అనగనగా ఒక అడవి. ఆ అడవిలో నివసించే చిలుక, పావురం ప్రాణమిత్రులు- ఎప్పుడూ కలసి మెలసి ఉండేవి. ఒకదాని కష్ట సుఖాల్లో ఒకటి పాలు పంచుకునేవి. వాటి స్నేహం చూసి అడవి జంతువులు అన్నీ ఆశ్చర్య పోయేవి. చాలా వరకు సంతోషించేవి. కొన్ని మటుకు అసూయ పడేవి.

అన్నింటికంటే ఎక్కువ అసూయపడేది నక్క. వాళ్ళని విడదీయాలనుకునేది. కానీ ప్రాణమిత్రులు కదా, వాటిని విడదీసేదెలాగ? అందుకని అది ఒక క్రమం ప్రకారం పావురం గురించి చిలుకకు, చిలుక గురించి పావురానికి చెడ్డగా చెప్పటం మొదలు పెట్టింది.
రాను రాను చిలుక పావురం దాని వలలో పడటం మొదలు పెట్టాయి. అది చెప్పే అబద్ధాలనే నిజాలనుకోసాగాయి. కొంచెం కొంచెంగా ఒకదానికొకటి దూరమయ్యాయి.

అయినా కూడా నక్క మనసు నిండలేదు. అది సంతృప్తి పడలేదు. ఒకరి గురించి ఒకరికి చాడీలు చెప్తూనే పోయింది.

అతి అన్నిచోట్లా అనర్ధదాయకమే కదా, ఒకరోజున తన గురించి చిలుకకు చెడ్డగా చెప్తుంటే విన్నది పావురం. నక్క అటు వెళ్లగానే చిలుకని కలుసుకొని జరిగిన కథ అంతా చెప్పింది. మిత్రులిద్దరూ మళ్ళీ ఒక్కటయ్యాయి. నక్క ఎవరికి ఏం చెప్పిందో పంచుకున్నాయి. ఇదంతా నక్క జిత్తులేనని అర్థం చేసుకున్నాయి. దాంతో నక్క పన్నాగం విఫలమయింది.

అయినా అది తన ప్రయత్నాన్ని మానలేదు. ఎప్పటిలాగే రెండింటికీ ఒకదానిమీద ఒకదానికి చాడీలు చెప్పసాగింది. ఒక రోజున స్నేహితులు రెండూ కలుసుకొని, "ఎంత చెప్పినా ఈ నక్క మనల్ని విడదీయాలనే చూస్తున్నదే! దీని పని పట్టేదెలాగ?" అని ఆలోచించాయి. చివరికి రెండూ కలిసి సింహరాజు దగ్గరికి వెళ్ళాయి.

"రండి రండి! మీ స్నేహం గురించి నాకు అందరూ చెప్పారు. మీరు మన అడవికే ఆదర్శం!" అన్నది సింహం, వాళ్ళని కూర్చోబెడుతూ.

"మా స్నేహాన్ని చెడగొట్టేందుకు ఓ నక్క జిత్తులు పన్నుతూ పోతున్నది. తమరు దాన్ని మందలించకపోతే మా పని ఇంతటితో సరి అవుతుంది"అని చిలుక, పావురం తమకొచ్చిన కష్టాన్ని విన్నవించుకున్నాయి సింహానికి.

"బాగుంది బాగుంది! మేం నక్కను పిలిచి మందలించవచ్చు; కానీ అది తన ప్రయత్నాలు మానుకోవాలంటే పదిమంది ఎదుటా దాని పన్నాగాలను బయట పెట్టటం అవసరం!" అన్నది సింహరాజు ఆలోచిస్తూ.

"తమరు ఎలా చెబితే అలా చేస్తాం" అన్నాయి రెండూనూ. "సరే, ముందు మీరు దాన్ని మాయ చేసి నా దగ్గరకు తేవాలి-" అని సింహం వాటికి ఒక ఉపాయం చెప్పింది. దాన్ని వినగానే మిత్రుల ముఖాలు వికసించాయి.

ఆనాటినుండీ చిలుక-పావురం రెండూ ఇంకా ఎడముఖం-పెడముఖంగా ఉండటం మొదలు పెట్టాయి. నక్క ఎదుట పడగానే చిలుక మీద చిందులు తొక్కింది పావురం. నక్క కదిలించగానే పావురం మీద ఇంతెత్తున లేచింది చిలుక. నక్కకు చాలా సంతోషం అయ్యింది. "పావురం నిన్ను చంపమన్నది" అని చిలుకకు చెప్పిందది. "చిలుక నిన్ను చంపమన్నది" అని పావురానికి చెప్పింది.

పావురం దానితో- "పద, ఈ సంగతి సింహానికి చెబుదాం. చిలుకకి అదే తగిన శాస్తి. రాజుగారు దండిస్తే తప్ప దానికి బుద్ధి రాదు" అన్నది. "అవును-అంతే" అన్నది నక్క. తన మాయలు ఫలించాయని దానికి చాలా సంతోషం వేసింది. పావురాన్ని వెంటబెట్టుకొని సింహం దగ్గరకు వెళ్ళిందది.

నక్క-పావురం చెప్పిన దాన్ని విని, సింహరాజుగారు తలాడించారు. "చిలుకను ఈడ్చుకు రండి" అని సైనికులకు కనుసైగ చేశారు. వాళ్ళు అక్కడే ఉన్న చిలుకను సింహరాజుగారి ముందు ప్రవేశపెట్టారు.

అంతే- పావురం, చిలుక రెండూ ఒకటయిపోయాయి. నక్క తమకు చేసిన ద్రోహాన్నంతా నక్క ముందే సింహరాజుకు విన్నవించుకున్నాయి.

పరిస్థితి తనకు ఇలా ఎదురు తిరుగుతుందని ఊహించని నక్క భయంతో వణికి పోయింది. సింహరాజు కోపంతో ఊగిపోయింది.

నక్క భయపడి "నన్ను ఏమీ చేయవద్దు- ఇలాంటి తప్పులు ఇక చేయను" అని ప్రాధేయపడింది. అయినా వినకుండా నక్క మీదికి దూకింది సింహం.

వెంటనే పావురం, చిలుక దానికి అడ్డుగా నిలబడి "సింహరాజా! ఇదొక్క అవకాశం ఇవ్వండి- ఈ తర్వాత కూడా నక్క మారకపోతే, అప్పుడు చంపేయండి దాన్ని. ఇప్పటికి మాత్రం ఏదైనా ఒక చిన్న శిక్షతో సరిపుచ్చండి" అని వేడుకున్నాయి. సింహం నక్కను క్షమించి వదిలివేసింది. తన తప్పును తెలుసుకొన్న నక్క మంచిగా మారిపోయింది.