కుడంకులం అణువిద్యుత్ కేంద్రం

తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో నిర్మించబడుతున్న కుడంకులం అణువిద్యుత్కేంద్రం 'నీటి ఒత్తిడితో పనిచేసే తేలికరకం రియాక్టర్ నమూనా'(యల్ డబ్ల్యు ఆర్ సాంకేతికత)లో మొదటిది. ఈ అధునాతన రష్యన్ సాంకేతికతతో తయారవుతున్న అణువిద్యుత్కేంద్ర నిర్మాణం 2002 లోనే మొదలయినప్పటికీ, దానికి వ్యతిరేకంగా అనేక ప్రజా సంఘాలు, సంస్థలు చేపట్టిన అణువ్యతిరేక ఉద్యమాల కారణంగా ముందుకు సాగలేక పోయింది.

భద్రత గురించిన అనేక అనుమానాలు, ఆరోపణల మధ్య ఈ కేంద్రపు మొదటి రియాక్టర్ 2013జులైలో పని ప్రారంభించింది. దీని నిర్మాణానికి 18,000 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా.

సర్దార్ సరోవర్ ఆనకట్ట

మన దేశంలో అన్ని నదులూ తూర్పు దిక్కుకు ప్రవహిస్తుంటే, నర్మద-తపతి అనే రెండు నదులు మాత్రం పడమటి దిక్కుకు ప్రవహిస్తున్నాయి. వీటిలో నర్మద నది మీద కడుతున్న 30 ఆనకట్టల్లో అతి పెద్దది, సర్దార్ సరోవర్ ఆనకట్ట. గుజరాత్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లోని మొత్తం 18,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి నీరు అందించగల ఈ ఆనకట్ట ఎత్తు మొదట్లో 80మీ. ఉంచాలనుకున్నారు. తర్వాత ఆ ఎత్తును పెంచి పెంచి, ప్రస్తుతం పునాదులనుండి 163మీ. ఉంచబోతున్నారు. అలా ప్రపంచంలోని అతి పెద్ద కాంక్రీటు ఆనకట్టల్లో ఇది రెండవది కానున్నది.

ఆనకట్ట ఎత్తును పెంచిన కొద్దీ రిజర్వాయరులోని నీళ్ళు మరిన్ని ప్రాంతాలను ముంచివేస్తాయి. సర్దార్ సరోవర్ ఎత్తు పెంపు వల్ల ఆ విధంగా అనేక లక్షల ఎకరాల కొండలు, అటవీభూములు, గ్రామాలు పూర్తిగా మునిగిపోనున్నాయి. ఆయా గ్రామాల ప్రజలకు ప్రభుత్వం వారు వేరే ప్రాంతాల్లో భూములు, ఇళ్ళు, ఇతర వసతులు కల్పించి పునరావాసం కల్పిస్తామని హామీలైతే ఇచ్చారు కానీ, మేధాపట్కర్, అరుంధతీ రాయ్ వంటి పర్యావరణ వాదులు ఈ సందర్భంగా అనేక ప్రశ్నల్ని లేవనెత్తి, మన సుప్రీం కోర్టుతో సహా అనేక జాతీయ అంతర్జాతీయ న్యాయస్థానాలను కదిల్చివేశారు. పెద్ద ఆనకట్టల నిర్మాణం పరంగా వారు లేవనెత్తిన ప్రశ్నలు- ముఖ్యంగా ఆ కట్టడాల భద్రత, పర్యావరణ వినాశనం, స్థానిక ప్రజల జీవించే హక్కు, సంస్కృతీ విచ్ఛిన్నత వంటివి, ఈనాటికీ సమాధానం లేని శేష ప్రశ్నలుగా మిగిలి సభ్య సమాజాన్ని నిలదీస్తున్నాయి. ఈ క్రమంలోనే సర్దార్ సరోవర్ నిర్మాణం మరింత ముందుకెళ్తోంది, రిజర్వాయర్లోని జలాలు కాలువల ద్వారా మరిన్ని ప్రాంతాలకు చేరుకొని గుజరాత్ నాయకులకు ఓట్ల పంటను కురిపిస్తూనే ఉన్నాయి.

నోబెల్ ప్రైజు

స్వీడన్ దేశస్థుడైన ఆల్‌ఫ్రెడ్ నోబెల్ (1833-1896) రసాయన శాస్త్రంలోనూ, ఇంజనీరింగులోనూ గొప్ప ప్రతిభకలవాడు. అతని ఆవిష్కరణల్లో ఒకటైన 'డైనమైటు' అనే ప్రేలుడు పదార్థం అతనికి ఎక్కడలేని డబ్బునూ సంపాదించి పెట్టింది. చివరికి చనిపోయేనాటికి ఆల్‌ఫ్రెడ్ ఆస్తి, (2008 ధరల్లో) సుమారు 180 మిలియన్ డాలర్లట! ఆ రోజుల్లో డైనమైటును అనేకమంది హంతకులు మందుగుండుగా వాడుకునేవారు. ఆల్‌ఫ్రెడ్ నోబెల్ సోదరుడు లుడ్విగ్ 1888లో చనిపోయే సమయానికి, చాలామంది ఇతనే చనిపోయాడనుకున్నారు. 'మరణపు వ్యాపారి మృతి' అంటూ ఫ్రెంచి పత్రికలు వార్తలు కూడా రాసాయట! అవి చదివాక ఆల్‌ఫ్రెడ్‌ ఆలోచనల్లో మార్పు వచ్చింది. తన వ్యాపారంలోని అనైతికతకు అతడు కొంచెం నొచ్చుకున్నట్లు తోస్తుంది.

అందువల్లనే కావచ్చు, చనిపోయే ముందు అతను తన యావదాస్తినీ పెట్టుబడిగా ఉంచి, దానిపై వచ్చే వడ్డీని ఏ ఏటికాయేడు 'భౌతిక శాస్త్రం; రసాయన శాస్త్రం; వైద్య శాస్త్రం; సాహిత్యం; ప్రపంచ శాంతి'- అనే ఐదు రంగాల్లోనూ మానవాళి శ్రేయస్సుకోసం విశేష కృషి చేసిన వారికి బహుమతిగా ఇవ్వాలని నిర్దేశించాడు.

ఈసారి నోబెల్ శాంతి బహుమతికై పదిహేడు సంవత్సరాల పాకిస్తాన్ యువకెరటం 'మలాలా యూసుఫ్‌జాయ్', మన దేశంలో బాలల హక్కుల కోసం విశేష కృషి చేసిన 'కైలాష్ సత్యార్థి' ఎంపికయ్యారు. నోబెల్ కమిటీతో సహా అనేక అంతర్జాతీయ సంస్థల గుర్తింపువల్ల వీరి కృషికి మరింత ప్రామాణికత లభించనున్నది. బాలల హక్కుల ఉద్యమానికి ఇది గొప్ప చేయూత కానున్నది కూడాను.