పూర్వకాలంలో మన దేశాన్ని 'ఉత్తానపాదుడు' అనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు సునీతి, సురుచి అని ఇద్దరు భార్యలు. పెద్ద రాణి సునీతి చాలా సౌమ్యురాలు; దైవభక్తి ఉన్నదీనీ. ఆమె కొడుకు ధృవుడు. వాడు చాలా మంచివాడు; తెలివైనవాడు; అభిమాన ధనుడు.
చిన్న రాణి సురుచేమో అందంగా ఉండేది. రాజుగారికి చిన్న భార్య సురుచి అంటే ఎక్కువ ప్రేమ. రాజ్యంలోనూ, వ్యవహారాల్లోనూ పెత్తనం అంతా ఆమెదే. ఆమె దురుసుతనం చూసి రాజు కూడా ఆమెను ఎదిరించలేక పోయేవాడు. ఆమె కొడుకు పేరు 'ఉత్తముడు'.
ధృవుడు అప్పటికి ఐదేళ్ల పిల్లవాడు. అయినాగానీ తన చుట్టూ జరుగుతున్న అన్యాయాన్ని వాడు కూడా పసిగట్టాడు. తన తల్లి పట్టపురాణి. అయినా ఆమెకు గౌరవం లేదు. తండ్రి, పినతల్లి ఇద్దరూ ఆమెను దాసి కన్నా చులకనగా చూస్తున్నారు. శాంతం, ఓరిమి గల తల్లి ఆ అవమానాన్నంతా సహిస్తూ, లోలోపలే బాధపడుతున్నది.
ఒకనాడు రాజుగారు అంతఃపురంలో సింహాసనంమీద కూర్చుని, ఉత్తముణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దాడుతున్నాడు. అంతలో అటువైపుగా వచ్చాడు ధృవుడు. తండ్రి దగ్గరకు వెళ్లి 'నేను కూడా నీ ఒళ్ళో కూర్చుంటాను' అని అడిగాడు. అయితే చిన్న భార్య సురుచి అక్కడే ఉన్నది. రాజుగారు ధృవుణ్ని దగ్గరకు తీయలేదు- కానీ ధృవుడు తాను కూడా తండ్రి ఒడిలో కూర్చోవాలన్న పట్టుదలతో తమ్ముడిని లాగ బోయాడు.
పినతల్లి అతనిని క్రిందికి ఈడ్చి పడేసింది. "నీకు ఆ అదృష్టం లేదు. నా కడుపున పుట్టిన వాడికే ఆ స్థానం దక్కుతుంది. నీకంత కోరికగా ఉంటే, తపస్సు చేసి దేవుడిని ఉన్నత స్థానం ఇవ్వమని ప్రార్థించుకో- పో" అన్నది ఎగతాళిగా.
ఉత్తానపాదుడు ఏమీ అనలేదు. 'అది వాళ్ల సమస్య' అన్నట్లు ఉత్తముడిని నిమురుతూ కూర్చుండిపోయాడు. తండ్రి అలా మూగగా కూర్చోవటం చూసి ధృవుడికి రోషం, కోపం, ఏడుపు అన్నీ ఒక్కసారిగా వచ్చాయి. ఏడ్చుకుంటూ తల్లి దగ్గరికి వెళ్లాడు.
ఆమె మాత్రం ఏం చేయగలదు? కొడుకు బాధను చూసి ఆ తల్లి తను కూడా ఏడ్చింది.
"పిన్ని చెప్పింది నిజమే నాయనా! నువ్వు నా కడుపున పుట్టటం వల్లనే ఇదంతా. నువ్వే గనక ఆమె కడుపున పుట్టి ఉంటే, ఇంత అవమానం జరిగేదా? అశక్తురాలి కడుపున ఎందుకు పుట్టావు బాబూ? ఆమె చెప్పినట్లు నీకు ఇక ఆ దేవుడే తప్ప మరో దిక్కులేదు. ఏం చేయాలన్నా ఇక ఆ భగవంతుడిని ప్రార్థించటమే నాయనా!" అని బాధపడింది.
ధృవుడి పసి మనసు ఆ దెబ్బకు నిశ్చేష్టం అయిపోయింది. "ఎంత కష్టమైనా సరే- తపస్సు చేస్తాను. మా అమ్మకు ఉన్నత స్థానం దక్కేలా చేయమని ఆ దేవుడినే అడుగుతాను. దేవుడు కనబడే వరకూ ఇక వెనక్కి తిరిగి రాను" అని నిశ్చయించుకొని, ఐదేళ్ళ ఆ పసివాడు అడవి దారిన బయలుదేరాడు.
పట్టుదల కొద్దీ బయలుదేరనైతే బయలుదేరాడుగానీ, ఐదేళ్ళ పిల్లాడికి తపస్సు గురించి ఏం తెలుస్తుంది పాపం? దారిలో వాడికి నారదమహర్షి ఎదురయ్యాడు. "ఇంత చిన్న పిల్లవాడివి, అడవి దారిన ఎందుకు వెళుతున్నావు నాయనా?!" అని అడిగాడు. నారదుడు చాలా మహత్తులున్న దేవఋషి.
ధృవుడు తన సమస్యను వివరించి, "విష్ణుమూర్తిని గురించి తపస్సు చేద్దామని వెళ్తున్నాను" అన్నాడు. "అయ్యో, అది అంత సులభం కాదు బాబూ! ఇంత చిన్న పిల్లవాడికి అది సాధ్యం కాదసలు. జరిగింది మర్చిపో నాయనా! కొంతకాలానికి పరిస్థితులు చక్కబడ-తాయిలే" అన్నాడు నారదుడు బుజ్జగిస్తున్నట్లు. కానీ ధృవుడు తన పట్టుదలను వదల్లేదు. ధృవుడి మనోధైర్యాన్ని మెచ్చుకున్న నారదుడు "నాయనా! తపస్సు అంటేనే నిశ్చలమైన మనసుతో తపించటం. స్థిరంగా తపిస్తే ఫలితం తప్పక కలుగుతుంది. ఇదిగో, స్థిర చిత్తంతో ఈ నారాయణ మంత్రాన్ని జపిస్తూ పో. నీకు మేలు కలుగుతుంది" అని
నారాయణ మంత్రాన్ని ఉపదేశించి, తపస్సు ఎలా చెయ్యాలో నేర్పాడు. అడవిలోకి వెళ్లిన ధృవుడు తన లక్ష్యం నెరవేరడానికి తగిన ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. శరీరాన్ని, మనస్సును తపస్సుకు అనుగుణంగా తయారు చేసుకున్నాడు. మొదటి నెలలో మూడు రోజులకు ఒకసారి- పళ్లు మాత్రం- తింటూ ధ్యానం మొదలుపెట్టాడు. రెండోనెలలో ఆరు రోజులకు ఒకసారి- ఆకులు మాత్రం తిన్నాడు. మూడో నెలలో తొమ్మిది రోజులకొకసారి- మంచినీళ్ళు మాత్రమే తాగుతూ తపస్సు కొనసాగించాడు. ఇక నాలుగో నెల వచ్చే సరికి కేవలం గాలిని మాత్రమే పీల్చుకుంటూ కదలకుండా తపస్సు చేశాడు. ఐదవ నెల వచ్చేసరికి అతని శ్వాస కూడా ఆగిపోయింది! ఆరో నెలలో అతను కాలి బొటనవేలిపైన నిలబడి, మనస్సునిండా శ్రీహరిని నింపుకున్నాడు. గొప్ప గొప్ప యోగులకు, దేవతలకు కూడా అలాంటి తపస్సు సాధ్యం కాదట! అంత నిష్కల్మషమైన మనసు వేరే ఎవ్వరికీ లేదట! చివరికి ఆ భగవంతుడు ఇక ఆగలేకపోయాడు- ధృవుడికి ప్రత్యక్షం అయి, ఏం వరం కావాలో కోరుకొమ్మన్నాడు.
అంత కాలం పాటు మౌనంలో ఉండిపోయిన ధృవుడికి ఏం కోరాలో కూడా అర్థం కాలేదు. చివరికి విష్ణువే "నీకు, నీ తల్లికి అత్యున్నత స్థానం లభిస్తుంది. నువ్వు చాలా కాలం ఈ భరతవర్షాన్ని పరిపాలించి, అటుపైన నక్షత్రమండలంలో శాశ్వత స్థానాన్ని పొందగలవు" అని ఆశీర్వదించి అదృశ్యం అయిపోయాడు.
ఇక ధృవుడు అడవులకు వెళ్ళిన తర్వాత, అక్కడ రాజు ఉత్తానపాదుడిలోనూ, చిన్న రాణి సురుచిలో కూడానూ చాలా మార్పు వచ్చింది. 'పిల్లవాడి మనసుకు అంత గాయం చేశామే, ఉత్తమురాలైన సునీతిని నిర్లక్ష్యం చేశామే' అని పశ్చాత్తాపం మొదలైంది. ధృవుడి కోసం మనుషులని పంపి ఎంత వెతికించినా వాడు ఎక్కడా కనిపించలేదు.
అయితే వాడి తపస్సు ఫలించిందనీ, విష్ణువునుండి వరాలను పొంది తిరిగి వస్తున్నాడనీ తెలియగానే రాజుగారు ఎదురువెళ్ళి ధృవుడిని రాజ్యానికి తీసుకొని వచ్చారు. వాడినీ, తల్లి సునీతిని కూడా అందరూ చాలా ప్రేమగా, అభిమానంగా చూసుకున్నారు.
తండ్రి తర్వాత భరతవర్షానికి ధృవుడు రాజై, అనేక సంవత్సరాలు దక్షతతో పరిపాలించాడు. తమ్ముడు ఉత్తముడిని ఎవరో యక్షులు ఎత్తుకెళ్తే, వారి మీద దండెత్తి, వాళ్ళ రాజు తుంబురుడిని ఓడించి, తమ్ముడిని కాపాడుకున్నాడు.
తర్వాత నక్షత్ర మండలాన్ని చేరుకుని, ధృవతారగా శాశ్వతంగా వెలుగుతూ, ప్రతి రోజూ సూర్యుని కంటే ముందుగా తానే లోకానికి కాంతిని ప్రసాదిస్తూ, తల్లిని పూజించిన వారికి లభించే ఉన్నత పదవికి సాక్షిగా, మనందరికీ దిశానిర్దేశం చేస్తున్నాడు ధృవుడు.