు పిల్లలంతా మామ్మ చేతులు పట్టుకొని లాగుతూ. మామ్మ మురిసిపోయింది. "చెప్పండి చెప్పండి! ఊరికే పిల్లల్ని ఏడిపించటం కాదు!" అన్నది.
"ఏమోనే, తెలీదు- మనదేశం జంబూద్వీపంలో ఉన్నదని మాత్రం తెలుసు మిగతావి నీకు తెలుసా?" అడిగాడు తాతయ్య. "ఓఁ.. జంబూ ద్వీపం, ప్లక్ష ద్వీపం, శాల్మలి ద్వీపం, కుశ ద్వీపం, క్రౌంచ ద్వీపం, శాక ద్వీపం, పుష్కర ద్వీపం- ఇవి సప్త ద్వీపాలు" అన్నది మామ్మ.
"మామ్మ సాయం తీసుకోవటం కాదురా, సొంత తెలివి వాడాలి. నువ్వు చెప్పరా శివా, ఏడు ఖండాలు ఏంటి?" తిరగబడ్డాడు తాతయ్య.
"బాబి గాడిని అడిగినా చెబుతాడు. ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా- ఏడు ఖండాలు" టకటకా చెప్పాడు శివ. పిల్లలంతా నవ్వారు ఉత్సాహంగా.
"తాతయ్యా! ఇది చెప్పు- సప్తధాతువులంటే ఏంటి, అవి ఏవి?" అడిగింది శర్వాణి. శర్వాణికి ఆయుర్వేదం అంటే ఇష్టం.
"ఆయుర్వేదం ప్రకారం శరీరం ఏడు ధాతువులతో తయారైంది. రసము, రక్తము, మాంసము, మేదస్సు, అస్థి, మజ్జ, శుక్రము- ఏ వ్యాధి వచ్చినా వీటిలో ఏవి దోషాలకు గురయ్యాయో కనుక్కొని, అవి నయమయ్యేందుకు ఔషధాలు ఇస్తారు ఆయుర్వేద వైద్యులు! అవునా?" వివరంగా‌ చెప్పి అడిగాడు తాతయ్య.
"బాగానే ఉంది తెలివి. ఇక మన దేశపు పవిత్ర నదులు ఏడు- సప్తనదులు- అవేంటి, చెప్పండి- గుర్తున్నాయా, లేవా? వాటిని రోజూ తలచుకోవాలని చెప్పారు మన పెద్దలు!" అడిగింది బామ్మ.
చిట్టికి మామ్మ నేర్పిన శ్లోకం ఒకటి గుర్తొచ్చింది- టక్కున చెప్పేసింది- "గంగ, యమున, సరస్వతి, గోదావరి, సింధు, నర్మద, కావేరి" అని. అందరూ చప్పట్లు కొట్టి మెచ్చుకున్నారు. బామ్మ దాన్ని ఎత్తుకొని ముద్దుపెట్టుకొని, "మరి మన పురాణాల్లో ఉన్న సప్త చిరంజీవులు ఎవరు? చెప్పండి" అన్నది మిగతా పిల్లలతో.
"వామ్మో! విననే లేదు!" అన్నాడు తాతయ్య. పిల్లలెవ్వరికీ వాళ్లెవరో తెలీలేదు.
"అశ్వత్థామ, బలి చక్రవర్తి, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు, వ్యాసుడు- వీళ్ళు సప్త చిరంజీవులు. అంటే వీళ్ళని లోకం ఎప్పటికీ‌ మరచిపోదన్నమాట!" మామ్మే చెప్పింది.
"మరి, కృపుడు ఎవరు మామ్మా?!" అడిగాడు బాబీ, అమాయకంగా. పిల్లలు అందరూ నవ్వారు.
"ఇంకా ఉన్నాయి చాలా ఏళ్ళు.. ప్రపంచపు‌ ఏడు వింతలు ఏంటి, చెప్పండిరా?!" అడిగాడు తాతయ్య.
"అందరూ నిశ్శబ్దం అయ్యారు- తాజ్ మహల్.." మొదలు పెట్టాడు శంకర్.
"లేదు నాన్నా! పరంపరగా వస్తున్న ప్రపంచ వింతల్లో అసలు తాజ్ మహల్ ఉండేది కాదు. ఈమధ్యే ఏర్పడిన ప్రైవేటు సంస్థ ఒకటి ఇంటర్నెట్లో‌ వోటింగు ద్వారా ఏడు వింతల్ని ఎంపిక చేసింది- ఆ పట్టీలో తాజ్‌మహల్ ఉంది అంతే. అయితే ఐక్యరాజ్య సమితి వారు ఆ పట్టీని అంగీకరించలేదు. అయినా వింతలు వింతలేలే, ఏవైనా చూడదగ్గవే, తెలుసుకోదగ్గవే!" అన్నాడు తాతయ్య, వెంటనే "శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే ఓ మనసా"అని జగన్మోహిని రాగంలో త్యాగరాయ కృతిని అందుకుంటూ.
"మాకు తెలుసు- సంగీతపు స్వరాలు కూడా ఏడేలే... అయినా ఈసారి 'ఏడు'ని పట్టుకున్నావెందుకు తాతయ్యా?" అడిగింది సుధ, అనుమానంగా.
"ఏంలేదు, కొత్తపల్లికి ఇప్పుడు ఏడేళ్ళు నిండాయి కదా, అందుకని గుర్తొచ్చింది!" నవ్వాడు తాతయ్య.
అభిమానులకందరికీ ఏడేళ్ళ నమస్సులు!
కొత్తపల్లి బృందం.