జాన్ గుటెన్‌బర్గ్ ముద్రణ యంత్రాన్ని కనుగొనక ముందు, ప్రపంచంలో పుస్తకాలన్నిటినీ చేత్తోటే రాయాల్సి వచ్చేది. పెద్ద పెద్ద రాజులు, చక్రవర్తులు తమకు నచ్చిన గ్రంధాలను 'వ్రాయసగాళ్ళ' చేత చేత్తో రాయించి, ఆ వ్రాత ప్రతుల్నే తమకు నచ్చిన వాళ్ళకు బహుమతులుగా ఇస్తుండేవాళ్ళు. అయితే ఒకసారి ముద్రణ యంత్రాలు తయారవ్వటం మొదలెట్టాక, అవి ఇంక అన్ని దేశాలలోకీ మెరుపువేగంతో చొచ్చుకొని పోయాయి.

దక్షిణాఫ్రికాలో గాంధీగారు పౌరహక్కుల కోసం గొడవ మొదలుపెట్టాక, అక్కడి 'భారతీయుల్ని ఒక్క త్రాటి మీదికి తేవటం ఎలాగ' అని ఆలోచించి, చివరికి 'ఇండియన్ ఓపీనియన్' అని ఓ పత్రికను మెదలెట్టారు. దానికి సంపాదకుడు, ప్రచురణ కర్తా రెండూ గాంధీగారే. అయితే అది పూర్తిగా నష్టాల ఊబిలో కూరుకుపోయి ఉండేది. కొంతకాలం దాన్ని పైకి లాగేందుకు ప్రయత్నించిన తర్వాత గాంధీ గారికి అర్థమైంది- "పట్నంలో ఖర్చులెక్కువ- ఇక్కడ ఉంచి నడిపి, దాన్ని కాపాడే అవకాశం ఇంక లేదు" అని.

ఆ సమయానికి గాంధీగారి మిత్రులంతా కలిసి జోహాన్నెస్‌బర్గులో 'ఫీనిక్స్ ఆశ్రమం' అని ఒకదాన్ని నడిపించేవాళ్ళు: రోడ్డుకి దూరంగా, ఎక్కడో విసిరేసినట్లు ఉండేదది! తన ప్రెస్సును అక్కడికి తీసుకెళ్లాలనుకున్నాడు గాంధీ. అక్కడ ప్రెస్సుకు అవసరమైన కరెంటు లేదు; రవాణా సౌకర్యాలు అంతగాలేవు- దాంతో తెలిసిన వాళ్లంతా 'వద్దు' అన్నారు. 'అక్కడికి వెళ్తే శ్రమ మరింత ఎక్కువౌతుందమ్మా' అని చిలక్కి చెప్పినట్లు చెప్పారు.

'శ్రమ ఎక్కువైనా పర్లేదు- ఖర్చు మాత్రం తగ్గాలి' అన్నాడు గాంధీ. వాస్తవ పరిస్థితి కూడా అదే మరి! సరే, ఇంకేం చేస్తారు? అంతా కలిసి పట్నంలో ఉన్న ముద్రణశాలను, అందులోని యంత్రాలు- ఫర్నిచర్‌తో సహా- రవాణా చేసి, ఫీనిక్స్ ఆశ్రమంలో ఓ షెడ్డుకు చేర్చారు. ప్రెస్సును నడిపేందుకు ఓ పెద్ద ఆయిల్ ఇంజనును తీసుకొచ్చారు. దాన్ని ఆనుకొనే, మరో గదిలో గాంధీగారి ఆఫీసు.

ఆ శనివారం నాడు 'ఇండియన్ ఒపీనియన్'ను పోస్టు చేయాల్సి ఉందనగా, శుక్రవారం మధ్యాహ్నానికి గానీ ప్రెస్సులో అక్షరాలు కూర్చటం అవ్వలేదు. ఇక అటుపైన ఆశ్రమంలో ఉన్నవాళ్లు- ముసలీ, ముతకా, పిల్లా-పెద్ద, ఆడ-మగ అంతా పనిలోకి దిగారు. కొందరు అక్షరాలు సవరించే పని, కొందరు ముద్రించే పని- కొందరు కాయితాలను సైజుకి కత్తిరించే పని, పుస్తకాలు పిన్ చేసి, మడిచే పని, మరికొందరు అడ్రసులు రాసే పని, కొందరు మూటలు కట్టే పని- శుక్రవారం రాత్రంతా పని చేశారు అందరూ.

అనుకున్నట్లుగానే, అక్కడ ముద్రణ కూడా ఏమంత సులభంగా జరగలేదు. ఆ రోజునే ఆయిల్ ఇంజన్ పాడైంది. ఎవరు ఏం చేసినా అది నడవలేదు! దాంతో గాంధీ గారితో పాటు మరికొందరు బలం ఉన్నవాళ్ళు దాని చక్రాన్ని చెరుకురసం యంత్రాన్ని త్రిప్పినట్లు రాత్రంతా చేతులతో తిప్పుతూ ముద్రణ కొనసాగించారు!

ఇట్లా పని చేసిన వీళ్లెవరూ పత్రిక ఉద్యోగులు కారు; ఎవ్వరికీ జీతాలు లేవు! అయినా అంతా శ్రమించారు; రైలు వచ్చే సమయానికి సంచీలను రైల్వే స్టేషనుకు చేర్చారు! ఆ వారమే కాదు, తర్వాత ప్రతి వారమూ అదే పనైంది: ప్రతి శుక్రవారమూ గాంధీ గారికి జాగరణ అయ్యింది.

గాంధీగారు ఇంగ్లాండు చేరాక కూడా దక్షిణాఫ్రికా కష్టాలను మర్చిపోలేదు. ఉత్తరం రాశారు- "ఆశ్రమంలో ఉన్న ఆడవాళ్లంతా రోజూ 'ఫీనిక్స్ ప్రెస్'కి వెళ్తున్నారని ఆశిస్తాను- కనీసం శనివారం నాడైతే వెళ్తున్నారుగా? ఆదివారం నాడు పత్రికని మార్కెట్లో అందించాలి!" అని.

తర్వాత మన దేశానికి వచ్చేశాక, మరో మూడు పత్రికలు నడిపారు గాంధీగారు: 'యంగ్ ఇండియా', 'నవ జీవన్', 'హరిజన్'- ఈ మూడు పత్రికలూ ఇదే తరహాలో నడిచాయి!

ఇంత కష్టపడి పత్రికలు ఎందుకు నడపాలి? "అభిప్రాయాలను స్వేచ్ఛగా వెలువరించాలంటే, అవి వక్రీకరింపబడకుండా ఉండాలంటే, పత్రికలను మనకి మనం

నడిపించుకోవాల్సిందే! లేకపోతే కుదరదు. అవకాశం ఉంది కాబట్టి ముద్రణ శాలను వాడాం. అలాంటి అవకాశమే గనక లేకపోతే ఏం చేసేవాడిని, అన్నిటినీ వేటికవి చేత్తో రాయించి ఉండే వాడిని!" అన్నారు గాంధీగారు. అవసరమయ్యుంటే నిజంగానే అంత పనీ చేయించి ఉండేవాడు పెద్దాయన!

ఈ మాసం నుండీ కొత్తపల్లి అధికారికంగా పత్రికల ప్రపంచంలో చేరనున్నది. రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఇండియా వారు కొత్తపల్లిని తెలుగు మాస పత్రికగా గుర్తించటంతో కొత్త కొత్తపల్లి ఒకటో సంచిక- రకరకాల, మార్పులతో ఇదిగో, ఇలా మీ ముందుకొస్తున్నది.

ఎప్పటిలాగే ఆదరిస్తారని ఆశిస్తూ- కొత్తపల్లి బృందం