మాతలుంగ రాజ్యపు రాజు యశోవర్థనుడు చాలా దయగల రాజు. యుద్ధాలంటే ఆయనకు అస్సలు గిట్టేది కాదు- ఎందుకంటే ఆయనకు తెలుసు- యుద్ధాలు అనేకమంది అమాయకుల ప్రాణాలను బలిగొంటాయి. ఎన్నో కుటుంబాలు నాశనం అవుతాయి. అయితే ఆయన మంచితనాన్ని బలహీనతగా ఎంచుకొని వేరే ఎవరైనా రాజులు మాతలుంగ మీదికి దండెత్తే అవకాశం ఉన్నది. "అలా జరగకుండా ఏం చేయాలి?" అని మంత్రులతో బాగా ఆలోచించిన మీదట, ఆయన తన కోట చుట్టూ చాలా పెద్ద, ఎత్తైన గోడ ఒకటి కట్టించాలని నిర్ణయించాడు.
కోట చుట్టూ గోడ లాంటిది ఒకటి ఇప్పటికే ఉన్నది. అయితే అది బాగా శిధిలం అయిపోయింది. ఇప్పుడు దాన్ని బలోపేతం చేసి, అలాగే దాని లావునూ ఎత్తునూ మరింతగా పెంచాల్సి ఉన్నది. ఇలా కోటగోడను పునర్నిర్మించటం అన్నది ఏమంత సులభమైన పని కాదు. ఏమంటే, మాతలుంగ రాజ్యంలో సగభాగం నిజానికి కోటలోనే ఉంది- మిగిలిన సగం కోటకు బయట. ఈ రెండు ప్రాంతాల్లో నివసించే ప్రజల్నీ వేరు చేయటం కొంచెం కష్టమే.
అయినా రాజుగారు తలచుకుంటే కానిదేమున్నది? కోటగోడ తయారు కాసాగింది. ఎక్కడికక్కడ ఎత్తైన కట్టడాలు లేచాయి. కోటలోంచి బయటికీ, లోపలికీ తిరగటం మీద ఆంక్షలు విధించబడ్డాయి. నిర్ణీత సమయాల్లో మాత్రమే అటునుండి ఇటు, ఇటు నుండి అటు ప్రజల్ని రానిస్తారు. ఆయా ప్రాంతాల్లో ఉండే కోట ద్వారాల వద్ద సైనికులు నిలబడి, వచ్చే పోయే వారిని పరిశీలిస్తుంటారు.
కోట గోడకు అవతల పహాడీ అనే చిన్న పల్లె ఒకటి ఉండేది. పహాడీలో త్రాగు నీటి ఎద్దడి అధికంగా ఉండేది. అక్కడి ప్రజలంతా త్రాగునీటి కోసం కోట లోపల ఉన్న బావిపైనే ఆధారపడేవాళ్ళు. ఆ చుట్టు ప్రక్కల పాతగోడ పూర్తిగా శిధిలం అయి ఉండటంతో, ఇన్నాళ్ళూ కోటలోకి వచ్చి పోయేందుకు అది ఊరి జనాలకు బాగా అనువుగా ఉండేది. కూలిన ఆ గోడ గుండానే ప్రజలు కోటలోకి వచ్చి నీళ్లను తీసుకెళ్లేవారు. అయితే ఇప్పుడు ఆ వీలు లేదు- ఎత్తైన కోట గోడలు ఊరివాళ్ళను, కోటను వేరు చేయసాగాయి. వాళ్ళు ఇప్పుడు తమ ఇష్టం వచ్చినట్లు లోనికి-బయటికి తిరిగే వీలు లేదు..
ఆరోజు సాయంత్రం కోట ద్వారాలు మూసి వేస్తున్న సమయానికి, పహాడీలో నివసించే ఒక యువతి, ఖాళీ బిందెని ఒకదాన్ని పట్టుకొని పరుగు పరుగున కోటలోనికి రాబోయింది. బరువైన కోట తలుపులను సైనికులు ఆ సరికే కదిల్పి ఉన్నారు- వాటిని మరునాటి ఉదయం వరకూ ఇక తెరువరు. సైనికుడు ఒకడు ఆమెను లోనికి పోకుండా అడ్డుకున్నాడు. ఆమె అతన్ని ప్రాధేయపడింది- "అయ్యా! కరుణించండి! ఇంట్లో ఒక్క చుక్క నీళ్ళు లేవు. కనీసం ఈ బిందెడు నీళ్ళు తీసుకుపోతే మాకు ఈరోజు వంట కుదురుతుంది. లేదంటే మేమూ, మా పిల్లాడూ దాహానికి మాడాల్సిందే. దయచేసి లోనికి పోనివ్వండి- ఒక్క క్షణంలో తిరిగి వచ్చేస్తాను" అని.
"చూడమ్మా! నియమాలు నియమాలే. నిన్ను లోనికి పోనివ్వగలం. కానీ కోట తలుపులు మూసే సమయం అయిపోయింది. ఇప్పుడు తలుపులు మూసేశామంటే ఇక మేమెవ్వరం ఉండం. రేపు తెల్లవారు జామున మళ్ళీ వచ్చి తలుపులు తెరుస్తాం. నువ్వు నీళ్ళు తీసుకొని వెనక్కి ఎట్లా వస్తావు? కుదరదు. అందుకని, మా మాట విని వెనక్కి వెళ్ళిపో. నీళ్ళు రేపు ఉదయాన్న తెచ్చుకోవచ్చులే" అన్నారు.
ఆమె పట్టు వదల్లేదు. "నన్ను ఇప్పుడు లోనికైతే పోనివ్వండి- బయటికి వచ్చేది మళ్ళీ చూసుకుందాం" అని ప్రాధేయపడింది సైనికులను. సైనికులు ఆమెని కోటలోపలికి రానిచ్చి, ద్వారాలు మూసి, తమ దారిన తాము వెళ్ళారు.
మరునాడూ ఇలాగే జరిగింది. సరిగ్గా వీళ్ళు ద్వారం మూసే సమయానికి ఆమె రావటం, కోటలోపలికి వెళ్ళాలని పట్టుపట్టటం, వీళ్ళు ఆమెని లోనికి వదిలి కోట తలుపులు మూసేయటం.
మూడవరోజూ ఇదే జరిగే సరికి సైనికులకు అనుమానం వచ్చింది- "రోజూ కోట ద్వారం మూసే సమయానికి ఈమె లోనికి పోతున్నదే, మరి బయటికి ఎలా వస్తున్నది?" వెంటనే వాళ్ళు ఆమెని బంధించి రాజుగారి ముందు ప్రవేశ పెట్టారు. "మహా ప్రభూ! ఈ యువతి మూడు రోజులుగా ప్రతిరోజూ సాయంత్రం కోట ద్వారాలు మూసేసే సమయానికి లోనికి పోతున్నది. బయటికి ఎలా వస్తున్నదో తెలీటం లేదు ప్రభూ. ఇందులో ఏదో మోసం ఉన్నది. తమరు ఈమెను విచారించాలి" అని.
రాజుగారు ఆమెని అడిగారు: "ఏం తల్లీ! కోటలోకి ఎందుకు వస్తున్నావు, రోజూ?"
"మా ఊరు పహాడీలో నీళ్ళు లేవు ప్రభూ! మా ఊరివాళ్లం అందరం కోటలోని బావి నీళ్ళనే వాడతాం"
"మరి రోజూ ఆలస్యంగా ఎందుకు వస్తున్నావు?"
"నాకో చిన్న కొడుకు ఉన్నాడు ప్రభూ. పాలు త్రాగే పసిబిడ్డ. ఏ రోజునైనా వాడు నిద్రపోయేంత వరకూ నేను బయటికి రావటం కుదరదు"
"మరి నువ్వు లేకుండా వాడు రాత్రంతా ఎలా ఉంటాడు?"
"ఉండడు ప్రభూ! అందుకనే నేను నీళ్ళు తోడుకున్న వెంటనే గబగబా మళ్ళీ ఇల్లు చేరుకుంటాను"
"ఎట్లా వెళ్తావు, కోట ద్వారం మూసేసి ఉంటుంది గదా?"
"అది కొంచెం సమస్యే ప్రభూ" కొంచెం చిన్నబోయిందామె. తిరిగి చెప్పింది- "అందుకనే నేను గోడ దూకి ఇల్లు చేరుకుంటాను రోజూ"
రాజుగారు ఆశ్చర్యపోయారు- "గోడ దూకుతావా? ఎలాగ? ఇంత పెద్ద గోడను నువ్వు ఎట్లా దూకుతున్నావు? గోడకు ఎక్కడైనా రంధ్రం ఉందా?"
"గోడకు రంధ్రం ఏమీ లేదు ప్రభూ! కానీ తన బిడ్డను కలవగోరే తల్లిని ఏ కోటగోడలు మటుకు ఆపుతాయి?" కొంచెం తీవ్రంగానే అడిగింది ఆ యువతి.
రాజుగారు ఒక్క క్షణం నిర్ఘాంతపోయారు. ఆపైన ఆమెను విడుదల చేసి, "నువ్వు వెళ్ళచ్చు" అన్నారు. "-కానీ నువ్వు గోడను ఎట్లా దూకుతావో చూడాలని ఉంది నాకు"
రాజుగారు, పరివారం చూస్తుండగా ఆమె కొత్తగా కట్టిన గోడను అవలీలగా ఎక్కి అవతలి వైపుకు దూకింది. దూకేందుకు మరి ఆమె దగ్గర మరే ఇతర సాధనాలూ లేవు!
"ప్రభూ! గోడ ఎత్తును ఏమైనా పెంచుదామంటారా..?" రాజశిల్పి అడిగాడు ముఖం చిన్న బుచ్చుకుని. "-ఏమీ అవసరం లేదు. ముందు ఆ తల్లిని అభినందిస్తూ మా తరపున ప్రత్యేక బహుమానాన్ని పంపండి. ఆవిడ నా కళ్ళకు కమ్మిన పొరను తొలగించింది" అన్నారు రాజుగారు చిరునవ్వుతో.
అటుపైన ఆయన రెట్టించిన ఉత్సాహంతో పని చేశారు. కోటగోడలకు అవతల ఉన్న గ్రామాలన్నిటి నీటి సమస్యలూ తీరేటట్లు ఊరూరా బావులు త్రవ్వించారు; చెరువుల నిర్మాణం చేపట్టారు.
కోట గోడకు ద్వారాలున్న చోటునల్లా సైనికులు ఇరవైనాలుగు గంటలూ కాపలా ఉండేట్లు, ప్రజలకు- ప్రత్యేకించి తల్లులకు- ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా ప్రవర్తించేట్లు ఆదేశాలు జారీ చేశారు!