ఆ సంగతి తెలియగానే మొసలి భార్యకు ఒళ్ళు ఝల్లుమన్నది. అది కొంచెంసేపు మూర్ఛపోయి, తేరుకున్నది. తర్వాత భర్తమీద కారాలు మిరియాలూ నూరుతూ, ఒళ్ళు మండుతూంటే ఏంచేయాలో తోచక, పచార్లు చేస్తూ కూర్చున్నది.
ఇక అక్కడ క్రకచం కూడా చూసింది: చెలికత్తె తన దగ్గరికి రావటం, కొంతసేపు ఉండటం, తనతో ఏమీ మాటలాడకనే వెనక్కి తిరిగి పోవటం! "అది ఇంటికి వెళ్ళి తనమీద భార్యకు ఏమేం చెబుతుందో" అని దాని గుండెలు తటతటా కొట్టుకున్నాయి. ఇంక దానికి అక్కడ కాలు నిలువలేదు- త్వరత్వరగా కోతికి వీడ్కోలు చెప్పి, 'ఇంటికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో పోరాదు' అని, భార్యకు బహుమతిగా ఇచ్చేందుకు బాగా పండిన కొన్ని మేడిపండ్లను కూడా ఏరుకొని, హుటాహుటిన ఇల్లు చేరుకున్నదది.
అయితే ఆ సరికే దాని భార్యకు అది వస్తున్న సంగతి తెలిసిపోయింది. క్రకచం వచ్చేసరికి అది పడుకుంటే, చెలికత్తెలు దాని చుట్టూ చేరి దొంగ ఏడుపులు ఏడుస్తూ కూర్చొని ఉన్నాయి.
ఆ స్థితిలో భార్యను పలకరించింది క్రచకం. జవాబు రాలేదు. అది తత్తరపాటున "ఇదేంటి? ఏమైంది?" అని చెలికత్తెలను అడిగింది.
అప్పుడు ఆ స్నేహితురాళ్ళంతా కూడబలుక్కున్నట్లు "ఏం చెప్పాలి? నువ్వు 'పోయిందే పోక' అన్నట్లు పోయావు; 'ఇంట్లో భార్యకు ఏమైనా సరే' అనుకున్నావు; నెల నాళ్ళ నుండి యీ ఇంటికేసి తొంగి కూడా చూడలేదు. నువ్వు వెళ్ళిన తరువాతి రోజునుండే నీ భార్యకు తీరని రోగం ఒకటి పట్టుకున్నది; రోజు రోజుకూ ఆ రోగం ప్రబలి, ఇవాళ్ళ ఉదయం నుండి దాని మాట కూడా పడిపోయింది. ఆ రోగం మొదలైన నాటి నుండి మేమందరం రాత్రనక, పగలనక తిరిగాం; కనబడ్డవారి కాళ్ళన్నీ పట్టుకున్నాం; అయ్యే ఖర్చుకు వెనుక-ముందు చూడక, మేం మాకు చేతనైన సిద్ధ ఔషధాలను అన్నిటినీ- పోయించాం. పోసిన మందులన్నీ ఎటు పోయినాయో గాని, రోగం మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. ఆడవాళ్ళం, ఇంతకంటే ఏం చేయగలం? విసిగి పోయిన వైద్యులు చివరికి ఒక చికిత్స చెప్పారు: కోతి గుండెను సంపాదించి తెచ్చి, దాన్ని పాలతో పాటు నాలుగు రోజులు- రోజూ సాయంత్రం పూట- సేవిస్తే, రోగం పోయి ఈమె సంపూర్ణంగా ఆరోగ్యవంతురాలవుతుంది-
లేకపోతే ఇక ఆమె జోవితం పై ఆశలు వదులుకోవాల్సిందే! 'చెడగా, చెడగా కాపురాలు కావు'- మేం చెప్పాల్సింది చెప్పాం; ఇంక ఏ పాట్లు పడతావో , ఎలా నీ భార్యను బ్రతికించుకుంటావో, నీ ఇష్టం- " అన్నాయి.
క్రకచం కొంతసేపు నివ్వెరపోయి నిలబడి, ఆకాశం వైపుకు చూసి, రకరకాలుగా ఆలోచించి, తల ఊపి, ఏ విధంగా ఐనా సరే, 'పోక తప్పదు' అని నిశ్చయించుకొని, వాళ్ళ ముందు ఇక నోరు మెదల్పలేక, వెనక్కి బయలుదేరింది. పోతూ పోతూ ఆలోచించింది: "ఇంట్లో చూస్తే ఈమెది 'వచ్చే ప్రాణం- పోయే ప్రాణం' అన్నట్లున్నది. వైద్యులేమో అసాధ్యమైన వైద్యం చెప్పారు.
'సాధ్యమే' అనుకుంటే మరి- స్నేహితుడిని చంపుకోవాల్సి రావచ్చు- బలవర్థనం కాక, ఇక నాకు మరో కోతి చిక్కదు కదా? ఇక వేరే వానర హృదయాన్ని ఎక్కడనుండి తెచ్చి ఇవ్వగలను? ఇవ్వలేదనుకో- ఇంతటి అవస్థలో ఉన్న భార్యను, మందు వేయకుండా బలవంతంగా ఎట్లా చంపుకోను?
భార్యకోసం మిత్రద్రోహం చేయ్యటం న్యాయమా? కాదని ఊరుకొంటే నిష్కార-ణంగా పండంటి కాపురం కూలిపోతున్నదే! 'మిత్రుడిని చంపటం' అన్నది అన్ని అన్ని చెడ్డపనులలోకీ చెడ్డది- నిజమే, కానీ 'భార్య అన్నది నా ఆత్మలో సగం కదా!' అందువల్ల భార్యను కోల్పోవటం అన్నది ఆత్మవధ కంటే కూడా పాప కార్యం. లోకంలో 'తనను మాలిన ధర్మంలేదు' అంటారు కదా! జాగ్రత్తగా ఆలోచిస్తే, స్నేహితుడి ప్రాణాలు తీసి అయినా సరే, భార్య ప్రాణాలు కాపాడుకొని ఇంటిని నిలబెట్టుకోవటం సరైన పని అని తోస్తున్నది" అని, కోతిని చంపేందుకే నిశ్చయించుకున్నది.
అయినా పది అడుగులు ముందుకు వేయగానే అంతటి పాపానికి ఒడిగట్టుతున్నందుకు దానికి మనసొప్పలేదు. ఆ ఊగిసలాటలో దానికి కళ్ళు తిరిగినట్లయి, కొంత సేపు నిశ్చేష్టమై నిలిచి ఉండిపోయింది. చివరికి 'పాపమే కానియ్యి' అని నిశ్చయానికి వచ్చి, "బలవర్ధనుడిని చంపాల్సిందే, తప్పదు" అనుకుంటూ మేడిచెట్టు దగ్గరికి పోయింది.
అట్లా వేగంగా తిరిగి వచ్చిన మొసలిని చూసి కోతి ఆశ్చర్యపోతూ "మిత్రమా, ఆశ్చర్యం! భార్యని చూడాలని అంత ఉత్సాహంగా వెళ్ళావు కదా, వెళ్ళి ఇంకా గంట కూడా కాలేదు- అంతలోనే మళ్ళీ తిరిగి వచ్చేశావెందుకు, ఏమైంది?" అని అడిగింది.
అప్పుడా మొసలి 'హిహిహి ' అని నవ్వుతూ- 'నీ అనుమతితో మా ఇంటికి వెళ్ళి, నా భార్యను చూసి, ఆమె కోసం నువ్వు అంత ఇష్టంగా ఇచ్చిన మేడిపళ్ళను అందించానా!? దాంతో మా ఆవిడ పొంగిపోయింది. చటుక్కున కొన్ని పళ్ళు నోట్లో వేసుకొని, వాటి రుచికి నివ్వెరపోయింది!
వెంటనే మొదలు పెట్టింది: "నీకు ఈ పండ్లు ఎక్కడివి? ఇంత చక్కని పండ్లను నీకిచ్చిన ఆ పుణ్యాత్ముడు ఎవ్వడు, చెప్పు!" అన్నది.
నేను చెప్పాను: "తపతి ఒడ్డున ఓ మేడి చెట్టు ఉన్నది. దానిమీద 'బలవర్ధనం' అనే కోతి రాజు ఒకడున్నాడు. అతను గొప్ప స్నేహశీలి; దయగలవాడు. ఆ కోతిరాజు ఆదరణలో సమస్తమూ మరచి, అతనిచ్చే ఈ పళ్ళ తీపిని వదిలి రాలేక, ఇంతవరకూ అక్కడే ఉండిపోయాను.
ఆ మహానుభావుడు నాకు మెల్లగా సర్ది చెప్పి, వీడ్కోలిచ్చి, అమృతంతో సమానం అయిన యీ గొప్ప ఫలాలను ఇచ్చి, నన్ను నీ వద్దకు సాగనంపాడు కాబట్టి ఇప్పుడైనా వచ్చాను" అంటూ నీ ఉపకారాలను, మంచితనాన్ని వెయ్యి నోళ్ళ కొనియాడాను.
నీ చెల్లెలు అప్పుడు నా మీదే కోపగించు-కున్నది- "అయ్యో పనికి మాలినవాడా! కృతఘ్నుడా! అంత మంచి మనసుగల ఆ కోతి రాజును నీతో కూడా మన భవనానికి వెంటబెట్టుకొని వచ్చి, మన పాలిటి దైవం మాదిరి పూజిస్తే, కనీసం మన జన్మ అయినా సఫలమయ్యేది కదా?! అంత చిన్న పనీ రాక, ఆ మహానుభావుడిని ఒంటరిగా ఆ మొండి చెట్టుమీద దిగవిడిచి వచ్చేస్తావా?!
ఇప్పుడిక మళ్ళీ పో! పోయి, కోతి జాతికే తలమానికమైన ఆ కోతిరాజును- నా మనవిగా విన్నవించుకొని- ఇక్కడికి తీసుకురా! అంతవరకూ నాతో మాట్లాడకు!" అని నన్ను ఇక్కడికి త్రిప్పి పంపింది.
ఇప్పుడింక నువ్వు ఆలస్యం చెయ్యకు- నా ప్రార్థనను అంగీకరించి, వెంటనే మా యింటికి దయ చెయ్యాలి- తప్పదు, రా పోదాం" అని ఆ దుర్మార్గపు మొసలి తెచ్చి పెట్టుకున్న ప్రేమతో తొందరపెట్టింది.
అప్పుడా కోతి మిత్రుడి మాటకు ఎదురు చెప్పలేక, "క్రకచా! నీ ఇల్లు నాకేమైనా పరాయి ఇల్లా? నీ ఇంటికి వచ్చి మీరు చేసే సత్కారాలను పొందేందుకు నాకు ఏం అడ్డం?! అయినా కేవలం ఒక్కటంటే ఒక్క సమస్య కనిపిస్తున్నది- నేను చెట్లపైన బ్రతికే ప్రాణిని- చెట్లమీద, నేలమీద బ్రతుకగల్గుతాను తప్ప, మీరుండే నీటి మడుగుల్లో ఉండలేను కదా?! ఇంక మీ ఇంటికి ఎట్లా రమ్మంటావో చెప్పు?!" అన్నది.
"అంతమాత్రం ఆలోచించకుండానే నిన్ను పిలుచుకొని పోతానా, మా ఇల్లు నువ్వు రాలేని చోటు కాదు. మేం ఉండేది ఈ చెరువు అవతల ఉన్న లంక మధ్యలోని ఓ సుందర మందిరంలో. దాని చుట్టూ పండ్ల చెట్లు అనేకం ఉన్నాయి. ఆ దీవి అందాన్ని ఏమని వర్ణించను? అది నిజంగా భూతల స్వర్గమే. నువ్వు నాతో వచ్చి, రేపు-మర్నాడు రెండు రోజులూ మా ఇంట్లో ఉండి, మా సేవలు స్వీకరిస్తూ, ఇష్టం వచ్చినప్పుడల్లా ఆ తోటలో విహరిస్తూ ఉండవచ్చు.
దారిలో కూడా నీకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా నిన్ను నా వీపు మీద ఎక్కించుకొని, చిటికెలో మా ఇంటికి చేరుస్తాను. అక్కడ నీ చెల్లెలు నీ మీది ప్రేమతో ఏరి కోరి సేకరించిన కాయగూరలతో వండిన వంటలన్నిటినీ నీకు కానుక చేస్తాను. నీ చెల్లెలు మన రాక కోసం ఎదురు చూస్తుంటుంది. త్వరగా బయలుదేరు- పోదాం" అని తొందర పెట్టింది క్రకచం.
దాంతో ఇక కాదనలేక, చెట్టుమీదినుండి దిగి, క్రకచం వీపు పైకెక్కి కూర్చున్నది బలవర్థనం. అది అట్లా కూర్చోగానే మొసలి కాస్తా చెరువులో ఈదటం మొదలు పెట్టింది.
దారిలో అంతా "అయ్యయ్యో! ఎంత ఘోరమైన పని చేస్తున్నాను?! ఒక్క ఆడదాని కోసం ఇంత మంచి స్నేహితుడిని మోసం చేసి పాపం మూట గట్టుకుంటున్నానే?! ఇంక నా గతి ఏమౌతుందో తెలీదు.
నావంటి దుర్మార్గులు అసలు ఎక్కడైనా ఉంటారా?! దేవుడా, ఇక నేను ఎలాంటి నిందల్ని ఎదుర్కొనాల్సి వస్తుందో, ఏమో" అని తనలో తాను అనుకుంటూ, చిన్నబోయిన ముఖంతో ముందుకు సాగిందది.
దాని ముఖ కవళికలను గమనించిన కోతి, కొంచెంగా అనుమానిస్తూనే- "మిత్రమా! ఇప్పుడు నీ ముఖం మరో విధంగా అనిపిస్తున్నది. ఇంతకు ముందున్న ఉత్సాహం ఇప్పుడు నీలో కనిపించటం లేదు. నీ మనసు ఏదో ఆలోచనకు బందీ అయి, ఏదో తత్తరపాటుకు గురవుతున్నట్లున్నది.
శరీరాలు 'మనోవ్యాధికి, రోగానికి, ముసలితనానికి ఆలవాలాలు' అని పెద్దలు చెబుతారు. ఇంట్లో నా చెల్లెలు బాగానే ఉన్నది కదా?!" అని అడిగింది మొసలిని.
(ఇక మొసలి ఏమన్నదో మళ్ళీ చూద్దాం....)