రెండు సంవత్సరాల క్రితం, ఓసారి వేసవి సెలవులొచ్చాయి. మరి నాకేమో వేసవి సెలవులంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే, సెలవులొచ్చాయంటే చాలు- మేం మా బాబాయిగారి ఇంటికి వెళ్తాము. వాళ్ళు విశాఖపట్నంలో ఉంటారు. వాళ్ళింటికి వెళ్తే సముద్రం, స్టీల్ ప్లాంటు అన్నీ చూడచ్చు. బలే సరదాగా ఉంటుంది. అట్లా ఆ ఏడాది కూడా మా బాబాయిగారి ఇంటికి వెళ్ళాం. అంతకు కొద్ది రోజుల ముందే మా బాబాయి వాళ్ళు కొత్తగా కారు ఒకటి కొనుక్కున్నారు.

మాకందరికీ దాన్ని చూస్తే చాలా మోజుగా ఉండేది. మరో రెండు రోజులు గడిచాక ఆ అవకాశం వచ్చింది- మా బాబాయి, నేను, మా తమ్ముడు కారులో షాపింగుకి వెళ్ళి ఏవేవో చాలా సామాన్లు కొనుక్కున్నాం! అయితే ఆ పనులన్నీ పూర్తయ్యే సరికి చీకటి పడింది. బాబాయిదేమో అంతగా అలవాటు లేని డ్రయివింగు! ఎదురుగుండా వచ్చే వాహనాల లైట్లవల్ల కళ్ళు మిరుమిట్లు గొల్పుతుంటే, కళ్ళకు చేతులు అడ్డం పెట్టుకొని, కళ్ళు చికిలించుకొని చూస్తూ నడపటం మొదలుపెట్టాడు. చివరికి ఎదురుగా వస్తున్న మోటర్ సైకిల్‌ ఒకదాన్ని తప్పించబోయి రోడ్డు ప్రక్కనే ఉన్న చెట్టుకు గుద్దేశాడు కారును!

అందరూ చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు; కానీ నా కాలుకు మాత్రం గట్టి దెబ్బే తగిలింది. డాక్టర్ గారి దగ్గరకు వెళితే ఐదు నెలలు విశ్రాంతి తీసుకోమన్నారు. ఇక దాంతో నా బడి కూడా హుష్ కాకీ అయ్యింది. నన్ను అక్కడే వదిలేసి మా అమ్మావాళ్ళంతా మా ఊరికి వెళ్ళిపోయారు. నా కారు మోజు అట్లా వదిలిపోయింది.

సరే అది అట్లా అయ్యిందా, ఊరికే పడుకొని, ఏవో పుస్తకాలు చదువుకుంటూ ఎలాగో నెలలు గడిపాను. మెల్లగా నా కాలు కూడా బాగైంది. ఇంకా కొద్ది రోజుల్లో దీపావళి పండగ అనగా మా అమ్మ వాళ్లంతా వచ్చారు. పండగ అయిపోగానే నన్నూ తీసుకువెళ్తారన్న మాట. మళ్ళీ బడి మొదలు. అప్పటికి ఇంకా దీపావళి రెండు రోజుల్లో ఉంది- అంతలోనే మరో సంఘటన జరిగింది:

పండగ కోసమని ముందుగానే నేను, మా తమ్ముడు టపాసులు కొనుక్కున్నాం. ఆ టపాసులన్నీ బాగా పేలాలంటే వాటిని చక్కగా ఎండబెట్టాలన్నాడు బాబాయి. దాంతో వాటిని ఓ చెక్క పలక మీద పరిచి, ఇంటి ముందు ఎండలో పెట్టాం. నేను, మా తమ్ముడు వాటికి కొంచెం దూరంగా ఉండి ఆడుకుంటున్నాం.

అంతలో మాతమ్ముడు వాటిలో నుంచి ఒక అగ్గిపెట్టె తీసుకొచ్చి కాల్చటం మొదలు పెట్టాడు. ఓ వైపున అగ్గిపుల్లలు కాలుతుంటే, వాటిని పైకి ఎగరేసి చూస్తే బలే ఉంటుంది కదా, అట్లా నేను కూడా అగ్గిపుల్లని కాల్చి, ఎగరేసి ఆడుకోవటం మొదలెట్టాను.

అంతలోనే ఒక అగ్గిపుల్ల- వెళ్ళి ఎండబెట్టిన టపాకాయల కుప్ప మీద పడింది. మరుక్షణం టపాకాయలన్నీ పేలాయి! 'ఠప ఠప..ధనాల్ ధనాల్..ఫట్ ఫట్..ఢాం..'లతో ఇల్లంతా మారుమ్రోగి-పోయింది. రాకెట్లు 'జుయ్..'మని ఎటు పడితే అటు ఉరికాయి. భూ చక్రాలు అంటుకొని గిరగిరా తిరగటం మొదలెట్టాయి. ఒక్క సారిగా చిచ్చుబుడ్లన్నీ 'సుయ్..' మంటూ వెలుగులు విరజిమ్మేశాయి!

అప్పుడు ఎంత భయం వేసిందో మరి- మా చేతులు, కాళ్ళు వణకడం మెదలెట్టాయి. నేను, మా తమ్ముడు ఇద్దరం మాటల్లేకుండా పడిపోయాము. అందరూ వచ్చి- 'ఏమయిందిరా?' అని అడుగుతుంటే ఒక్కరం కూడా మాట్లాడ-లేకపోయాము. నాకు కూడా ఎక్కడాలేని ఏడుపు వచ్చింది; కాని నోరు మాత్రం పెగల లేదు! చుట్టుపక్కల వాళ్లంతా 'ఎక్కడైనా‌ డైనమైటు పేలిందేమో' అనుకున్నారట!

ఇంక ఆ రోజునుండీ నాకు మా తమ్ముడికి కూడా ఇప్పటి వరకూ టపాకాయలంటేనే ఎంతో భయం పట్టుకున్నది. ఇప్పటికీ నేను దీపావళి పండుగకు టపాకాయలు కాల్చను.

ఇప్పుడైతే పర్యావరణం పాడవుతుందని టపాకాయలు కాల్చటం అసలే మానేశాననుకోండి. అయినా, ఈ సంగతిని గుర్తుచేసుకోకుండా ఏ దీపావళీ గడవలేదంటే నమ్మండి! మీరూ జాగ్రత్త, మరి- దీపావళి వచ్చేస్తోంది కదా!