సత్య జిత్తు చాలా ధనవంతుడు. అతనికి ఇద్దరు కొడుకులు- అజయ్, విజయ్.
'వాళ్ళిద్దరూ జీవితంలో ఎలా పైకి వస్తారు?' అని అతనికి దిగులుగా ఉండేది.
అందుకని ఒకసారి వాళ్ళిద్దరినీ పిలిచి అన్నాడు సత్యజిత్తు- "అబ్బాయిలూ, నేను పెద్దవాణ్ణయ్యాను. ఏవేవో పీడకలలు వస్తున్నాయి. ఇంకా ఒక సంవత్సరం కూడా బ్రతకనేమో అనిపిస్తున్నది. మీ ప్రయోజకత్వం కళ్ళారా చూసి చనిపోవాలని ఉంది. అందుకని మీకిద్దరికీ ఓ పరీక్ష పెడుతున్నాను. ఇందులో నెగ్గిన వారికి మొత్తం ఆస్తిని సంరక్షించే బాధ్యత అప్పగిస్తాను" అని.
"ఏంటా పరీక్ష, నాన్నగారూ?" అడిగాడు విజయ్.
"ఈ వయసులో మాకు పరీక్షలేంటండీ?!" చికాకు పడ్డాడు అజయ్.
సత్యజిత్తు సైగ చెయ్యగానే, పనివాడు నాగయ్య రెండు కుండలు పట్టుకొచ్చాడు. రెండూ మూతి బిగించి ఉన్నాయి.
"వీటిలో వరహాలున్నాయి. ఆరు నెలల్లో వీటిని రెట్టింపు చేసి నాకు చూపించాలి! ఏం చేస్తారో, ఎక్కడికి వెళతారోమీ ఇష్టం" చెప్పాడు సత్యజిత్తు.
ఇద్దరూ తమ తమ గదులకెళ్ళి కుండలు తెరిచి చూసుకున్నారు.
"అరే! సగం కుండ ఖాళీగానే ఉంది! వరహాలున్నది సగమే- వీటితో నేనేం చెయ్యాలి?!" అజయ్ నిరుత్సాహపడ్డాడు.
"ఓహ్! సగం కుండనిండా వరహాలున్నాయి- ఇంకేమి?! వీటితో ఏదైనా సాధించవచ్చు" అన్నాడు విజయ్ ఉత్సాహంగా.
విజయ్ తూర్పు వైపుకు, అజయ్ పడమటవైపుకు వెళ్ళారు.
విజయ్ పొరుగున ఉన్న నగరానికి చేరుకొని, చిన్న చిల్లరకొట్టు ప్రారంభించాడు. తనకు అంతా మంచే జరుగుతుందన్న విశ్వాసంతో వ్యాపారం చేశాడు. మొదట్లో అతను ఒడుదుడుకులు చాలా ఎదుర్కొనవలసి వచ్చింది. కానీ అతని నిజాయితీ- అతని పట్టుదల క్రమేణా ఆ ఊరి ప్రజలను ఆకర్షించాయి. అతను మెల్లగా వ్యాపారంలో పుంజుకున్నాడు.
ఇక పడమటవైపుకు వెళ్ళిన అజయ్ మరొక నగరం చేరుకున్నాడు. అతనికి ఆ ఊరినిండా మోసగాళ్ళు, దుర్మార్గులు కనిపించారు. వ్యాపారం చేద్దామంటే ఉన్న వరహాలు చాలవని అనుమానం వచ్చింది అజయ్‌కి. ఎలాగో ఒకలాగా చేసినా వ్యాపారం సక్రమంగా జరగదనిపించింది; లాభాలు రావనిపించింది; ఊళ్ళో ఎవరిని నమ్మచ్చో అర్థం కాలేదు.
అందుకని కొన్నాళ్ళు ఆ ఊరి ప్రజలను గమనించాలనుకున్నాడు- ఏ వ్యాపారమూ చేయకుండా ఊరికే అందరినీ విచారిస్తూ కూర్చున్నాడు.
ఒకసారి విజయ్ అతన్ని వెతుక్కుంటూ వచ్చి, అతని సంపాదన ఎంతదాకా వచ్చిందని అడిగాడు.
"సోదరా!ఈ ఊళ్ళో అంతాదొంగలే!ఇక్కడ వ్యాపారం చేస్తే నెత్తిమీద గుడ్డ వేసుకోవాల్సిందే!" చెప్పాడు అజయ్.
"మరి ఇన్నాళ్ళు ఇక్కడ కాలయాపన ఎందుకు చేసావు? వేరే ఊరుకు పోయి ఉండాల్సింది!" సలహా ఇచ్చాడు విజయ్.
"నిజం! నాకు ఆ ఆలోచనే రాలేదు!" ఒప్పుకున్నాడు అజయ్.
వెంటనే మరోఊరుకు పయనమైపోయాడు.
అక్కడ అందరూ అజయ్‌ని దొంగలా చూడసాగారు. ఏమంటే పొరుగూళ్ళనుండి వచ్చిన వ్యాపారులందరూ స్థానికులను నమ్మించి మోసంచేసి పోయారక్కడ!
అందుకని అతను ఏవ్యాపారం మొదలెడదాం అని చూసినా స్థానికులనుండి వ్యతిరేకత, నిరాదరణ ఎదురయ్యాయి.
అజయ్ మరొక ఊరుకెళ్ళాడు. అక్కడ ప్రజలందరూ బీదవాళ్ళుగా కనిపించారు. అందరూ డబ్బుకు కటకటలాడుతున్నారు. ఎంత వడ్డీకయినా అప్పులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంటనే అజయ్ వడ్డీ వ్యాపారం ప్రారంభించాడు. అయితే ఎవరిని నమ్మాలో తెలీదు కదా, అందుకని బంగారు నగలు, స్థలాలు, ఇళ్ళు తాకట్టు పెట్టుకోవటం మొదలుపెట్టాడు.
అలా ఆరు నెలల కాలం ముగిసింది.
అజయ్-విజయ్ ఇద్దరూ తండ్రి దగ్గరికి వచ్చారు .
"ఏం సాధించారు?" అని అడిగాడు సత్యజిత్తు ఆతృతతో.
"నాన్నగారు,మీరిచ్చిన వరహాలతో వెచ్చాల వ్యాపారం చేశాను. రెట్టింపు చేశాను- చూడండి" అంటూ విజయ్ తండ్రి ఇచ్చిన కుండ నిండా వరహాలు చూపించాడు.
"నేను వడ్డీ వ్యాపారం చేశాను. మూడు రెట్లు సంపాదిస్తాను-" అంటూ పత్రాలు చూపించాడు అజయ్. "ఇవి తాకట్టు పెట్టుకున్నాను. గడువులోపు చెల్లించకపోతే ఇవన్నీనా సొంతం. ఇంకో నెలలో ఇవన్నీనావైపోతాయి" చెప్పాడు.
సత్యజిత్తు వాటిని చూడగానే గుర్తించాడు- అవి నకిలీవి! న్యాయస్థానంలో చెల్లవు!
ఈ సంగతి తెలుసుకొని అజయ్ నిశ్చేష్టుడైపోయాడు. "అందుకే, ఏమీ చేయకూడదనుకున్నాను"అన్నాడు.
"అజయ్! నీ దృక్పథం మార్చుకోవాలి. నిరాశతోటీ, నిస్పృహతోటీ జీవితంలో ఏమీ సాధించేది ఉండదు. ఏమీ చెయ్యకుండా ఊరుకోవటంకంటే ఏదో చేసి నష్టపోవటం కూడా మంచిదే! పోయిందేదో పోయింది. మీ అన్న విజయ్ ధీరుడు. అతని సలహాలు తీసుకుంటూ పనిచెయ్యి. స్వతంత్రంగా చెయ్యద్దులే, ప్రస్తుతానికి" అన్నాడు సత్యజిత్తు, అజయ్‌ని మందలించి విజయ్‌కి ఆస్తి బాధ్యతలప్పగిస్తూ.