అనగనగా ఒక అందమైన అడవి. అడవి మధ్యలో ఒక పేద్ద, అందమైన కొలను. కొలను నిండా ఎప్పుడూ పుష్కలంగా నీళ్ళు. కొలను చుట్టూ ఎవరో నాటినట్లు రకరకాల పండ్ల చెట్లు. కొలను నిండా బాతులు, కొంగలు, హంసలు, చేపలు, తాబేళ్లు! పండ్ల చెట్లనిండా కాకులు, చిలకలు, గోరువంకలు ఇలా ఎన్నో పిట్టలూ, వాటితో పాటు ఉడతలు, కోతులు, తొండలు! అవన్నీ అక్కడ ఎంతో స్నేహంగా కలిసి మెలిసి జీవిస్తున్నాయి.
రోజూ పొద్దున్నే పక్షులు, జంతువులు వేటకు బయలుదేరతాయి. సాయంత్రానికి గానీ తిరిగి రావు. వెళ్లే ముందు జంతువులు, పక్షులు అన్నీ తమతమ పిల్లలకు జాగ్రత్తలు చెప్పి వెళతాయి- "చిన్నా! అటు ఇటూ తిరగొద్దు. వేరే జంతువులతో జాగ్రత్త" రోజూలాగే చెప్పింది జింక తన పిల్లతో.
"తల్లీ! నువ్వింకా చిన్నదానివి. నీ రెక్కలు ఇంకా బలం పుంజుకోలేదు. గూటిలోంచి ఎగరి క్రింద పడకు- జాగ్రత్తగా ఉండు" అన్నది కాకి తన పిల్లతో.
"పెద్దోడా! చెళ్లెళ్ళను, తమ్ముళ్ళను జాగ్రత్తగా చూసుకో. ఎటూ వెళ్ళనివ్వద్దు" అన్నాడు తండ్రి తాబేలు తన పెద్ద కొడుకుతో. "బేబీ! నేనొచ్చేటప్పుడు నీకో మంచి చేపను తెస్తాను- చేపలంటే నీకిష్టం కదా!" అన్నది ఎలుగుబంటి తన పిల్లతో.
"సరేనమ్మా, సరే నాన్నా!" అన్నాయి పిల్లలన్నీ వాటి అమ్మానాన్నలతో.
పెద్దవన్నీ అటు వెళ్ళగానే పిల్లలన్నీ ఒక చోట చేరాయి:
"ఏ ఆట ఆడుకుందాం ఈరోజు?" అడిగింది కాకి పిల్ల- మెరుస్తున్న కళ్ళతో.
"ఎగిరే పందాలు ఆడదాం" అంది డేగ పిల్ల, ఉత్సాహంగా ఎగురుతూ.
"మేం ఎగరలేం కదా, మరి మాకెట్లాగ?" అడిగింది పందిపిల్ల సందేహంగా.
"సరేలే, రోజూలాగే కోతికొమ్మచ్చి ఆడుకుందాం!" అంది చంటి. కోతిపిల్లల గుంపులో అన్నింటికంటే చిన్నది చంటి. బొద్దుగా, చలాకీగా ఉంటుందది- పిల్లలన్నిటికీ చంటి అంటే చాలా ఇష్టం. "సరే సరే" అన్నారు అందరూ ఉత్సాహంగా.
ఆట మొదలైంది. ఇక అక్కడంతా సందడే సందడి: కొన్ని ఎగురుతున్నాయి, కొన్ని దూకుతున్నాయి, కొన్ని ఉయ్యాలలు ఊగుతున్నాయి, కొన్ని అరుస్తున్నాయి, కొన్ని నవ్వుతున్నాయి- అంతలో ఉన్నట్టుండి నల్ల చెవుల తెల్ల కోతి పిల్ల ఆడడం ఆపేసింది.
"ఏంటి? ఏమయింది?!" అన్నాయి అన్నీ విచిత్రంగా దానివైపు చూస్తూ.
"ఎప్పుడూ కోతికొమ్మచ్చి ఆడి, ఆడి బోరు కొడుతున్నది. ఇంకేదైనా ఆట ఆడదాం" అంది ముఖం అదోలా పెడుతూ.
"గోళీలాట ఆడదాం!" అంది నల్ల కోతి కళ్ళు తిప్పుతూ.
"మాకు చేతులు లేవుగా, మేమెట్లా ఆడతాం?" అంది పిచ్చుక పిల్ల.
"క్రికెట్ ఆడుదాం!" అంది జీబ్రా పిల్ల.
"మాకు రాదు" అన్నాయి ఆడపిట్టలన్నీ.
"పరుగు పందెం పెట్టుకుందామా?" అడిగింది తాబేలు పిల్ల.
"నేనే గెలుస్తాను!" అంది కుందేలు పిల్ల.
"ఆగండాగండి- నాకొక ఐడియా వచ్చింది. దాగుడు మూతలు ఆడదాం!" పైకి, కిందికి దూకుతూ అంది చంటి. అందరికీ ఈ ఆలోచన నచ్చింది. "భలే- భలే!" అంటూ చప్పట్లు కొట్టారు.
"ఒకటి...రెండు... మూడు..” లెక్క పెట్టడం మొదలు పెట్టింది కొంగ పిల్ల.
తాబేలు పిల్ల పోయి నీళ్ళల్లోని రాయి కింద దాక్కుంది. బాతు పిల్ల పోయి నీటి మొక్కల్లో నక్కింది. బల్లి పిల్ల చెట్టు బెరడులో దూరింది. కోతి పిల్లలు వెళ్ళి ఆకు గుబుర్లలో దాక్కున్నాయి. పిట్ట పిల్లలు గూళ్ళ కింద పుల్లల్లో ఇరుక్కొని కూర్చున్నాయి.
చంటికేమో ఓ చెట్టు కాండానికి ఉన్న చిన్న తొర్ర ఒకటి కనిపించింది. దానిలోకి దూరదామనుకుంటే వీలవ్వలేదు. చివరికి బాగా ప్రయత్నించాక, పట్టలేక పట్టలేక- దూరింది.
"ఎక్కడ దాక్కున్నారు వీళ్ళంతా? ఆగండి, వెతికి పట్టుకుంటా. ఒక్కళ్ళూ దొరక్కుండా ఎలా ఉంటారు?" అంటూ వచ్చింది కొంగపిల్ల పది లెక్కపెట్టిన తరువాత.
చెట్టు వెనుక, పుట్ట వెనుక, గూళ్ళల్లో, ఆకుల్లో అంతటా చూసింది. బండరాయి వెనుక నుండి నక్కి నక్కి చూస్తున్న నక్క పిల్ల కనిపించింది దానికి.
"పట్టుకున్నా, పట్టుకున్నా! అవుట్, అవుట్!" అంటూ గబుక్కున నక్కపిల్ల మీద వాలింది కొంగపిల్ల. "నక్క అవుట్, నక్కబావ అవుట్!" అంటూ బిలబిలా బయటికొచ్చాయి మిగిలిన పిల్లలు. అన్నీ వచ్చాయి; కానీ చంటి కనిపించలేదు.
"చంటీ! చంటీ!"... ఎంత పిలిచినా రాదే?!
అందరూ ఆదుర్దాగా వెతకటం మొదలు పెట్టారు. "చంటీ!చంటీ!" అని అరిచారు.
అప్పుడు వినిపించింది- "ఊ...ఊ..." అంటూ ఎవరో ఏడుస్తున్న శబ్దం! 'ఎక్కడినుండి వస్తోంది?' అని చూస్తే ఒక తొర్రలోనుండి.
పిల్లలంతా ఆ చెట్టు చుట్టూ గుమిగూడాయి. చెట్టు కాండానికి ఒక చిన్న రంధ్రం ఉంది. ఆ రంధ్రంలోంచి చంటిది ఒక కన్ను సగం ముక్కు మాత్రమే బయటికి రాగల్గుతున్నాయి.
"అసలు ఇంత చిన్న రంధ్రం లోకి నువ్వు ఎలా దూరావే?" అంది బాతు పిల్ల.
"దాక్కునే తొందరలో ఎలానో ఒకలా దూరిందిలే, నువ్వాగు!" అన్నది కుందేలు.
"నన్ను బయటికి లాగండి- ప్లీజ్. నేను రాలేకపోతున్నాను" ఏడుస్తూ అంది చంటి.
"భయపడకు చంటీ- మేమందరం నీకు సాయం చేస్తాం" అన్నారందరూ ఏకకంఠంతో.
"ఆగండాగండి" అందర్నీ నెట్టుకుంటూ ముందుకొచ్చాయి ఉడతపిల్లలు- "చంటీ, మేం మా తోకల్ని తొర్రలోకి పెడతాం. నువ్వు వాటిని గట్టిగా పట్టుకో. అప్పుడు మేం నిన్ను బయటికి లాగుతాం" అని అవి చెప్పగానే చంటి వాటి తోకల్ని గట్టిగా పట్టుకుంది.
ఉడతపిల్లలు తమ బలాన్నంతా కూడగట్టుకుని లాగాయి. వాటి తోకలు నొప్పిపుట్టాయిగానీ చంటి మాత్రం బయటికి రాలేదు.
"అమ్మో మావల్ల కాదు బాబోయ్" అంటూ తోకలు పైకెత్తేశాయి ఉడతపిల్లలు.
"ఉండండి- మేం ప్రయత్నించి చూస్తాం" అని ముందుకొచ్చాయి కొంగపిల్లలు. "చంటీ! మేం మా పొడవాటి ముక్కుల్ని తొర్రలోకి దూరుస్తాం. నువ్వు వాటిని గట్టిగా పట్టుకో. మేం నిన్ను బయటికి లాగేస్తాం" అన్నాయి కొంగపిల్లలు.
తొర్రలో ఉన్న చంటి వాటి ముక్కుల్ని గట్టిగా పట్టుకుంది. బలాన్నంతా ఉపయోగించి బయటికి లాగాయి కొంగపిల్లలు. చంటిమాత్రం బయటికి రాలేదు.
"బాబోయ్, మా ముక్కులు వంకరపోయాయి. ఇక మావల్ల కాదు" చెప్పేసాయి కొంగపిల్లలు.
అంతలో జింకపిల్లకు అద్భుతమైన ఉపాయం ఒకటి తట్టింది- "పిలవండి, పిలవండి- వడ్రంగిపిట్ట పిల్లల్ని పిలవండి" అంటూ అరిచింది.
"ఏంటి అట్లా అరుస్తున్నావు- ఆ పిల్లలేం చేస్తాయి?" అడిగింది గాడిదపిల్ల అమాయకంగా.
"నే చెబుతానుగా, తొందరపడకండి" అంది జింకపిల్ల గర్వంగా. అందరూ అటు ఇటూ పరుగెత్తుకెళ్లి, చివరికి వడ్రంగిపిట్ట పిల్లల్ని పిలుచుకొచ్చారు.
"ఏమిటి? ఏమిటి?" కంగారుగా అడిగాయవి, గుంపులోకి చేరుకొని. "చూడండి, మన చంటిగాడు పోయి ఈ చెట్టు తొర్రలో ఇరుక్కున్నాడు. అందుకని ఇప్పుడు మీరు ఆ రంధ్రం చుట్టూ తొలవండి. రంధ్రం పెద్దదవుతుంది; దాంతో చంటి బయటికి వస్తాడు!" అంది జింకపిల్ల గొప్పగా. పిల్లలంతా దాని తెలివి తేటల్ని పొగిడారు.
వెంటనే వడ్రంగిపిట్ట పిల్లలు పనిలోకి దిగాయి. వాడిగా ఉండే ముక్కులతో రంధ్రం చుట్టూ తొలవసాగాయి. వాటి చిన్ని ముక్కులు నొప్పి పుట్టేదాకా పొడిచాయి. రంధ్రం కొంచెం పెద్దదయింది- "అమ్మో! మా ముక్కులు నొప్పి పుడుతున్నాయి. మేమింక పొడవలేం బాబోయ్!" అనేశాయవి, ముక్కుల్ని నొక్కుకుంటూ.
"సరేలే, మీరింక పొడవటం ఆపండి. అందరం కలసి చంటిని బయటికి లాగుదాం" అన్నారు మిగిలినవాళ్లు.
దుబ్బకోతి తన చేతుల్ని తొర్రలోకి దూర్చింది. చంటిని గట్టిగా పట్టుకుంది. దాన్ని తొండపిల్ల, ఆ వెనుక కాకి పిల్ల, ఆపై చిరుతపిల్ల- అలా ఒకళ్లనొకళ్ళు పట్టుకుని, గట్టిగా లాగారు. "టప్" మని సీసా మూతిలోంచి బెండు ఎగిరొచ్చినట్లు బయటికి వచ్చి పడింది చంటి!
"హే! హే! మన చంటి బయటికి వచ్చింది" అంటూ పిల్లలంతా నాట్యం చేసారు. బయటికొచ్చిన చంటికి మాత్రం చాలా సిగ్గనిపించింది. తలవంచుకొని, ముఖం ముడుచుకుని నిల్చున్నది.
దాన్ని చూసి 'కూ-కూ' అని కోయిలపిల్లలు, 'కావ్-కావ్' అని కాకి పిల్లలు, 'కిచ్-కిచ్' అని కోతిపిల్లలు, 'కిల-కిల'మని పక్షిపిల్లలు, 'టప-టప' రెక్కలాడిస్తూ కొంగపిల్లలు కడుపుబ్బ నవ్వసాగాయి.
"ఛీ! ఏ ఆటైనా ఆడచ్చు గానీ దాగుడుమూతలు మాత్రం ఆడకూడదు!" అనుకుంది చంటి, 'ఈసారి ఎక్కడ దాక్కుంటే నయమా?..' అని ఆలోచిస్తూ.