అనగనగా ఒక ఊళ్లో వీరాస్వామి అనే ధనిక వ్యాపారి ఒకాయన ఉండేవాడు. ఆయనకు పట్నంలో పెద్ద పెద్ద దుకాణాలు మూడు నాలుగు ఉన్నా, పల్లె ప్రజల పట్ల సానుభూతితో వారానికొక పల్లెలో బండెడు సరుకులు సరసమైన ధరలకు అమ్మి రావాలని నియమం పెట్టుకున్నాడు.
అట్లా ఆయన ఒకసారి తన దగ్గర ఉన్న సరుకులను అమ్మటం కోసం ఎద్దుల బండిలో బయలుదేరాడు. పట్నం దాటి కొంత దూరం వెళ్ళే సరికి, అడవి దారిలో దోపిడి దొంగల మూక ఒకటి ఎదురయిందాయనకు. సరుకులున్న బండిని ఎద్దులతో సహా ఎత్తుకెళ్ళిపోవటమే కాకుండా, అడ్డువచ్చిన వీరాస్వామి ఒంటిమీది నగలన్నీ కూడా దోచుకొని, ఆయన్ని బాగా కొట్టి, దారి ప్రక్కన పడేసి మరీ పోయారు దొంగలు. పాపం వీరాస్వామి, చినిగి మట్టిగొట్టుకున్న దుస్తులతో- 'దాహం దాహం!' అంటూ రోడ్డు ప్రక్కన పడి మూలగ సాగాడు.
సరిగ్గా అదే సమయానికి అటుగా పోతున్నాడు కూలి పని చేసే రంగయ్య. దోపిడి దొంగలు ఎవరినో కొట్టి పడేయటం, బండిని ఎత్తుకెళ్ళటం చూసాడతను. కుతూహలం కొద్దీ అక్కడికి వెళ్ళి, మూలుగుతున్న వీరాస్వామిని చూశాడు కూడాను. అయితే 'ఇతను ఎవరో, ఏమో! నామీదికి వస్తే నేనేం చెయ్యను?' అని గబగబా తన దారిన తాను వెళ్ళిపోయాడు.
ఇంకొంచెం సేపటికి చిన్న వ్యాపారి సోమిశెట్టి అటుగా వెళుతూ ఆగి చూశాడు. 'ఎవరో పడి ఉన్నారు. అయినా నాకెందుకులే' అని అతను కూడా ఎంచక్కా తన దారిన తాను పోయాడు.
ఆ తర్వాత ఇంకొంచెం సేపటికి వచ్చిన నిరుద్యోగి రాజేష్ ఆ వీరస్వామిని చూసి, 'అయ్యో పాపం! ఎవరో ఇతను?! దొంగలెవరో ఇతన్ని బాగా కొట్టినట్లున్నారు. పాపం కదా!" అనుకున్నాడు. అతనిది కొంచెం జాలి గుండె. అతను అక్కడ ఆగి, వీరాస్వామిని లేవనెత్తి, గాయాలన్నీ కడిగి, కట్లుకట్టి, మంచి నీళ్ళు తాగించాడు. ఆ తర్వాత అటుగా పోతున్న బండినొకదాన్ని పిలిచి, బండి నడిపేవాడి సాయంతో అతన్ని దగ్గరలో ఉన్న ఒక హోటల్‌కి తీసుకువెళ్ళాడు. చూడగా ఆ హోటల్ యజమాని తనకు తెలిసినవాడే.
రాజేష్ వీరాస్వామిని వాళ్లకు అప్పజెబుతూ "నేను పట్నానికి వెళ్తూంటే ఈయన ఎవరో మరి, దారిలో కనబడ్డాడు. దొంగలు పాపం బాగా కొట్టినట్లున్నారు. ఈయన్ని మీ సంరక్షణలో వదిలి వెళ్తున్నాను. మూడు రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. ఆలోగా ఈయన్ని బాగా చూసుకోండి. మీ వీలును బట్టి డాక్టరుకు చూపించండి. అతనికి ఏమి కావాలంటే అవి పెట్టండి. ఖర్చులు-అవీ ఎలాగైనా సర్దుతానులెండి" అని చెప్పి పట్నానికి పరుగుతీశాడు.
మళ్ళీ రాజేష్ వచ్చే సరికి వీరాస్వామి కోలుకున్నాడు. "అతను బాగున్నాడు రాజేష్, లోపల ఉన్నాడు వెళ్ళి చూడు" చెప్పాడు హోటల్ యజమాని.
రాజేష్ వీరాస్వామిని కలిసి, అతను లేచి తిరగ గల్గుతున్నందుకు సంతోషపడి "ఇంతకీ ఎవరు నువ్వు? ఎక్కడికి వెళుతున్నావు? నిన్ను కొట్టి పడేసిన వాళ్ళెవరు?" అని అడిగాడు.
"నా పేరు వీరాస్వామి బాబూ. నేను ఒక వ్యాపారిని. నాదగ్గర ఉన్న సరుకులను అమ్మడానికి పక్క ఊరికి వెళుతుండగా దొంగలు నన్ను కొట్టి, నా సరుకులను అన్నిటినీ దోచుకొని వెళ్ళారు. 'దాహం దాహం' అంటున్నా ఎవరో ఇద్దరు ఆ దారిన పోతున్నవాళ్ళు, కనీసం త్రాగడానికి నీళ్ళు కూడా ఇవ్వకుండా వెళ్ళి పోయారు. ఏంచేస్తాం, సమాజం అలా ఉంది. నువ్వు వాళ్ళలాగా కాకుండా మానవత్వంతో నన్ను కాపాడావు. నీ మేలు మరవలేను. ఇంతకీ నీ వివరాలేంటి? ఎవరు నువ్వు, ఏమి చేస్తుంటావు?" అని రాజేష్‌ని అడిగాడు వీరాస్వామి.
"నాదేముంది, నేను ఒక నిరుద్యోగినండీ- ఉద్యోగం వెతుక్కుంటూ పట్టణానికి బయలుదేరాను. దారిలో రోడ్డు ప్రక్కన పడి కనిపించారు మీరు. సరే, అక్కడికి దగ్గర్లోనే నాకు తెలిసిన హోటల్ ఒకటి ఉంటేనూ, ఆ హోటల్ యజమానికి మిమ్మల్ని అప్పజెప్పి నా పని మీద నేను వెళ్ళాను. ఆయనే మిమ్మల్ని కనిపెట్టుకుని ఉన్నారు ఈ మూడు రోజులుగా" అన్నాడు రాజేష్. మరి నీ ఉద్యోగం సంగతి ఏమైంది? ఏదైనా దొరికిందా?" అడిగాడు వీరాస్వామి.
రాజేష్ కొంచెం సిగ్గు పడుతూ "ఇంకా ఏమీ లేదండి. వచ్చే వారం మళ్ళీ రమ్మన్నారు" అన్నాడు.
"నీకు సమ్మతం అయితే నేను నీకు ఉద్యోగం ఇస్తాను- నీలాంటి వాడి కోసమే, నేను ఇన్ని రోజులు వెతుకుతూ ఉన్నది" అని అతనిని పనిలో పెట్టుకున్నాడు వీరాస్వామి.
బాధ్యత, మంచితనం ఉన్న రాజేష్‌కి వీరాస్వామి త్వరలోనే తన వ్యాపార బాధ్యతనంతా అప్పజెప్పాడు!