అనగనగా ఒక ఊరిలో భాను అనే బర్ఫీ వాడు ఉండేవాడు. రోజూ బర్ఫీ దుకాణం తెరిచి, ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఉండేవాడు. 'భాను బర్ఫీలు ఎంత బాగున్నాయో' అని అందరూ అనుకునేవాళ్ళు.
ఒకరోజున ఎవరో వింత వ్యక్తి ఒకడు భాను ముందుకు వచ్చి నిలబడ్డాడు. పొడవాటి దుబ్బ అంగీ లాంటి జ్యాకెట్ వేసుకొని ఉన్నాడతను.
భాను అతనెవరో చూడలేదు గానీ, అతను వేసుకున్న దుబ్బ జ్యాకెట్టును చూసి ఆశ్చర్యపోయాడు. "ఏం రా? ఇంత వేడికి జ్యాకెట్ ఎందుకు వేసుకున్నావు?" అని అడిగాడు.
"వేడిగా ఎక్కడుంది, ఇంత చల్లగా ఉంటేనూ!?" అని వికవికా నవ్వాడు ఆ దుబ్బ అంగీ వాడు.
"ఏంటి ఇట్లా నవ్వుతున్నాడు?" అని అతని వైపుకు చూసిన భాను నిర్ఘాంతపోయాడు-
ఆ జ్యాకెట్ వేసుకున్నవాడు అసలు మనిషి కాదు! ఒక దయ్యం!!
"నువ్వు తీసెయ్యమంటున్నావు గనక తీసేస్తున్నాను. ఇప్పుడు నువ్వు నన్ను చూసి దడుచుకుంటే అది నా బాధ్యత కాదు-" అంటూ జ్యాకెట్ని తీసి పడేసింది ఆ దయ్యం.
ఆ దయ్యానికి చేతులు లేవు, కాళ్ళు లేవు. అది జ్యాకెట్ తీసే సరికి నిజంగానే భాను చాలా భయపడ్డాడు.
భాను భయపడటం చూసి దయ్యానికి చాలా సంతోషం వేసింది. "ఆహా, ఇన్ని సంవత్సరాలుగా తిరుగుతున్నాను. ఇంత భయాన్ని అసలు చూడలేదు. ఇంత చక్కని ఆహారం అంతకన్నా అస్సలు చూడలేదు. ఇప్పుడు నీ పుణ్యమా అని నాకు నీలాంటి చక్కని ఆహారం దొరికింది. అదిగూడా ఎంచక్కా నేనంటే భయపడే ఆహారం! ఏమి నా అదృష్టం!" అంటూ భాను మీదికి ఎగిరి దూకింది.
దయ్యం తనమీదికి దూకగానే కీచుమని అరిచిన భాను నోటిలోంచి తనంతట తానే ఓ సలహా వెలువడింది- "అయ్యో నన్ను తినొద్దు! నాకు భార్యా, పిల్లలు ఉన్నారు. కావాలంటే ఈ బర్ఫీలు తిను! నాకంటే ఇవే తియ్యగా ఉంటాయి!" అని.
"బర్ఫీలంటే ఏంటి?" అడిగింది దయ్యం, టక్కున ఆగి.
"ఇవిగో ఇవే! ఇందాకటి వరకూ అందరూ వీటినే కదా, అడిగి అడిగి మరీ కొనుక్కుపోతున్నారు?!" అని బర్ఫీలున్న ప్లేటును దాని ముందుకు జరిపాడు భాను.
దయ్యం నోరు ముందుకు పెట్టి ఒక్కటొక్కటిగా బర్ఫీలన్నీ తిని, "అబ్బా ఎంత బాగున్నాయో!" అని నాలుక చప్పరించింది. ఆ తర్వాత మరేదో ఐడియా వచ్చినట్లు "సరే! అయితే నిన్ను తిననులే! కానీ మరి నువ్వు రోజూ నాకు బర్ఫీలు చేసి పెట్టాలి సరేనా?" అన్నది భానుతో.
"బ్రతికాం! అంతే చాలు" అనుకున్న భాను దానికి సంతోషంగా ఒప్పుకున్నాడు. అటుపైన కొన్నాళ్లపాటు తను ఇచ్చిన మాట ప్రకారం రోజూ అన్నన్ని బర్ఫీలు చేసి దయ్యానికి ఇచ్చి తినిపించాడు గానీ, కొన్నాళ్లకి భానుకి దయ్యం అంటే భయం పోయింది. అంతేకాక రోజూ దానికి బర్ఫీలు ఉచితంగా తినిపించి-తినిపించి అతను కాస్తా ఇప్పుడు పేదవాడు అయిపోయాడు. మరి భాను ఎంత శ్రమపడ్డా తన శ్రమకి తగినన్ని డబ్బులు రావట్లేదు కదా!
దాంతో ఒక రోజున భానుకు దయ్యం మీద ఎక్కడ లేని కోపం వచ్చింది. చటుక్కున పోయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒక రోజున దయ్యం దుకాణంలో నిలబడి బర్ఫీలు తింటుండగా పోలీసు దాని వెనుక నిలబడి తుపాకీ గురిపెట్టి 'హాండ్స్ అప్' అని అరిచాడు. దయ్యం అతన్ని పట్టించుకోలేదు. "ఒక్క నిమిషం- నేను బర్ఫీలు తినాలి. తర్వాత మాట్లాడదాం" అంది.
'నేను నిన్ను అరెస్టు చేయడానికి వచ్చాను- నువ్వు బర్ఫీలు తింటుంటే చూడడానికి కాదు!" అన్నాడు పోలీసు చికాకుగా.
'సరే నువ్వు నన్ను 'హాండ్స్ అప్' అన్నావు, కానీ నాకు హాండ్స్ లేవుగా?" అని మాయమైపోయింది దయ్యం-"ఈ భానుకి, వీళ్లందరికీ నేనంటే భయం పూర్తిగా పోయింది. భయం లేని చోట నేను ఉండీ లాభం లేదు. భయపడని వాళ్ల మాంసం నాకు అరగదు కూడానూ. ఏం చేసేది, మరో చోటు వెతుక్కుంటాను. మరి అక్కడ బర్ఫీలు దొరుకుతాయో, లేదో, చూడాలి!" అనుకుంటూ.