అనగనగా ఒక దేశము. ఆ దేశములో ఒక వూరు. ఆ ఊరిలో ఇద్దరు మిత్రులు. వాళ్ళు ఎప్పడు చాలా మంచిగా ఆలోచిస్తుంటారు.
ఒకసారి వాళ్ళు ఇలా అనుకున్నారు- "మనం మనుషులం గనక, మన కష్టాలను, బాధలను ఇతరులతో పంచుకోగల్గు-తున్నాం. అయితే ఆ అవకాశం ఇతర ప్రాణులకు వేటికీ లేదు కదా? ఉదాహరణకు, చెట్లని మనం ఎంత బాధ పెడుతున్నాం, ఒకసారి ఆలోచించండి- అయినా అవి తమ కష్టాలను వేరే ఎవ్వరితోటీ చెప్పుకోలేకపోతున్నాయి- చూశారా? కాబట్టి మనం చెట్ల కోసం ఏదైనా చెయ్యాలి!" అని.
ఇంక ఆనాడు మొదలుకొని రాత్రనక, పగలనక కష్టపడి చెట్లతో మాట్లాడే యంత్రాన్ని ఒకదాన్ని కనుగొన్నారు వాళ్ళిద్దరూ. ఒకసారి అది తయారవ్వగానే వాళ్లకు చాలా సంతోషం వేసింది. ఆ యంత్రాన్ని పరీక్షించటం కోసమని అడవి వైపుకు వెళ్లారు. అంతలోనే ఆ యంత్రం పనిచెయ్యటం మొదలుపెట్టింది!
ఆ సమయానికి అక్కడ వున్న చెట్లన్నీ ఏదో సమావేశంలో ఉన్నట్లు అనిపించింది- అన్నీ వేటికవి ఒకేసారి మాట్లాడటం మొదలు పెట్టాయి. వాటి సంభాషణని యంత్రం పూర్తిగా తెలుగులోకి తర్జుమా చేస్తోంది!
"ఈ మనుషులందరూ మనల్ని నాశనం చేస్తున్నారు. ఇంక లాభం లేదు. మనం అందరం కలిసి ఎలాగైనా వీళ్లకి బుద్ధి చెప్పాలి. మనకు ఎక్కువ సమయం కూడా లేదు. రెండు మూడు రోజుల్లో ఏదో ఒకటి తేల్చాల్సిందే' అనుకుంటున్నాయవి! ఈ మాటలను వింటున్న మిత్రులు ఇద్దరూ నిర్ఘాంత పోయారు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు వాళ్ళకు. కొద్దిసేపు మౌనంగా ఉండి, ఆ తర్వాత వెంటనే యంత్రం ద్వారా చెట్లతోటి మాట్లాడటం మొదలు పెట్టారు పిల్లలు: "చెట్లూ! భయపడకండి! మేము మనుషులం- మేం తయారు చేసిన ఈ యంత్రం ద్వారా మీతో మాట్లాడుతున్నాం- అర్థం అయ్యిందా? మీ మాటల్ని మేము ఈ యంత్రం ద్వారా విన్నాం. నిజమే- మీరు చెప్పింది ముమ్మాటికీ సరైనదే- మనుషులు నిర్దాక్షిణ్యంగా మిమ్మల్ని హింసిస్తున్నారు. చెట్లను నరికివేస్తున్నారు.
కానీ మీరు అనుకుంటున్న దానిలో ఒక చిన్న తప్పు ఉన్నది- గమనించండి. భూమి మీద నివసించే మనుషులు అందరూ మిమ్మల్ని నరికి వేయటం లేదు! కొందరు మిమ్మల్ని ప్రేమించేవాళ్ళూ ఉన్నారు. ఎవరో కొందరు మనుషులు చేసిన తప్పుకు అందరినీ శిక్షించటం న్యాయమా, మీరే ఆలోచించండి.
మిమ్మల్ని తెగనరికి తమ అవసరాలు తీర్చుకోనేవారే కాదు, ఈ భూమి మీద చెట్లను ప్రేమించి వాటికోసం తమ ప్రాణాలను పణంగా పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. మీ ఆలోచనల్లో వారికి కొంత స్థానం కల్పించండి. మనుషులందరినీ శిక్షించకండి".
"మీరే మనుషులకి జీవనాధారం. మీరు వదిలే ఆక్సిజన్ వల్లనే మనుషులు బ్రతుక గల్గుతున్నారు. మీరు ఇచ్చే పండ్లు, కూరలు, కాయలు, పూలు- ఇవన్నీ మనుషులకు ఆహారాలు. మీ వల్ల కురిసే వర్షాలు మనుషులు త్రాగే నీటికి ఆధారాలు. మీరిచ్చే కలప, వంట చెరుకు, ఔషధాలు లేకపోతే మనుషుల మనుగడ లేదు- ఈ సంగతులు అందరికీ తెలుసు.
అయితే మీకు తెలియాల్సిన రహస్యం ఒకటి ఉన్నది- మనుషులు మీకు జీవనాధారాలు! మీకు కావలసిన కార్బన్ డై ఆక్సైడును మనిషి మీకు అందిస్తున్నాడు. అది మీరు బ్రతకడానికి ఎంతో అవసరం, తెలుసా?
అంతే కాదు- మీరు చిన్నగా ఉన్నప్పుడు మనుషులు మీకు నీరు, ఎరువు తెచ్చి ఇచ్చి కాపాడుతున్నారు. మీరు బలంగా ఎదిగేందుకు దోహదం చేస్తున్నారు. కాబట్టి మమ్మల్ని మన్నించండి. మనుషులందరి గురించీ చెడుగా అనుకోవద్దండి".
"మేం ఇద్దరమూ పెద్ద అయిన తరువాత ఈ భూమి మీద నివసించే మనుషులందరికీ చెట్ల విలువను తెలియజేస్తాం. ప్రజలందరిలోనూ చైతన్యాన్ని రేపి, మీకు రక్షణ చేకూరేలా చేస్తాం- ఇదే మా ప్రతిజ్ఞ".
వాళ్ల మాటలు విని కొద్ది చెట్లు కొమ్మలు గలగలలాడించి మెచ్చుకున్నాయి. "అవును మీరు చెబుతున్నది నిజమే" అన్నాయి. అక్కడ సమావేశమైన చెట్లన్నీ తమ అభిప్రాయాలను సవరించుకున్నాయి- "మీరు పెద్దయ్యే వరకూ మేం కోపం తెచ్చుకోంలేండి. మిమ్మల్ని అర్థం చేసుకుంటాం" అన్నాయి.
మిత్రులిద్దరూ ఈ సంగతిని అందరికీ చెప్పేందుకు బయలుదేరారు గబగబా.