అయ్యన్నగారిపల్లిలో ఇరుగు పొరుగున నివసించే రాము, సోములకు చాలానే తేడాలుండేవి. రాము ధనవంతుడు- కానీ చెడ్డవాడు, మూర్ఖుడు. ఊళ్ళోవాళ్లందరూ రాము ఎంత పిసినారో చెప్పుకొని నవ్వుకునేవాళ్ళు.
మరి ఇక సోము ఏమో, పేదవాడు- కానీ మంచి గుణవంతుడు, బుద్ధిమంతుడు. ఊళ్ళోవాళ్ళందరికీ ఏ అవసరం వచ్చినా సాయానికి ముందుండేవాడు.
ఒకసారి దేవుడు ఒక బాటసారి రూపంలో ఆ ఊరికి వచ్చాడు. పాపం, ప్రపంచం అంతా నడిచి నడిచి వచ్చాడేమో, బాగా అలసిపోయాడు.
'ఈరోజు రాత్రికి ఎక్కడ ఆగచ్చు?' అని చుట్టూ చూసే సరికి, ఎదురుగానే రాము వాళ్ళ ఇల్లు కనబడ్డది. "వీళ్ళ ఇల్లు బాగుంది- పెద్దగా, విశాలంగా. విశ్రాంతి తీసుకునేందుకు ఇక్కడైతే చోటు బాగుంటుంది" అని ఆయన రాము వాళ్ల ఇంటి తలుపు తట్టాడు.
రాము వాళ్ళు సాయంత్రం తొందరగా అన్నం తినేస్తారు. ఇంట్లో దీపాలు వెలిగిస్తే కరెంటు ఖర్చవుతుందని, వీలైనంత వరకు చీకట్లోనే ఉంటారు. ఇంట్లో రకరకాల విలువైన వస్తువులు, వెండి బంగారాలు దాచి ఉంటారు గనక, వాళ్ళకు సహజంగానే క్రొత్తవాళ్లంటే చాలా భయం.
దేవుడు తలుపు తట్టేసరికి రాము తలుపు దగ్గరికి వచ్చి "ఎవరది?! ఏం కావాలి?!" అన్నాడు కోపంగా.
"నాపేరు 'శివ' అండీ! ఉదయాన్న అనగా బయలుదేరాను మా ఊరినుండి; నడిచి నడిచి చాలా అలసిపోయాను. మీ ఇంటి లోగిలిలో తలదాచుకునేందుకు తావు ఇవ్వగలరా, దయచేసి? కొంచెంసేపు విశ్రాంతి తీసుకొని తెల్లవారగానే వెళ్ళిపోతాను?!" అడిగాడు దేవుడు.
రాముకి అది అస్సలు ఇష్టం కాలేదు. 'చూడయ్యా! నువ్వెవరో నాకు తెలీదు. నువ్వు దొంగవే అయ్యుండచ్చు. దొంగలించటం కోసమే నా ఇంట్లో దూరుతుండచ్చు. నేను ఎట్లా కనుక్కునేది? నావల్ల కాదు; నాకంత సమయమూ లేదు. మరీ అంత పిచ్చోడిని కాదు గద- నీకు అంతగా కావాలంటే ఏ చెట్టు క్రిందనో పడుకోవచ్చు; ఇళ్ళ దగ్గరే పడుకోవాలని ఏమున్నది? పోయి దూరంగా ఆ చెట్టు క్రింద పడుకో!" అన్నాడు.
"సరేలెండి. పర్లేదు లేండి. మీకు నేను తెలీదుగా, నిజమే" అనేసి దేవుడు రాము దగ్గర సెలవు పుచ్చుకొని, నేరుగా సోము వాళ్ళింటి తలుపు తట్టాడు. సోము తలుపు తీసి "ఎవరు కావాలండీ?!" అని అడిగాడు.
"నా పేరు శివ అండీ. నేను ఒక బాటసారిని. చాలా దూరం నుండి వస్తున్నాను; నడిచి నడిచి అలసిపోయాను. మీ ఇంటి అరుగు మీద కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవచ్చా, రేపు తెల్లవారగానే వెళ్ళిపోతాను" అడిగాడు దేవుడు.
"ఓఁ దానిదేమున్నది, మీరు పడుకుంటే మా అరుగులు ఏమీ అరిగిపోవు. అయినా మీరు బయట పడుకోనక్కర్లేదు- మాతోబాటు మా ఇంట్లోనే పడుకోవచ్చు. కానీ ఏమంటే, మరి మేం ఏమంత ఉన్నవాళ్లం కాదు- మీకు పెట్టేందుకు సరిపడ అన్నం కూడా లేదేమో మరి... చూస్తాను. ముందయితే లోపలికి రండి, కాళ్ళు చేతులు కడుక్కోండి" అన్నాడు సోము, అతన్ని లోనికి ఆహ్వానిస్తూ.
"ధన్యవాదాలు స్వామీ! మీ మంచితనంతోటే నా కడుపు నిండింది. నాకు ఇంక వేరే భోజనమేమీ అవసరం లేదు" అన్నాడు దేవుడు మొహమాట పడుతున్నట్లు.
"అట్లా పస్తుండక్కర్లేదు లెండి- ఏదో మా ఇంట్లో ఉన్నంత తిందురు" అని ఆరోజు మిగిలిన అన్నమూ, ఊరగాయతో భోజనం పెట్టాడు సోము.
దేవుడు మరునాడు ఉదయాన వెళ్తూ వెళ్తూ- "ధన్యవాదాలు సోమూ! నువ్వు చాలా మంచివాడివి. ఆకలిగొన్న నాకు అడక్కనే భోజనం కూడా పెట్టావు. నీకు ఏదైనా ఇవ్వాలని ఉంది- ఇదిగో, ఈ పుచ్చకాయ విత్తనం తీసుకో. దీనిని మీ ఇంటి వెనక తోటలో నాటు. బాగా పెరుగుతుంది. నీకు మేలు జరుగుతుంది" అని ఆశీర్వదించి వెళ్లిపోయాడు.
సోము చాలా కాలంగా మంచి పుచ్చకాయ విత్తనాలకోసం వెతుకుతున్నాడు. 'ఇది కూడా బానే ఉంది. దేవుడిచ్చిన విత్తనం!" అని, అతను ఆ విత్తనాన్ని పెరట్లో నాటాడు.
మరునాటికల్లా అక్కడో మొలక బయటికి వచ్చింది. సాయంత్రం కల్లా అది తీగ వేసి పారింది. మరుసటి రోజుకొక వింత పిందె వేసింది. మూడోరోజుకల్లా అక్కడో బంగారు పుచ్చకాయ కాసింది! నిజంగానే ఆ పుచ్చకాయంతా మేలిమి బంగారం! దాని లోపల నిండా వజ్రాలూ, మణులూ, మాణిక్యాలూ ఉన్నాయి!
సోముకు చాలా సంతోషం వేసింది. అతను వాటిని వెలకట్టేందుకు పట్నంలో ఉన్న వ్యాపారి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఒక్కొక్క మణీ లక్షలాది రూపాయలు చేస్తుంది! వాటిలోంచి సోమయ్య కేవలం ఒక చిన్న వజ్రాన్ని మటుకు అమ్మి, మిగతావి పట్టుకొని సంతోషంగా ఇంటికి వచ్చాడు.
ఆలోగా అతని పెరట్లోని పుచ్చకాయ మొక్క మరొక పిందె వేసింది. అయితే ఈ సంగతి ఎలా తెలిసిందో, రాముకి తెలిసింది. "అయ్యో! ఆ బాటసారిగాడిని నేనే ఇంట్లోకి పిలుచుకొని ఉంటే ఎంత బాగుండేది! ఇవన్నీ పూర్తిగా నావే అగును గదా" అని అతనికి ఎక్కడలేని ఏడుపూ వచ్చింది.
"ఏమైనా గానీ! ఈ పుచ్చకాయలకు అసలు హక్కుదారుడిని నేనే- సోమయ్య కాదు!" అని అతను రాత్రికి రాత్రి సోమయ్య ఇంట్లో దూరి, తీగకు ఉన్న పుచ్చకాయని దొంగతనంగా కోసుకు పోయాడు.
కానీ మరునాటి ఉదయానికి చూస్తే అది కాస్తా కుళ్ళిపోయి ఉన్నది!
నిరాశగా చూస్తున్న రాముతో పుచ్చకాయ మాట్లాడింది: "నువ్వు చాలా చెడ్డవాడివి రామూ! ఇతరులకు ఉపయోగపడే పని ఏదీ చేయటం నీకు అస్సలు ఇష్టం లేదు. ఎవరినైనా మీ ఇంటి అరుగుమీద పడుకోనిస్తే నీదేం పోతుంది?" అన్నది.